ఒళ్లునొప్పులన్నీ కరోనా జ్వరంతోనేనా? | Coronavirus Fever Starts With Body Pains | Sakshi
Sakshi News home page

ఒళ్లునొప్పులన్నీ కరోనా జ్వరంతోనేనా?

Published Thu, Aug 13 2020 8:14 AM | Last Updated on Thu, Aug 13 2020 8:25 AM

Coronavirus Fever Starts With Body Pains - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మనకు జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి... 

’ ఇన్ఫెక్షన్లు : – కోవిడ్‌–19కు కారణమైన సీవోవీ–2 వైరస్‌ అనే కొత్తవైరస్‌ ఆవిర్భవించడానికి ముందు కూడా ఒళ్లునొప్పులు ఉన్నాయి. అదే కుటుంబానికి చెందిన వైరస్‌ల కారణంగా వచ్చే ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా), హెచ్‌1ఎన్‌1లతో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లలోనూ తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరంతో పాటు కలిసి వచ్చి తీవ్రంగా బాధిస్తాయి. ఇతర వైరస్‌లు అయిన హెపటైటిస్‌–బి, హెచ్‌ఐవీ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లలోనూ ఒళ్లునొప్పులుంటాయి. 

ఇక బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ల విషయానికి వస్తే... మలేరియాతో పాటు బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్‌ డిసీజ్‌ వంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లలోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. దాంతోపాటు టైఫాయిడ్, రికెట్సియల్‌ వంటి బ్యాక్టీరియల్‌ జ్వరాలతో పాటు పిల్లి ద్వారా వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్‌ వంటి ఏకకణజీవి ద్వారా వ్యాపించే ప్రోటోజోవన్‌ ఇన్ఫెక్షన్లలోనూ ఒళ్లునొప్పులు రావడం చాలా సాధారణం. ఇక... ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్‌ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్‌ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లలోనూ జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు వస్తాయి. 

కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులు: కొన్నిసార్లు ఒళ్లునొప్పులూ, కీళ్లనొప్పులూ కలగలిసి వస్తుంటాయి. ఒక్కోసారి ఈ కీళ్లనొప్పులే ఒళ్లునొప్పులుగా అనుకునేంత తీవ్రంగానూ ఉంటాయి. ఉదాహరణకు... కీళ్లనొప్పులతో వ్యక్తం అయ్యే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో, – జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్‌ లూపస్‌ అరిథమెటోసిస్‌లో, – పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), – పాలీమయోసైటిస్, జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌ వంటి కీళ్లవాధుల్లోనూ... ఆ బాధలు ఒళ్లునొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపించగానే మనం ఏవో మందులు వేసుకుంటూ ఉంటాం. వాటిల్లోని విషపదార్థాల వల్ల కూడా ఒక్కోసారి ఒళ్లునొప్పులు రావచ్చు. అలాగే డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్‌ మందులు తీసుకోవడం వల్ల కూడా ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. 
ఆల్కహాల్‌ వల్ల : కొందరిలో ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాతి రోజు కూడా ఒళ్లునొప్పులు రావచ్చు.  

ఫ్లూ. ఇతర జ్వరాలు :మనలో జలుబు, ఫ్లూ ఎక్కువ కాబట్టి ఫ్లూ గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం. ఫ్లూ జ్వరం ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ వల్ల వస్తుంది. ఇటీవల ప్రబలుతున్న కోవిడ్‌–19తో పాటు ఈ ఇన్‌ఫ్లుయెంజాతో వచ్చే ఫ్లూలోనూ ఒకే లక్షణాలు ఉంటాయి. అంటే... తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. ఫ్లూ చాలామందిలో దానంతట అదే తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్‌ తీసుకుంటే సరిపోతుంది. అలా తగ్గకపోయినా... కొంతమందిలో నిమోనియా, శ్వాసక్రియ సరిగ్గా జరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే... అదేదో ఫ్లూ మాత్రమే కావచ్చు అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు రోగిని తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. 

లెప్టోస్పైరోసిస్‌ 
ఇప్పుడిది వర్షాకాలం. వానలు కూడా ఎక్కువగానే పడుతున్నాయి. ఈ వర్షాకాలంలో కనిపించే జబ్బుల్లో ముఖ్యమైనది లెప్టోస్పైరోసిస్‌. ఇది కూడా ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరం. వర్షాకాలాల్లో ఎలుకలు బయట మురుగునీళ్లలో తిరగడం, అవే మళ్లీ ఇండ్లలోకి రావడం వల్ల ఈ వ్యాధి  వ్యాప్తిచెందుతుంది. ఇందులోనూ చాలామందిలో ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్‌) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్‌ను పెన్సిలిన్, టెట్రాసైక్లిన్‌ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే ఒళ్లునొప్పులు కనిపించగానే అది కోవిడ్‌–19 యే కావచ్చని ఆందోళన పడి, డీలా పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పైన పేర్కొన్న లక్షణాలు పారాసిటమాల్‌ వాడాక కూడా రెండు రోజుల్లో తగ్గకపోతే... కోవిడ్‌–19 కావచ్చేమోనని అనుమానించి... అప్పుడు వెంటనే కోవిడ్‌–19 నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. 

ఫైబ్రోమైయాల్జియా
మయాల్జియా అన్నదాన్ని బట్టే అది కండరాలకు సంబంధించిన వ్యాధి అని మనకు తెలుస్తుంది. మహిళల్లోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిలో కండరాల నొప్పులతో పాటు దేహంలో కొన్నిచోట్ల వేలితో కొద్దిపాటి ఒత్తిడి కలగజేస్తే నొప్పిగా ఉంటుంది. త్వరగా అలసిపోవడం, నిద్రలేమి, తిమ్మిర్లు, ఉదయం లేవగానే కండరాలు బిగుసుకుపోవడం ఈజబ్బులో ముఖ్యంగా కనిపిస్తాయి. ఈ నొప్పులు... తల వెనకభాగం, మెడ కింద, ఎదుర్రొమ్ములో రెండో ఎముక, మోచేతి కింద ఉండే ల్యాటరల్‌ ఎపీకాండైల్‌ ఎముక మీద, పిరుదు కండరాలపై నొక్కిచూసినప్పుడు ఒకవేళ నొప్పి ఉంటే దాన్ని ఫైబ్రోమయాల్జియాగా అనుమానించాల్సి ఉంటుంది. ఇది చాలావరకు ప్రమాదకరమైన జబ్బు కానే కాదు. మీకు మూడు నెలలుగా నొప్పులు అదేపనిగా వస్తూ ఉంటే... ఇలా దీర్ఘకాలంగా నొప్పులున్నందున అది కోవిడ్‌–19 కాకపోవచ్చనీ బహుశా ‘ఫైబ్రోమయాల్జియా’ కావచ్చు. ఇది ప్రమాదకరం కాదు కాబట్టి పూర్తిగా నిర్భయంగా ఉండవచ్చు.  

ఒంటినొప్పులు ఉన్నవారంతా గుర్తుంచుకోవాల్సిందల్లా... ఈ సీజన్‌లో జ్వరంతో పాటు వచ్చినందున అది కోవిడ్‌–19 మాత్రమే కాకపోవచ్చని ధైర్యం వహించాలి. ఒకవేళ రెండు రోజుల కంటే ఎక్కువసేపు ఈ జ్వరమూ, ఒళ్లునొప్పులూ కొనసాగితే... కోవిడ్‌–19 కాదేమోనంటూ మనల్ని మనం మభ్యపెట్టుకునేందుకు అది మిగతా కారణాల వల్ల కావచ్చేమోనని సర్దిచెప్పుకోవడమూ సరికాదు. విజ్ఞులైన వారు ఈ రెండింటికి మధ్య గీత గీయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ అవసరం. 

కండరాలనొప్పులకుచేయాల్సిన పరీక్షలు
మూత్రపరీక్ష ∙ఈఎస్‌ఆర్‌ ∙హీమోగ్రామ్‌ వంటి సాధారణ పరీక్షలు చేయించాలి.  కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు  కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ∙సీరమ్‌ ప్రోటీన్‌ ఎలక్ట్రోఫోరోసిస్‌ (ఎస్‌పీఈపీ) ∙స్కెలెటల్‌ సర్వే ∙బోన్‌ స్కాన్‌ ∙సీరమ్‌ క్యాల్షియమ్‌ ఫాస్ఫరస్‌ ∙ఆల్కలైన్‌ ఫాస్ఫోటేజ్‌ పరీక్షలు ∙25 హైడ్రాక్సీ వైటమిన్‌ డి లెవెల్స్‌ ∙సీరమ్‌ పారాథోర్మోన్‌ లెవెల్స్‌ ∙బోన్‌మ్యారో (ఎముక మూలగ) పరీక్ష  యాంటీన్యూక్లియర్‌ యాంటీబాడీస్‌ పరీక్ష ∙రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌  హెచ్‌ఐవీ ∙హెచ్‌బీఎస్‌ఏజీ  హెచ్‌సీవీ పరీక్షలు ∙మజిల్‌ బయాప్సీ ∙ఈఎంజీ... వంటి పరీక్షలు చేయిస్తారు. 
ఒకవేళ ఇలాంటి అన్ని రకాల పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోతే అది యాంగై్జటీ, డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. 

క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌
ఇటీవలి కోవిడ్‌–19 ఇన్ఫెక్షన్‌లో... దాదాపు 102 డిగ్రీలతో తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పుల తర్వాత కనిపించే అత్యంత ప్రధాన లక్షణాల్లో తీవ్రమైన అలసట, నిస్సత్తువ, అమితమైన నీరసం... ఏ పనీ చేయాలని అనిపించనంతటి తీవ్రమైన నిస్త్రాణ కూడా ఒకటి. కానీ ఇలా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, నిస్త్రాణ కనిపించాయంటే అది తప్పనిసరిగా కోవిడ్‌–19 యే కానక్కర్లేదు. ‘క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌’ అని పిలిచే ఒక కండిషన్‌లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కండిషన్‌ ఉన్నవారిలోనూ త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్‌ ఇన్‌ఫెక్సియస్‌ మోనోన్యూక్లియోసిస్‌ అనే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. 

మనం చేయాల్సింది ఇదే..
కోవిడ్‌–19 విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒళ్లునొప్పులు రాగానే వెంటనే ఆసుపత్రులకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ముందుగా పారాసిటమాల్‌గానీ లేదా ఎలాంటి హానీ చేయని నొప్పి నివారణ మందులను డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే ఒకటి రెండు రోజుల పాటు వాడాలి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆసుపత్రికీ లేదా డయాగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్లి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేయించాలి. ఒకవేళ అక్కడ కోవిడ్‌–19 లేదంటూ నెగెటివ్‌ వస్తే... కొంతకాలం ఆగి కొన్ని పరీక్షలు చేయించుకుని, నిర్దిష్టంగా ఏ కారణంగా ఒళ్లునొప్పులు వస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ఒంటినొప్పులు తాత్కాలికంగా ఉండి, ఆ తర్వాత తగ్గిపోతే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. 

నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులతో
మయస్థేనియా గ్రేవిస్, – ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో ఒళ్లునొప్పులొస్తాయి. పైగా ‘మయో’ అనే పదం కండరాలకు సంబంధించింది. కాబట్టి కండరాల వ్యాధులైన ఈ జబ్బులు కనిపించప్పుడు కండరాల్లో నొప్పుల కారణంగా ఒళ్లునొప్పులు వ్యక్తం కావడం చాలా సాధారణం. 
- డాక్టర్‌ సుధీర్‌ దారా ఇంటర్వెన్షనల్‌ పెయిన్‌ స్పెషలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement