పంచాయతీ నీరు.. పొలానికి మళ్లింపు
ద్వారకాతిరుమల: ప్రజలకు పంచాయతీ ద్వారా అందాల్సిన తాగునీటిని.. టీడీపీ కార్యకర్త తాను సాగు చేస్తున్న పొలానికి అక్రమంగా వినియోగిస్తున్నాడు. దాంతో గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని సత్తాలలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ లేదు. దాంతో పంచాయతీ బోరు నుంచి వచ్చే మంచి నీటిని డైరెక్ట్ పంపింగ్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈ తాగు నీటిని, తాను సాగు చేస్తున్న పొలానికి సాగు నిమిత్తం వినియోగిస్తున్నాడని పలువురు చెబతున్నారు. మంచినీటి పైప్‌లైన్‌ను కట్‌చేసి మరీ అక్రమంగా పొలానికి మంచినీటిని మళ్లిస్తున్నాడని, దీని వల్ల తమకు తాగు నీరు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వేసవిలో తమకు మంచినీటి కష్టాలు తప్పవని వాపోతున్నారు. దీనిపై సదరు టీడీపీ కార్యకర్తను ఎన్నిసార్లు మందలించినా ఫలితం లేదని గ్రామ సర్పంచ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment