'Why can't there be chaiwali?': అనుకున్న కాలేజీలో సీటురాలేదనో, అకడమిక్ ఇయర్ ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థులున్న ఈ రోజుల్లో.. ‘‘అనుకున్నది జరగకపోతే జీవితం అంతటితో అయిపోయినట్లు కాదు, ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్‌కమ్ చెబుతుంది. ఆ దారిలో కూడా వెళ్లవచ్చు’’ అని నిరూపించి చూపిస్తున్నారు కొంతమంది విద్యార్థులు.
ఈ కోవకు చెందిన ప్రియాంక గుప్తా.. ‘మనస్సు ఉంటే మరో మార్గం తప్పకుండా ఉంటుంది’ అని పెద్దలు చెప్పిన మాటను చేతల్లో చేసి చూపిస్తోంది. ప్రియాంక అనుకున్న ఉద్యోగం రాలేదని, నిరుత్సాహపడకుండా, సొంతంగా టీస్టాల్ పెట్టుకుని ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఉదాహరణగా నిలుస్తోంది.
బీహార్‌లోని పూర్ణియ జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్‌లో కామర్స్ డిగ్రీ చదివింది. 2019లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి బ్యాంకింగ్ ఉద్యోగంకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండేళ్లపాటు సీరియస్‌గా ప్రయత్నించినప్పటికి బ్యాంక్ ఉద్యోగి కాలేకపోయింది.
దీంతో ‘ఇంకెంత కాలం ఇలా ప్రిపేర్ అవుతాం. ఉద్యోగం చేసినా, ఇంకేదైనా పనిచేసినా డబ్బులు సంపాదించడం కోసమే కదా’ అనుకుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి టీసాŠట్‌ల్ పెట్టడానికి అనుమతి తీసుకుంది. ‘చాయ్‌వాలి’ పేరిట పాట్నా ఉమెన్స్ కాలేజీ ముందు టీస్టాల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ పదకొండున ప్రారంభించిన చాయ్‌వాలి స్టాల్ పంచ్ కొటేషన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
‘పీనా హై పఢేగా’, సోచ్ మత్.. చాలు కర్ దే బాస్’ వంటి కోట్స్‌తో తన స్టాల్స్‌కు కస్టమర్లను రప్పించుకుంటోంది ప్రియాంక. కుల్దా టీ, మసాలా టీ, పాన్ టీ, చాక్లెట్ టీలతో పాటు కొన్ని రకాల కుక్కీలు, స్నాక్స్‌ను రూ.15 నుంచి రూ.20లకే విక్రయిస్తుండడంతో విద్యర్థులు చాయ్‌వాలికి ఎగబడి వస్తున్నారు.
ప్రియాంక టీస్టాల్ పెట్టాలనుకున్నప్పుడు ముద్ర లోన్‌తోపాటు, ఇతర రకాల రుణాల కోసం కూడా ప్రయత్నించింది కానీ దొరకలేదు. కొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ ఆమెకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొంతమంది రకరకాల డాక్యుమెంట్స్ అడిగి ఇబ్బంది పెట్టారేగానీ, రుణం మాత్రం ఇవ్వలేదు. చివరికి తన స్నేహితులు తలా కొంత సాయం చేయడంతో జమ అయిన కొద్ది మొత్తంతో టీస్టాల్‌కు కావాల్సిన వస్తు సామగ్రిని కొనుక్కుని స్టాల్‌ను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment