ఒక జాక్‌పాట్‌ కవి | Bollywood Singer Rajendra Krishan Birth Anniversary | Sakshi
Sakshi News home page

ఒక జాక్‌పాట్‌ కవి

Published Sun, Feb 7 2021 8:56 AM | Last Updated on Sun, Feb 7 2021 8:58 AM

Bollywood Singer Rajendra Krishan Birth Anniversary - Sakshi

‘ఏ జిందగీ ఉసీకి హై జో కిసీకా హోగయా
ప్యార్‌ హీ మే ఖోగయా’...

రాజేంద్ర కిషన్‌ను తలుచుకోగానే ఈ పాట గుర్తుకొస్తుంది.

‘షోలా జో ధడ్‌ కే దిల్‌ మేరా భడ్‌కే
దర్ద్‌ జవానీకా సతాయే బఢ్‌ బఢ్‌ కే...’

రాజేంద్ర కిషన్‌ను తలుచుకుంటూ ఈ పాట కూడా గుర్తుకొస్తుంది.

నా బోలే నా బోలే నా బోలేరే
ఘూంఘట్‌ కే పట్‌ నా ఖోలెరే...

ఈ సూపర్‌హిట్‌ పాట రాజేంద్ర కిషన్‌ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాక మానదు.

హిందీ సంగీత అభిమానులకు పాటల ప్రేమికులకు రాజేంద్ర కిషన్‌ ఇష్టుడు. స్నేహితుడు. వేల హిట్‌ పాటలు ఇచ్చినందుకు ప్రియ సఖుడు. హిందీ సినిమాలలో హస్రత్‌ జైపూరి, శైలేంద్ర, మజ్రూ సుల్తాన్‌పురి... ఒకవైపు వరుస పెట్టి కమర్షియల్‌ సినిమాలకు రాస్తుంటే మరోవైపు రాజేంద్ర కిషన్‌ వారికి పోటీగా అప్రతిహతంగా పాటలు రాశాడు. అతని పాటల్లో గొప్ప ఉర్దూ లేకపోవచ్చు. ఉదాత్త భావాలు ఉండకపోవచ్చు. కాని పామరులు మనో రంజితం అయ్యేలా మాటలు ఉంటాయి. ఊపు ఉంటుంది. హుషారు ఉంటుంది.

ఈనా మీనా డీకా డాయ్‌ డమనికా
మాక నాక నాక చీక పీక రీకా...


రాజేంద్ర కిషన్‌ది సిమ్లా. చిన్నప్పుడే కవిత్వం పురుగు పట్టి కరిచింది. ఏవో ఒక రాతలు రాసి, రాధాకృష్ణుల మంటపాల కోసం భజనలు రాసి ఆ ఊళ్లో గుర్తింపు పొందాడు. ముంబై వెళదామనుకున్నాడు కాని గవర్నమెంట్‌ ఆఫీసులో గుమాస్తా అయ్యాడు. అదీ మంచికే అనుకుని ఉన్న ఆ నాలుగు ఫైళ్ల పని తెమిల్చి పుస్తకాలు చదువుకునేవాడు. కవిత్వం రాసేవాడు. ఆ తర్వాత ఈ కుర్చీలో కూచుని వచ్చేపోయే వారికి జవాబు చెప్పడం కంటే స్వేచ్ఛగా కవిగా బతికితే బాగుంటుందని ఉద్యోగానికి 1942లో రాజీనామా చేసి బొంబాయి చేరుకున్నాడు. అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అదృష్టమే ఇతని కోసం అక్కడ కాపు కాచి ఉంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడైన సి.రామచంద్రతో జత కట్టి రాజేంద్ర కిషన్‌ సూపర్‌ హిట్‌ పాటలు అనేకం రాశాడు. తెలుగులో ‘నాటకాల రాయుడు’ లో హిట్‌ అయిన ‘నీలాల కన్నుల్లో’ పాట హిందీలో ‘అల్‌బేలా’లో రాజేందర్‌ కిషన్‌ రాసిన పాటే.

ధీరేసే ఆజారి అఖియన్‌ మే 
    నిందియా ఆజారి ఆజా
ధీరే సే ఆజా...


రాజేంద్ర కిషన్‌ సినిమాల్లో పాటలు మాత్రమే కాదు స్క్రిప్ట్స్‌ కూడా రాశాడు. ముఖ్యంగా దక్షిణాది నుంచి హిందీలోకి రీమేక్‌ అయ్యే మన ఏవిఎం వారి సినిమాలకు చాలావాటికి అతడు పని చేశాడు. తెలుగులో హిట్‌ అయిన ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో’ పాటను హిందీరో రాజేందర్‌ సింగ్‌ రాశాడు.

చల్‌ ఉడ్‌జారే పంఛీ
తేరా దేశ్‌ హువా బేగానా...


ఆ తర్వాత సంగీత దర్శకుడు హేమంత్‌ కుమార్‌ కోసం రాజేందర్‌ కిషన్‌ ‘నాగిన్‌’లో సూపర్‌డూపర్‌ హిట్‌ రాశాడు. అదే ‘తన్‌ డోలే మేరా మన్‌ డోలే’. రాజేందర్‌ కిషన్‌ అత్యంత వేగంగా రాసే కవి. తొందరగా పని ముగించుకొని ఏ పేకట ఆడటానికో, గుర్రప్పందాల్లో పాల్గొనడానికో వెళ్లిపోయేవాడు. ఇన్ని వ్యసనాలు ఉన్నా పాట దగ్గర అతడు చిత్తశుద్ధి కోల్పోలేదు. రాసిన ప్రతి పాటను హిట్‌ చేయడానికి తాపత్రయ పడ్డాడు. ‘హమ్‌ ప్యార్‌ మే జల్‌నే వాలోంకో’ (జైలర్‌), ‘మేరా పియా గయా రంగూన్‌’ (పతంగా), ‘ఇత్‌న నా ముజ్‌ సే తూ ప్యార్‌ బఢా’ (ఛాయా), ‘తుమ్హీ మేరి మందిర్‌ తుమ్హి మేరి పూజా’ (ఖాందాన్‌) ఆ హిట్‌లకు అంతే లేదు.
సినిమాల్లో సంపాదించింది చాలక రాజేందర్‌ కిషన్‌ రేసుల్లో దాదాపు 46 లక్షలు సంపాదించాడు 1970లలో. అందువల్ల ఆయన అత్యంత శ్రీమంతుడైన సినీ కవి అయ్యాడు. ఆ తర్వాత పాటలు రాయలేదు. 1919లో పుట్టిన రాజేందర్‌ కిషన్‌ 1987లో మరణించాడు. అతడు ప్రచారానికి, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేవాడు. కాని శ్రోతలు ఎప్పుడూ అతని పాటకు దగ్గరగా ఉండేవారు. ఇవాళ్టికీ ఉన్నారు. రాజేందర్‌ కిషన్‌ను తమవాడిగా భావిస్తూనే ఉన్నారు.

కభి న కభి కహీ న కహీ
కోయినా కోయి ఆయేగా
ఆప్‌ నా ముఝే బనాయేగా..

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement