ఆరుబయట అలా నిలబడినప్పుడు గాలి వచ్చి పలకరిస్తుంది. ఎంత చల్లని గాలి! ఈ చల్లని గాలికి చల్లని మనసు కూడా ఉంది. తన నుంచి నీటిని మనకు అందిస్తుంది. అదే ఎయిర్ వాటర్! గాలి నుంచి నీరు తయారుచేసే కంపెనీలు మన దేశంలో కొత్త కాదు. అయితే బెంగళూరు కేంద్రంగా ఈ కుర్రాళ్లు మొదలుపెట్టిన వాటర్‌టెక్ స్టార్టప్ ఉరవు ‘పవర్’ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది...
భవిష్యత్‌లో నీటికరువు అనేది ఎంత పెద్ద సమస్య కానుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్ ‘కంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’ చెబుతున్న లెక్కలు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం, జలాశయాలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నీటిని సృష్టించే సాంకేతికప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. అందులో ఒకటి గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే విధానం.
‘ఫలానా దేశంలో అక్కడెక్కడో గాలి నుంచి నీరు తయారుచేస్తున్నారట’ అని ఆశ్చర్యపడి తేరుకునేలోపే అలాంటి కంపెనీలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఉదా: వాటర్ మేకర్స్ ఇండియా,వాయుజల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వో...మొదలైన కంపెనీలు. అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్ (ఏడబ్ల్యూజీ)లతో గాలి నుంచి నీరు సృష్టిస్తూ ఈ కంపెనీలు అబ్బురపరుస్తున్నాయి.
వీటికి దేశ, విదేశాల్లో మంచి ఆదరణ దక్కుతుంది. ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే కంపెనీలు ఇవి. ఇక బెంగళూరు కుర్రాళ్ల ‘ఉరవు ల్యాబ్స్’ విషయానికి వస్తే.... గాలి నుంచి నీరు తయారుచేసే ఎన్నో కంపెనీలు మన దేశంలో ఉండగా ‘ఉరవు’ యూఎస్‌పీ ఏమిటి? అనేది తెలుసుకునేముందు కాస్త వెనక్కి వెళదాం...
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), కాలికట్‌లో చదువుకునే రోజుల్లో స్వప్నిల్, వెంకటేష్‌లకు ‘నీటి కరువు’ అనేమాట తరచుగా వినబడేది. నిజానికి ఆ తీరప్రాంతంలో అధిక వర్షాలు అనేవి సాధారణం. తాగడానికి మాత్రం సురక్షితమైన నీరు దొరికేది కాదు. ఈ విషయంపై తరచుగా మాట్లాడుకునేవారు. 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ‘గాలి నుంచి నీరు’ అనే కాన్సెప్ట్ గురించి సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఒక సంవత్సరం తరువాత...
విద్యుత్ ఆధారిత సంప్రదాయ అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్(ఏడబ్ల్యూజీ) తయారు చేశారు. బాగానే పనిచేసింది. అయితే దీనికి అధిక విద్యుత్ కావాలి. పైగా విద్యుత్ ఆధారిత కంపెనీలు మార్కెట్‌లో ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమదైన ప్రత్యేకత గురించి ఆలోచించారు. అదే...‘వందశాతం పునరుత్పాదకమైన శక్తి’
తమ ఆలోచనను సాకారం చేసుకోవడానికి ఇంధన సంబంధిత విషయాలలో మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ప్రదీప్ గార్గ్‌ను బెంగళూరులో కలుసుకున్నారు.
స్వప్నిల్, వెంకటేష్‌లు ప్రదీప్‌తో కలిసి ‘రీనెవబుల్ వాటర్ టెక్నాలజీ’పై కలిసిపనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారికి కావాల్సింది ప్రతిభ ఉన్న ప్రాడక్ట్ డెవలపర్. అట్టి ప్రతిభ వారికి బాలాజీలో కనిపించింది. ఒక్కో అడుగు వేస్తు ఈ బృందం ‘ఉరవు ల్యాబ్స్’కు శ్రీకారం చుట్టింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్...మొదలైన రంగాలలో నిష్ణాతులైన 15 మందితో ఒక టీమ్ ఏర్పాటయింది.
టాలెంట్ సంగతి సరే, మరి ఫండింగ్ సపోర్ట్?
అదృష్టవశాత్తు ఎప్పటికప్పుడూ రకరకాల గ్రాంట్స్ అందడంతో కంపెనీకి ఇబ్బంది కాలేదు. ప్రతిష్ఠాత్మకమైన ‘వాటర్ అబాన్‌డెన్స్ ఎక్స్‌ప్రైజ్’ గ్లోబల్ లీస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. ఇది వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. గాలీ నుంచి నీటిని తీయడానికి సంబంధించి తొంబై శాతం కంపెనీలు ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాజీపై ఆధారపడుతున్నాయి.
విద్యుత్‌రంగానికి సంబంధించి సౌర విద్యుత్, పవన విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయిగానీ ఈ రంగంలో మాత్రం ప్రత్యామ్నాయ ఆలోచనలు అరుదైపోయాయి. దీంతో ‘హండ్రెడ్ పర్సెంట్ రీనెవబుల్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అంటూ రంగంలోకి దిగింది ఉరవు ల్యాబ్స్.
‘పవర్డ్ బై సోలార్ హీట్’
‘పవర్డ్ బై వేస్ట్–హీట్ ఆఫ్ ఇండస్ట్రీస్’
‘పరర్డ్ బై బయోమాస్ వేస్ట్’....అంటూ నినదిస్తున్న ‘ఉరవు’ గాలి నుంచి నీటి తయారీ ప్రక్రియలో చుక్కనీరు కూడా వృథా కాకుండా చూడడం తన లక్ష్యం అని చెబుతుంది.
‘సాంకేతిక విషయాలలో మాకు ఎలాంటి తడబాట్లు లేవు. తయారీ ప్రక్రియకు సంబంధించిన ఫిజిక్స్, ఇంజనీరింగ్‌ను బాగా అర్థం చేసుకున్నాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన ప్రదీప్ గార్గ్. చిన్నస్థాయిలో 20–100 లీటర్లు, పెద్దస్థాయిలో 10,000 లీటర్ల సామర్థ్యం ఉన్న పరికరాలపై దృష్టి సారించింది ఉరవు.
అనుకున్న స్థాయిలో ఈ కంపెనీ విజయం సాధిస్తే వాటర్ ఇండస్ట్రీలో గేమ్‌ఛేంజర్ అవుతుంది’ అంటున్నారు విశ్లేషకులు. ‘మన గ్రహంపై ఎక్కడైనా గాలి నుంచి నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిపై ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీరు అందాలి’ అంటున్నారు ఇన్వెస్టర్, వీసి ఫండ్ సీనియర్ సలహాదారు షిగేరు సుమిటోమో.
Comments
Please login to add a commentAdd a comment