కనీవినీ ఎరగని అద్భుతమైన ప్రపంచ రికార్డ్‌కు సుందరదేశం స్విట్జర్లాండ్ వేదిక అయింది. 25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఈ అసాధారణమైన రికార్డ్‌లో భాగం అయ్యారు. ఈ లాంగెస్ట్ ఉమెన్స్ రోప్ టీమ్ 4164 మీటర్ల ఎత్తయిన బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘పురుషుల వల్ల మాత్రమే అవుతుంది’ అనే అపోహతో కూడిన అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వీరిలో పర్వతారోహణతో పరిచయం ఉన్నవారితో పాటు, ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనని వారు కూడా ఉన్నారు. మన దేశం నుంచి ముంబైకి చెందిన ఆంచల్ ఠాకూర్, షిబానీ చారత్, చార్మీ దేడియాలు పాల్గొన్నారు.
‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మొదట స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్కైయర్‌గా స్విస్ ఆల్ఫ్స్ నాకు కొత్తకాకపోయినప్పటికీ, ప్రపంచం నలుమూలల నుంచి, వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన మహిళలతో కలిసి ప్రయాణించడం అనేది జీవితం మొత్తం గుర్తుండి పోయే జ్ఞాపకం. చాలామంది భద్రజీవితంలో నుంచి బయటికిరారు. తమ చుట్టూ వలయాలు నిర్మించుకుంటారు. అలాంటి వారు ఆ వలయాల నుంచి బయటికి రావడానికి, ప్రపంచ అద్భుతాలలో భాగం కావడానికి ఇలాంటి సాహస కార్యక్రమాలు ఉపయోగపడతాయి’ అంటుంది ఆంచల్ ఠాకూర్.
‘ఇప్పటికీ ఆ ఆనందం నుంచి బయటపడలేకపోతున్నాను. శక్తిని ఇచ్చే ఆనందం అది. ఆల్ ఉమెన్ గ్రూప్‌తో కలిసి చరిత్ర సృష్టించడంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చి కొత్త అడుగులు వేయిస్తుంది’ అంటుంది షిబానీ.
ఈ సాహసయాత్ర అనుభవాలను పదేపదే గుర్తు తెచ్చుకుంటుంది ఛార్మీ దేడియా.
‘వివిధ దేశాలు, వివిధ రంగాలు, వివిధ వయసు వాళ్లతో కలిసి సాహసయాత్రలో భాగం కావడం మామూలు విషయం కాదు. సాహసానికి సరిహద్దులు, భాష ఉండవు అని మరోసారి తెలుసుకున్నాను. పర్వతాలు స్ఫూర్తి ఇస్తాయి. సాహసాన్ని రగిలిస్తాయి.. అంతేతప్ప ఎప్పుడూ చిన్నబుచ్చవు అని పెద్దలు చెప్పిన మాట మరోసారి అనుభవంలోకి వచ్చింది’ అంటుంది ఛార్మీ. టూరిజంను ప్రమోట్ చేయడానికి, సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ‘హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో స్విస్ మౌంటెన్ గైడ్స్ అసోసియేషన్‌లాంటి సంస్థలు, పర్వతారోహణలో దిగ్గజాలలాంటి వ్యక్తులు పాలుపంచుకున్నారు.
చదవండి: హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్
Breithorn Mountain: బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించిన మహిళలు.. ప్రపంచ రికార్డు..!
Published Sun, Jun 26 2022 8:26 AM | Last Updated on Sun, Jun 26 2022 11:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment