అందమైన రంగవల్లికలతో పండగల రోజుల్లో ప్రత్యేకంగా ఇంటిని సింగారించుకుంటున్నాం. ఆ రంగవల్లికలే అలంకరణ వస్తువుల మీదా కొత్తగా ముస్తాబు అయితే.. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘సావీస్ హోమ్’ పేజీతో ఈ క్రియేషన్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నారు స్రవంతి.
ఇంటి అందాన్ని పెంచడం ఎలాగో ‘ముగ్గు’ను ముచ్చటగా పెయింట్ చేసి మరీ చూపుతున్నారు. మెలికలుగా తీర్చిన ముగ్గును ఏయే రూపాల్లో వేసుకోవచ్చో.. ముఖ్యంగా పండగలు, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ముగ్గు కళతో ఇంటి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.
ఆసనంపైన అందం
పూజల్లో ఆసనంగా వాడే పీట, చుట్టూ అలంకరణకు వాడే పొడవాటి చెక్క ముక్కలు, బల్ల వంటివి పసుపు, ఎరుపు, పచ్చ రంగు పెయింట్ మీద వేసిన తెల్లని పెయింట్ ‘ముగ్గు’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాకిట్లో గుమ్మం ముందు వేసిన ముగ్గు డిజైన్‌ను ఇలా పీట మీద పెయింట్‌గా వేసి, ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వచ్చు. మీ అభిరుచిని సరికొత్తగా తెలియజేయవచ్చు.
షోకేస్‌కి ముగ్గు
వాల్ ఫ్రేమ్స్, కీ హోల్డర్స్, చిన్న సైజు అర లున్న షోకేస్ వంటివి గోడపైన అలంకరణగా ఉంచాలనుకుంటే.. వాటిని ఇలా ముగ్గు ముచ్చటతో మురిసిపోయేలా మెరిపించవచ్చు. కొన్నాళ్లుగా వాడి, ఇక పడేద్దాం అనుకున్న చెక్క స్పూన్లు , గరిటెలను కూడా రంగవల్లిక పెయింట్‌తో వాల్ హ్యాంగర్స్‌గా మార్చుకోవచ్చు.
ట్రే.. గ్లాస్ హోల్డ్‌ర్లు
కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ముగ్గుతో ఇంటిని కళాత్మకంగా ముస్తాబు చేసుకోవచ్చు. చెక్కతో చేసిన ట్రే, గ్లాస్ హోల్డర్స్‌ని ముగ్గుతో ‘కళ’గా అలంకరించవచ్చు.
కలపకే ప్రాధాన్యం
చెక్కతో తయారైన వస్తువులకు, పూల కుండీలకు రంగవల్లిక ఓ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. అయితే, వీటిలో మెలికల ముగ్గుకే ప్రాధాన్యం.
కళగా ఉంటుంది కదా అని ప్రతీ వస్తువుపై ‘ముగ్గు’వేస్తే అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అభిరుచితో పాటు ఏ వస్తువును ‘కళ’గా అలంకరించాలో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టడం సముచితం.
చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!!
Comments
Please login to add a commentAdd a comment