సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వచ్చి తగ్గిన మొత్తం బాధితుల్లో దాదాపు నాలుగోవంతు మందికి గుండె సమస్యలు వస్తుంటే... వారిలోనూ నాలుగో వంతు మందిలో అవి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘జామా కార్డియాలజీ’లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... అంతకు ముందు అస్సలు గుండె సమస్యలు లేనివారు సైతం... కోవిడ్ తర్వాత గుండెజబ్బుల బారినపడి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని తేలింది.
కరోనా నుంచి బయటపడ్డాక కూడా గుండె సమస్యలు ఎందుకొస్తున్నాయి ?
గుండె కణాల్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్–2 (ఏసీఈ–2) అనే రిసెప్టార్లు ఎక్కువ. వీటికి అంటుకునే కరోనా మన దేహంలోకి చొరబడుతుంది. ఇలా ఈ రిసెప్టార్ల వల్లనే వ్యాప్తి చెందుంతుంది కాబట్టి గుండెకు సంబంధించిన కండరాలు ప్రభావితమయ్యే అవకాశాలూ ఎక్కువ. ఆ తర్వాతి క్రమంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ... వైరస్‌తో పోరాడే సమయంలో అక్కడ (గుండెలోని కణాల్లో) జరిగే ప్రతిక్రియల వల్ల గుండె కణాలూ, కండరాలు దెబ్బతింటాయి. అలాగే గుండెలోపలా, పైనా ఉండే రక్తనాళాలూ (ధమనులూ, సిరలు) ప్రభావితమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ ధమనులూ, సిరల్లోనూ లోపలి పొరలో (లైనింగ్‌లో) ఉండే ‘ఎండోథీలియల్’ కణాలు దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాల్లోని కణాలూ దెబ్బతినడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావిమవుతుంది. అది మళ్లీ గుండెపైనే ప్రభావం చూపుతుంది.
ప్రధానమైనది ‘పాట్స్’
కరోనా సోకి కోలుకుంటున్న కొందరిలో పాట్స్ అనే సమస్య కనిపించవచ్చు. ‘పోష్చురల్ ఆర్థోస్టాటిక్ టాకికార్డియా సిండ్రోమ్’ అనే వైద్య సమస్య (కండిషన్)కు సంక్షిప్త రూపమే ఈ ‘పాట్స్’. ప్రస్తుతం ఈ పాట్స్‌కూ... కోవిడ్‌కు ఎంతవరకు సంబంధం ఉందనే అంశంపై పరిశోధనలు చాలా చురుగ్గా, విస్తృతంగా జరుగుతున్నాయి. ఇది కొంత ‘గుండె’కు సంబంధించిన, మరికొంత ‘నాడీ వ్యవస్థ’కు సంబంధించిన సమస్య. గుండె స్పందనలను నియంత్రించే నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యతో పాటు గుండె కూడా ప్రభావితం కావడం వల్ల గుండె సంస్పందనలు ప్రభావితమవుతాయి. దాని కారణంగానే చాలామందిలో కోవిడ్ అనంతర పరిణామంగా చెప్పుకుంటున్న అయోమయ పరిస్థితి (బ్రెయిన్ ఫాగ్), తీవ్రమైన నిస్సత్తువ (ఫెటీగ్), గుండెదడ (పాల్పిటేషన్స్), తల అంతా తేలికైపోయినట్లుగా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించే లైట్‌హెడెడ్‌నెస్ వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి.
సాధారణ లక్షణాలివే..
గుండెపై కరోనా అనంతర ప్రభావాల వల్ల కనిపించే లక్షణాలు చాలా ఉన్నాయి. తీవ్రమైన నిస్సత్తువ అందులో ఒకటి. కరోనా వల్ల రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరా తగ్గడం వంటివి సంభవిస్తాయని చెప్పుకున్నాం కదా. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన అలసట కనిపిస్తుంటుంది. దాంతో వారాల తరబడి పడకకే పరిమితమవుతారు. కొన్నిసార్లు ఊపిరి అందకపోవడం, త్వరత్వరగా ఊపిరిపీలుస్తూ ఉండటం, ఆయాసం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో ఛాతీనొప్పి, గుండెదడ వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వీటిలో కొన్ని గుండెకు సంబంధించిన లక్షణాలూ అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి అందకపోవడం, ఆయాసం, నిస్సత్తువ, నీరసం వంటి లక్షణాలు కనిపించనప్పుడు అది ఊపిరితిత్తులకు సంబంధించినవి కావచ్చు అని అనుకోకుండా ఒకసారి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెదడ అయితే అది గుండెకు సంబంధించిన సమస్యే అని తెలిసిపోతుంది కాబట్టి నిర్ద్వంద్వంగా గుండె డాక్టర్‌ను సంప్రదించాలి.
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత...
కోవిడ్ నుంచి కోలుకున్నవారూ కనీసం మూడు నెలల పాటు అందరిలాగే మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం / శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాలు పాటించడం వంటి కోవిడ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి. ∙అంతకు ముందు తాము తమ వైద్య సమస్యల కారణంగా వాడుతున్న మందులనూ / చికిత్సనూ ఆపకుండా కొనసాగించాలి. ఛాతీలో నొప్పి / అసౌకర్యం, చెమటలు పెట్టడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి.మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ఒత్తిళ్లు, యాంగై్జటీ గుండెకు కీడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ∙కోవిడ్–19 నుంచి కోలుకున్న చాలామందిలో గుండె స్పందనల రేటు నిమిషానికి 100 – 120 ఉండటం కూడా వైద్యనిపుణులు గుర్తించారు. కాబట్టి గుండెదడగా అనిపించినప్పుడు అది పల్మునరీ ఎంబాలిజమ్ (రక్తప్రవాహంలో గాలి బుడగ రావడం), మయోకార్డయిటిస్ (గుండె కండరానికి ఇన్ఫెక్షన్ / ఇన్‌ఫ్లమేషన్ రావడం), హైపాక్సియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లోపించడం) వంటి సమస్యలా లేక సాధారణ సమస్యలా అన్నది నిర్ధారణ చేయడానికి తక్షణం హృద్రోగ నిపుణులను సంప్రదించాలి.
చాలామంది యువకులు నెగెటివ్ రిపోర్టు రాగానే వ్యాయామం మొదలుపెడుతున్నారు. అలా చేయడం సరికాదు. ఊపిరితిత్తులు తగినంత బలం పుంజుకునేంతవరకు కొంత వ్యవధి ఇవ్వడమే మేలు. మరీ ముఖ్యంగా లంగ్ నిమోనియా / సీటీ స్కాన్ కౌంట్ 9 లేదా 10 ఉన్నవారు వ్యాయాయం మొదలుపెట్టడానికి ముందర తప్పనిసరిగా తగినంత సమయం తీసుకోవాలి. ∙మంచి పోషకాహారం తీసుకుంటూ, తగినంతగా నీళ్లు తాగుతూ (హైడ్రేటెడ్‌గా ఉంటూ), బాగా విశ్రాంతి తీసుకుంటూ, గుండెకు సంబంధించిన మందులు లేదా ఇతరత్రా మందులను కొనసాగిస్తూ... ఆందోళన కంటే అవగాహన పెంచుకుని నిశ్చింతగా ఉండటం మంచిది. ఇది గుండెతోపాటు వారి సాధారణ ఆరోగ్య మెరుగుదలకూ దోహదపడుతుందన్నది నిపుణుల మాట.
గుండె స్పందనల్లో మార్పులు...
కోవిడ్ తర్వాత చాలామందిలో గుండె స్పందనల వేగం పెరిగి గుండెదడగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ఇలాంటివారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తీరాలి. ఈ గుండెదడకు ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు దేహానికి సరిపడా నీరు అందనప్పుడూ గుండెదడ వస్తుంది. అంటే బాగా నీళ్లు తాగడం, తగినంతగా ద్రవాహారం తీసుకోవడం వల్ల గుండెదడ దానంతట అదే తగ్గుతుంది. ఇలాంటివే మరికొన్ని చిన్నా, పెద్దా కారణాల వల్ల కూడా గుండెదడ రావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో... నిజంగా అది ‘డీ హైడ్రేషన్’ కారణంగా వస్తున్న గుండెదడా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది డాక్టర్ నిర్ణయించడమే మంచిది. అందుకే గుండె లయ (రిథమ్) తప్పడం, తలతిరుగుతున్నట్లు అనిపించడం (డిజ్జీనెస్), ఛాతీలో అసౌకర్యం (చెస్ట్ డిస్‌కంఫర్ట్) వంటివి కనిపించినప్పుడు తప్పనిసరిగా గుండెవైద్య నిపుణులను సంప్రదించాలి.
ఈ లక్షణాలు ఉన్నాయా... అప్రమత్తం కండి...
► త్వరత్వరగా గాలి పీలుస్తూ ఉండాల్సి రావడం, పడుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ (ఫెటీగ్ / టైర్‌డ్‌నెస్) ఉంటూ... ఆక్సీమీటర్ పెట్టినప్పుడు రక్తంలో ఆక్సిజన్ శాతం 92% కంటే తగ్గడం.
► ఛాతీనొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, తలతిరిగినట్లుగా ఉండటం, బాగా విశ్రాంతిగా ఉన్నప్పుడు లక్షణాలు తగ్గినట్లుగా అనిపించడం.
గుండెపై ప్రభావం తాత్కాలికమా... శాశ్వతమా?
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘గుండెపై ఉన్న ఈ ప్రభావం తాత్కాలికమా? లేక శాశ్వతంగా ఉంటుందా?’ అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. తాము నేరుగా కోవిడ్ బారిన పడకపోయినా... తమ ఇంట్లోని కుటుంబసభ్యులెరిలోనైనా ఈ లక్షణాలు కనిపించినా ఇవే సందేహాలు ముప్పిరిగొంటాయి. అయితే గుండె కండరం ఏ మేరకు దెబ్బతింది, ఎంత మేరకు ప్రభావితమైంది అనే అంశాల ఆధారంగానే అది శాశ్వతమా, తాత్కాలికమా అన్నది ఆధారపడుతుంది. ఈ అంశంపై ఇంకా పరిశోధనలూ, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచి ఫిట్‌నెస్‌తో ఉండి, బాగా ఆటలాడే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో సైతం కోవిడ్ తర్వాత వారి గుండె కండరం మీద గాటు / గీత (స్కార్) రావడం చాలామందిలో కనిపించింది. ఇలాంటివారిని ఏ తరుణంలో మళ్లీ క్రీడలకు అనుమతించాలనే అంశంపై నిపుణులు తగిన ప్రోటోకాల్ నిర్ణయించే పనిలో ఉన్నారు.
మరికొన్ని అనర్థాలు...
మరికొందరిలో గుండె పంపింగ్ తీరు దెబ్బతినడం, అది రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోవడం వంటి సమస్యలనూ గమనించారు. కొందరు అథ్లెట్లలో కోవిడ్ తర్వాత మునుపటి ఫిట్‌నెస్ దానంతట అదే రాకపోవడంతో... ఫిజియోథెరపీ అవసరం కావడం, బ్రీతింగ్ వ్యాయామాలతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment