‘ఆమె ఏం ఇష్టపడతారు?’ అడిగాడొక యువనటుడు తన స్నేహితుడిని అక్కడే ఉన్న ఓ సీనియర్ హీరోయిన్‌ను చూపిస్తూ. ‘ఆమె ఏం ఇష్టపడితే మనకేంగానీ సెట్స్ మీదకు వెళ్లగానే ఆమె కాళ్లకు దండం పెట్టు చాలు’ సలహా ఇచ్చాడు స్నేహితుడు. తర్వాత.. ముంబైలోని చాందీవలీ స్టూడియోస్‌లో ఈ యువనటుడిని ఆ సీనియర్ హీరోయిన్‌కు పరిచయం చేశారు. ఆమె వాత్సల్యంగా అతని భుజం తట్టి ‘ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని చెప్పింది. ఇది ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం. ఆ సీనియర్ హీరోయిన్.. మీనా కుమారి, ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్. ఆ యంగ్‌స్టర్.. ధర్మేంద్ర. .
ధర్మేంద్రను పిచ్చిగా ప్రేమించింది మీనా కుమారి. చూడగానే అతని భవితను అంచనావేయడమే కాదు సినిమా రంగంలో ధర్మేంద్రను నిలబెట్టేందుకూ ప్రయత్నించింది.. ఎంతోమంది నిర్మాత,దర్శకులకు అతని పేరు సిఫారసు చేసి. ధర్మేంద్ర ఎదురుపడేనాటికే మందు సాహచర్యంలో ఉంది మీనాకుమారి. బేషరతుగా తనకు ప్రేమను పంచే మనసు కోసం తపిస్తోంది. నిజాయితీగా తనను లాలించే తోడు కోసం నిరీక్షిస్తోంది. అప్పుడు ధర్మేంద్ర వచ్చాడు ఆమె పట్ల తన కళ్లల్లో ఆరాధన నింపుకొని. దాన్ని మీనాకుమారి ప్రేమ అనుకుంది. తాను ఎదురుచూస్తున్న వ్యక్తి ధర్మేంద్రే అని స్థిరపరచుకుంది.
అతని సాంగత్యంలో ఈ లోకాన్ని మరిచిపోయేది. ఆమెతో ఉన్నంతసేపు అతనూ తన లోకాన్ని పక్కన పెట్టేవాడు. ఆ కాలక్షేపంలో ఆమె అతణ్ణి తన సాంత్వనగా మలచుకునేది. అతను ఆమెనో గురువుగా, గైడ్‌గా భావించేవాడు. తన గురించి అతను ఏమనుకుంటున్నాడోనని ఏనాడూ ఆలోచించలేదు మీనా కుమారి. తాను ఆనందంగా ఉంది చాలు అనే భద్రతను కాపాడుకోసాగిందంతే. ఆమె తన నుంచి ఏం ఆశిస్తోందో అతని మెదడుకి చిక్కినా.. తాను ఎలా ఉండదలుచుకున్నాడో అలాగే ఉన్నాడు. అందుకే కడవరకు కలిసే ఉంటారని నమ్ముకున్న బంధం మూడేళ్లకే ముగిసిపోయింది. మీనా కుమారి మళ్లీ మందు మాయలో పడిపోయింది.
ఆ మూడేళ్లలో..
ఈ ఇద్దరి గురించి వచ్చినన్ని వదంతులు బాలీవుడ్‌లో ఇంకే జంట గురించీ వచ్చి ఉండవు. తర్వాత కాలంలో ఆ రూమర్సే నిజాలుగా, నిజాలు రూమర్స్‌గా ప్రచారం అయ్యాయి. సత్యాసత్యాలు ఈ ఇద్దరి ఆత్మకథల అచ్చులో కనిపించినప్పటికీ ఆ ప్రేమ కథలో ధర్మేంద్ర విలన్‌గా మిగిలాడు. కాని తన కెరీర్ ప్రారంభంలో మీనా కుమారి అందించిన ప్రోత్సాహాన్ని మాత్రం అతను మరిచిపోలేదు. చాందీవలీ స్టుడియోస్‌లో ఆమెను కలిసినప్పుడు స్నేహితుడు సూచించినట్టుగా ధర్మేంద్ర ఆమె కాళ్లకు నమస్కరించాడో లేదో కాని మీనా కుమారి చేసిన మేలును తలచుకుంటూనే ఉంటాడు ఇప్పటికీ.
ఫ్లాష్‌బ్యాక్
ఆల్కహాల్, డిప్రెషన్‌తోనే మీనా కుమారికి కాలం గడుస్తోంది. అప్పుడు ఆమెకు మళ్లీ చేరువయ్యాడు.. ధర్మేంద్ర కాదు కమల్ ఆమ్రోహి. ఆమె భర్త. దర్శకుడు. ఈ ఇద్దరినీ కలిపింది ప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్. తొలిచూపులోనే మీనాను ‘నా అనార్కలి’ అనుకున్నాడు కమల్. తాను తీయబోతున్న సినిమా అది. ఆ ఆఫర్‌కు అంగీకారం తెలిపి మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది మీనా కుమారి. దాదాపు మూడు నెలల ఆసుపత్రిలోనే ఉంది. ప్రతి వారాంతాలు ఆమె దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకునేవాడు కమల్. వచ్చినప్పుడల్లా ఆమె మణికట్టు మీద ‘నా అనార్కలి’ అని రాసేవాడట. ఇదీ ఓ విఫల ప్రేమ, పెళ్లి గాథ.
వచ్చే వారానికి వాయిదా వేద్దాం.
ఒకసారి మీనా కుమారి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పిక్‌నిక్ వెళ్లిందట. అందులో ధర్మేంద్ర కూడా ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో పొరపాటున ధర్మేంద్ర మరో కారులో కూర్చున్నాడు. దాంతో ‘నా ధరమ్ ఏడి?ఎక్కడ?’ అంటూ కంగారు పడిందట మీనా కుమారి. ‘ఇంకో కార్లో వస్తున్నాడు’ అని ఆమె అసిస్టెంట్ చెప్పినా వినకుండా తన కారు ఆపేయించి, రోడ్డుకు అడ్డంగా వెళ్లి ‘ధరమ్.. ఎక్కడా?ఎక్కడన్నావ్?’ అంటూ వెనకాల వస్తున్న తన స్నేహితుల కార్లలో ధర్మేంద్రను వెదుక్కోసాగిందట. అంత అబ్సేషన్‌గా తయారయ్యాడు ధర్మేంద్ర.. మీనా కుమారికి అంటూ ఈ విషయాన్ని ఉటంకించాయట మరుసటిరోజు... పత్రికలన్నీ.
‘కాజల్’ సినిమా సక్సెస్ వేడుక కోసం ఢిల్లీ వెళ్లాడు ధర్మేంద్ర. పార్టీ అయిపోయాక రాత్రి ఫ్లయిట్‌కు మళ్లీ ముంబై చేరుకోవాలి. కాని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతణ్ణి ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు. మోతాదుకు మించి మద్యం సేవించాడని. ‘నేను వెళ్లాలి... అక్కడ మీనా కుమారి నా కోసం ఎదురుచూస్తోంది.. తన కోసం నేను వెళ్లాలి.. వెళ్లాల్సిందే’ అంటూ చిందులు తొక్కాడట ధర్మేంద్ర.
మీనా కుమారి, ధర్మేంద్ర కలిసినటించిన చిత్రాలుకాజల్, పూర్ణిమ, చందన్ కా పల్నా, మై భీ లడ్‌కీ హూ, బహారోంకీ మంజిల్, ఫూల్ ఔర్ పత్థర్ మొదలైనవి.
– ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment