వివాదాస్పద 'బాంబే బేగమ్స్‌' అసలు కథేంటి..? | Bombay Begums Netflix Web Series Review | Sakshi
Sakshi News home page

వివాదాస్పద 'బాంబే బేగమ్స్‌' అసలు కథేంటి..?

Published Tue, Mar 16 2021 12:55 AM | Last Updated on Tue, Mar 16 2021 10:13 AM

Bombay Begums Netflix Web Series Review - Sakshi

పురుషుడు భాగం పంచుకోని ఇంటి పని.. పురుషుడు భాగం ఇవ్వని అధికారం.. ఈ రెండింటిలో విజయం సాధించడమే మహిళా సాధికారత. దానికోసమే పోరాటం.. అదే ‘బాంబే బేగమ్స్‌’ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ఆరు ఎపిసోడ్ల మినీ సిరీస్‌కి దర్శకురాలు అలంకృతా శ్రీవాస్తవ.

♦‘అబ్బాయి అమెరికాలో ఉంటాడు. మంచి సంబంధం. కాదన్నావంటే బాగోదు చెప్తున్నా. ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. వెళ్లి కలువు’  – అమ్మ ఆజ్ఞ
♦‘బిడ్డ పుట్టాక నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు కొన్నాళ్లపాటు. మదర్‌హుడ్‌ను ఎంజాయ్‌ చెయ్‌’  – భర్త సలహా.
♦‘అతను ఈ సంస్థకు చాలా కావాల్సినవాడు. అతని సేవలు అత్యంత అవసరం మీ సేవల కన్నా కూడా!’  – ఆ సంస్థ డైరెక్టర్‌ హెచ్చరిక
♦‘సెక్స్‌ వర్కర్‌వి సెక్స్‌ వర్కర్‌లా ఉండు.. మర్యాద, మన్నన అని మాట్లాడకు.. నప్పదు’ – ఓ రాజకీయ నాయకుడి హేళన.

కుటుంబం నుంచి పెళ్లి ఒత్తిడి భరిస్తున్న ఆ అమ్మాయి పేరు ఆయేషా అగర్వాల్‌ (ప్లబితా). భోపాల్‌లో ఎంబీఏ చదివి.. మంచి ఫైనాన్స్‌ ఎనలిస్ట్‌గా సక్సెస్‌ అవ్వాలని .. కళ్లనిండా కలలతో ముంబై చేరుతుంది. బిడ్డ పుట్టాక ఉద్యోగం చేయక్కర్లేదని అన్యాపదేశంగా భర్త ఆదేశాన్ని వింటున్న రెండో మహిళ ఫాతిమా వార్సి (షహానా గోస్వామి). ఐఐఎమ్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివి.. ‘ద రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ముంబై’లో సీఈఓ తర్వాత స్థాయిలో అధికారం లో ఉంది. సీఈఓ కావాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. హెచ్చరిక రూపకంగా బెదిరింపును విన్న ఆమె రాణి సింగ్‌ ఇరానీ (పూజా భట్‌).. ‘ద రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ముంబై’ సీఈఓ. లేడీ బాస్‌ ను ఒప్పుకోని డైరెక్టర్స్, ఇతర పురుష ఉద్యోగులూ అడగడుగునా సృష్టిస్తున్న అవరోధాలను ఎదుర్కొంటూ బ్యాంక్‌ నిర్వహణా బాధ్యతలను చూసుకుంటూంటుంది. వెక్కిరింతకు గురైన మహిళ లక్ష్మీ గోంధాల్‌ (అమృతా సుభాష్‌) సెక్స్‌ వర్కర్‌ లిల్లీగా మారిన మాజీ బార్‌ డాన్సర్‌. ఆ వృత్తికి స్వస్తి చెప్పి.. బ్యాంక్‌ లోన్‌తో ఓ చిన్న ఫ్యాక్టరీ పెట్టుకొని తనలాంటి పదిమంది స్త్రీలకూ ఉపాధి కల్పించాలని ఆశపడుతుంది. 

ఈ నలుగురూ భిన్న సామాజిక నేపథ్యాలకు ప్రతీకలు. ఈ నలుగురూ కోరుకుంది గౌరవం. ఈ నలుగురికీ ఆత్మవిశ్వాసమే పెట్టుబడి. ఈ నలుగురి ఆరాటమూ సాధికారత, సమానత్వం గురించే. పురుషులే కాదు పురుషాధిపత్య భావజాలం ఉన్న మహిళలూ నాయకత్వ దిశగా ప్రయాణించే ఈ యోధులకు అవరోధాలు కల్పించినవారే. ఇంకా చెప్పాలంటే ఈ నలుగురిలోనూ ఆ భావజాలం కన్పిస్తుంది. అయితే ఎదురవుతున్న పరిస్థితుల దృష్ట్యా తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఆలోచనా పరిధిని పెంచుకుంటూ వెళ్తుంటారు. 

ఆ కథ ఇంకాస్త వివరంగా...: ద రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ముంబై సీఈఓ రాణి సింగ్‌ ఇరానీకి ఆఫీస్‌లో పోరే కాదు ఇంట్లో సవాళ్లూ ఉంటాయి. ఆమెకు ఇద్దరు సవతి పిల్లలు. కొడుకు, కూతురు. కొడుకు ఆమెను తల్లిగా మారుగా చూసినా కూతురు షై (ఆధ్యా ఆనంద్‌).. రాణిని పరాయి వ్యక్తిలాగే పరిగణిస్తూంటుంది. కొడుకు చేసిన ఒక యాక్సిడెంట్‌ లో లక్ష్మీ గోంధాల్‌ కొడుకు గాయపడ్తాడు. కొడుకు భవిష్యత్, ఆ ఇంటి పరువు దృష్ట్యా కేస్‌ కాకుండా చూడాలనుకుంటున్న రాణి అవసరాన్ని అడ్డం పెట్టుకొని తన కొడుకు భవిష్యత్‌కు పునాదులు వేయాలనుకుంటుంది లక్ష్మీ గోంధాల్‌. తన కొడుక్కి ముంబైలోని మంచి స్కూల్లో చేర్చేందుకు కావల్సిన డబ్బులు అడుగుతుంది. కాని సెక్స్‌ వర్కర్‌ కొడుకని ఆ స్కూల్లో ఆ అబ్బాయిని చేర్పించుకోరు. దాంతో ఆ వృత్తిలోంచి బయటపడాలనుకొని మళ్లీ రాణీని బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది లోన్‌ కోసం. అప్పుడే ఆయేషా ఫైనాన్స్‌ వింగ్‌లోంచి ఫైర్‌ అయిపోయుంటుంది.

తల్లిదండ్రుల నుంచి పెళ్లి ఒత్తిడికి .. కొత్తగా ఉద్యోగాన్వేషణా టెన్షన్‌.. తన లైంగికత (బై సెక్సువల్‌) పట్ల తన మెదడులోని గందరగోళం తోడవుతాయి. ఆ సమయంలోనే రాణీ ఆమెను సీఎస్‌ఆర్‌లో నియమించి ఆ బ్యాంక్‌లో ఉద్యోగం నిలబెడుతుంది. లక్ష్మీ గోంధాల్‌ చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించే టాస్క్‌ను అప్పజెబుతుంది. ఈ క్రమంలో లక్ష్మీ పట్ల తనకున్న ముందస్తు అభిప్రాయాలు పటాపంచలు అయిపోయి ఆమె మీద గౌరవం ఏర్పర్చుకుంటుంది ఆయేషా. అయితే ఫైనాన్స్‌ వింగ్‌లో ఉద్యోగం తన లక్ష్యం కాబట్టి ఆమె చూపంతా ఆ విభాగం మీదే ఉంటుంది. ఆ రంగంలో సిద్ధహస్తుడైన దీపక్‌ సర్‌ అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. ఒకసారి బ్యాంక్‌ ఇచ్చిన పార్టీలో అతణ్ణి కలిసి.. తనను ఆ విభాగంలోకి తీసుకొమ్మని కోరుతుంది. అదేరోజు రాత్రి అతణ్ణి ఇంటి వరకు లిఫ్ట్‌ అడిగి.. లైంగిక వేధింపులకు గురవుతుంది. ఆ అవమానాన్ని, బాధను బయట పెడితే ఉద్యోగావకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని ముందుగా చెప్పదు కాని.. మీ టూ ఉద్యమ స్ఫూర్తితో బయటపెడుతుంది.

దీపక్‌కి ఉన్న మంచి పేరు వల్ల ముందుగా ఆయేషాను ఎవరూ నమ్మరు. అయినా వెనక్కి తగ్గదు. అప్పుడే ఫాతిమా కూడా తన జీవన పోరాటంలో ఉంటుంది. భర్త సంతాన కాంక్ష, కనివ్వలేని తన శరీర అశక్తత.. ఇటు ఉద్యోగంలో పై మెట్టు చేరాలనే ఆకాంక్ష ... వెరసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. చివరకు ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాలుస్తుంది. అప్పుడే ఆ బ్యాంక్‌లో ఆమెకు ప్రమోషన్‌ వస్తుంది. భర్తేమో భార్య ఉద్యోగ ఉన్నతి కన్నా తండ్రిగా తనకు వచ్చే ప్రమోషన్‌ మీదే ఎక్కువ మక్కువతో ఉంటాడు. అందుకే ఉద్యోగం మానేసి పుట్టబోయే బిడ్డ మీదే శ్రద్ధ పెట్టమంటాడు. ఎన్నాళ్లనుంచో ఎదురు చూసిన రెండు అవకాశాలు ఒకేసారి రావడంతో దేన్ని కాపాడుకోవాలో నిర్ణయించుకోలేని టెన్షన్‌తో గర్భాన్ని కోల్పోతుంది ఆయేషా. దీంతో ఆ భార్యాభర్తల మధ్య అనుకోకుండానే దూరం పెరుగుతుంది. అప్పుడే ఆయేషా కేస్‌ ఇంటర్నల్‌ కంప్లయింట్‌ సెల్‌కి రావడంతో దీపక్‌తో.. అతని కుటుంబంతో తనకున్న చనువురీత్యా దీపక్‌ను దోషిగా పరిగణించదు ఫాతిమా.

పైగా ఆయేషా కు పని పట్ల శ్రద్ధ లేదనే అపోహతో ఉంటుంది ఆమె. కానీ ఈ లైంగిక వేధింపుల కేసుతో అదే ఆఫీస్‌లో ఎన్నో ఏళ్ల కిందట దీపక్‌ చేతుల్లోనే వేధింపులకు గురైన ఇంకో ఉద్యోగిని బయటకు రావడంతో ఫాతిమా అపోహలు, దురభిప్రాయాలు పటాపంచలైపోతాయి. ఫాతిమాకు అండగా నిలబడుతుంది. ఇలాంటి అనుభవమే ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలో తనకూ ఎదురవడంతో ఆయేషా పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె ఆరోపణలోని నిజాన్ని గ్రహించి అయేషా వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేస్తుంది. దీపక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఇంకోవైపు లక్ష్మీకి ఫ్యాక్టరీ శాంక్షన్‌ అయినా స్థానిక కార్పోరేటర్‌ తన వాంఛ ను లక్ష్మీ తీర్చలేదన్న కసితో ఆ ఫ్యాక్టరీ తెరవనివ్వకుండా అడ్డుపడుతుంటాడు. ఈ నలుగురు మహిళలూ కలిసి పోరాడి లక్ష్మీ ఫ్యాక్టరీ తెరిచేలా చూస్తారు. ఇదంతా ఒకెత్తయితే ఈ కథలో టీనేజ్‌ అమ్మాయి షై మానసిక గందరగోళాలు, శారీరక ఆకర్షణలు, సమాచార విప్లవ ప్రభావాలు అన్నీ ఒకెత్తు. 

స్త్రీలను నిస్సహాయులుగా, అశక్తులుగా చూసే, మార్చే పరిస్థితులను, వ్యక్తులను స్త్రీలే కల్పిస్తారు. అలాంటివాటికి నో చెప్పడం నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసమే వాటిని నిలువరించే ఆయుధమని, ఈ తరం ఆ ఎరుకతో ప్రయాణాన్ని మొదలుపెట్టాలని రాణి పాత్రతో షైకి  చెప్పించిన మాటలు ఆలోచించదగ్గవి. ఈ సిరీస్‌ మీద భిన్నాభిప్రాయాల మాట అటుంచితే  మీటూ ఉద్యమాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలో చక్కగా చూపించింది దర్శకురాలు. అయితే ఇందులో పిల్లల పాత్రను విపరీతంగా చిత్రీకరించారని, పదమూడేళ్ల పిల్లలు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టుగా చూపించారని, దీనివల్ల ఆ వయసు పిల్లలు పెడదోవపట్టడమే కాక వాళ్లు  దోపిడీకి గురయ్యే ప్రమాదమూ ఉందని అభిప్రాయపడింది ఎన్‌సీపీసీఆర్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌). దీని మీద వివరణ ఇవ్వాలని, బాంబే బేగమ్స్‌ ప్రసారాన్ని నిలిపేయాలనీ నెట్‌ఫ్లిక్స్‌కి నోటీసులూ పంపింది ఎన్‌సీపీసీఆర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement