
పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ
ద్వారకాతిరుమల: మొక్కుబడులు తీర్చుకునేందుకు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి కాలినడకన వెళుతున్న ముగ్గురు యువకులను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, పుల్లలపాడులోని పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం.. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసు దుర్గాప్రసాద్, బిరదా అంజి(20), జాజుమొగ్గల సాయిచరణ్ తేజ ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నారు. మార్గమధ్యంలో పుల్లలపాడు వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు వెళ్తున్న కర్నాటకకు చెందిన లారీ వీరిని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బిరదా అంజి మృతి చెందినట్టు అతని మేనమామ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ

పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ