ప్రతీకాత్మక చిత్రం
సాధన (పేరు మార్చడమైనది) బిటెక్ చదివింది. ఉద్యోగిని. ఆన్‌లైన్‌లో ఒక ఫ్యాషన్ జ్యువెల్రీని చూసి, నచ్చడంతో ఆర్డర్ బుక్ చేసింది కార్డ్ పేమెంట్ ద్వారా. పది రోజులు దాటాయి. కానీ, ఆ వస్తువు తనను చేరలేదు. ఏమిటీ అని మరోసారి చెక్ చేసింది. తనకు వచ్చిన లింక్‌ను వెరిఫై చేస్తే తప్పుడు యుఆర్‌ఎల్ అని తేలింది. మోసపోయినట్టు గుర్తించింది. ఆన్‌లైన్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తను చూసింది సాధన.
అప్పటికి ఆ కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న ఆలోచనను విరమించుకుంది. వారం తర్వాత పరిచయమైన వ్యక్తి ద్వారా ‘అలాంటి వార్త నిజం కాదని. కంపెనీ మంచి లాభాలలో ఉందని తెలిసి’ ఆశ్చర్యపోయింది. ఏది నిజం.. ఏది అబద్ధం? అనేవి నిర్ధారించుకోకుండా నిర్ణయాలు ఆన్‌లైన్ సమాచారం ద్వారా తీసుకోవడం సరికాదని అర్ధం చేసుకుంది. సాధనలాగే ఎంతోమంది డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకోకుండా రకరకాల మోసాలబారిన పడుతున్నారు. ఈ మోసాల గురించి ప్రతి రోజూ మనం వార్తల్లో వింటూనే ఉన్నాం.
గతంలో మనిషి మేధోస్థాయిని వారి తెలివితేటలు, చదువు, వికాసాన్ని బట్టి తెలుసుకునేవారు. అలాగే సమాచారాన్ని పేపర్లలో చదివి, రేడియోలు, టీవీల ద్వారా విని గ్రహించేవారు. ఇప్పుడు సమస్తం డిజిటల్‌లో చేరింది. అందుకే, ఇప్పుడు మన మేధోస్థాయి కూడా మార్పులు చెందుతోంది. కాలప్రవాహంలో కొట్టుకువచ్చే సమాచారంలో మనమూ మునిగిపోతున్నాం. అందుకే, డిజిటల్ జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను నేటి కాలం పరిచయం చేస్తోంది.
ఈ టెక్నాలజీ యుగంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిర్ధారించుకునే వివేకం ఉండాలి. మనకు మనంగా మన మేధాశక్తిని తప్పనిసరి కొలుచుకోవాల్సిన కాలం ఇది. మనిషిని అత్యంత శక్తిమంతుడిగా చూపుతున్న డిజిటల్ ప్రపంచంలో మనమెలా ఉండాలో తెలుసుకోవడం అత్యవసరం.
∙∙∙
ఈ డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా మేధావులు గుర్తించిన ఎనిమిది ప్రాథమిక నియమాలు
(1) ఆరోగ్యకరమైన ఆన్‌లైన్ గుర్తింపు
(2) స్వీయ పర్యవేక్షణతో స్క్రీన్ టైమ్ వినియోగం
(3)వేధింపుల పరిస్థితులను గుర్తించి తమ భద్రతను కాపాడుకోవడం
(4) రక్షణ చర్యలు తీసుకోవడం
(5) వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అలాగే తెలివిగా పంచుకోవడం
6) నిజం, అబద్ధాల మధ్య తేడా గుర్తించడం
(7) ఆన్‌లైన్ ఉనికిని బాధ్యతాయుతంగా నిర్వహించడం, దీర్ఘకాలిక పరిణామాలను తెలుసుకోవడం
(8)మీ గురించి, మీ భావాలను నైపుణ్యంగా పంచుకోవడం.
మన దైనందిన జీవితంలో కుప్పలు తెప్పలుగా వస్తున్న సమాచారానికి లెక్కలేదు. దీంట్లో ప్రతిదీ శోధించాలనుకుంటే కష్టమే. కానీ, మన గుర్తింపును ఎలా కాపాడుకోవాలి, భద్రత పరిస్థితి ఏంటి, వ్యక్తిగతమైన వివరాలను గోప్యంగా ఎందుకుంచాలి.. అనే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమైనవి. వీటితో పాటు మనలోని భావవ్యక్తీకరణ సోషల్ మీడియాలో ఎలా ఉంది, దీని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. నీవు ఏవి ఇస్తే, అలాంటివే నీకు తిరిగి వస్తుంటాయి అనేది కూడా గ్రహించాలి. నిన్ను కొడితే ఎలా బాధ కలుగుతుందో, అవతలి వాడికి కూడా అలాగే బాధ కలుగుతుంది అనే విషయాన్ని అర్ధం చేసుకొని హద్దుల్లో ఉండాలి.
కొన్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ సాధనాలు:
ఎక్సోడస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను విశ్లేషిస్తుంది. ఇది పొందుపరిచిన ట్రాకర్ల కోసం వెతుకుతుంది. దీని విశ్లేషణ సాంకేతికత పూర్తిగా చట్టబద్ధమైనది. https://reports.exodus-privacy.eu.org/en/
మీ ఇ–మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ లీక్ అయ్యిందా అని నిర్ధారించడానికి https://amibeingpwned.com ద్వారా శోధించవచ్చు.
OSINT ద్వారా ఉచితం అని వచ్చే వనరులను కనుక్కోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. https://osintframework.com
చందాదారులు తమ రిజిస్టర్డ్ నంబర్‌లను నిర్ధారించడానికి, వారికి తెలియకుండా రిజిస్టర్ చేసిన నంబర్‌లను తీసివేయడానికి టెలికాంను అనుమతించడం. https://tafcop.dgtelecom.gov.in
మీ కంప్యూటర్ లేదా మీ ప్రైవేట్ డేటాకు హాని కలగవచ్చని ఆందోళన ఉంటే.. తనిఖీ చేయడానికి www.unshorten.it ద్వారా ఒక మార్గం ఉంది
బెదిరింపులు, వైరస్‌ల నుండి మీ గుర్తింపు, డేటా, కంప్యూటర్‌ను రక్షించడంలో మీకు సహాయం చేస్తుంది https://isitphishing.org/
వీడియో అసలైనదా, నకిలీదా అని నిర్ధారించడానికి తగిన ప్లాట్‌ఫారమ్..
https://platform.sensity.ai/ deepfake-detection
- అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
చదవండి: Priyanka Nanda: బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనుకుంది.. కానీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గ్రామానికి.. సర్పంచ్‌గా పోటీ!
Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా?
Comments
Please login to add a commentAdd a comment