ప్రతీకాత్మక చిత్రం
సంధ్య (పేరు మార్చడమైనది)కు ఇంజనీరింగ్ లో సీటు రావడంతో తన పెద్దమ్మ కూతురైన గీత ఇంట్లో ఉండి చదువుకుంటోంది. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. వారి కొడుకు కిశోర్ (పేరు మార్చడమైనది) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా సంధ్య ముభావంగా ఉండటం, తనలో తనే బాధపడటం చూసిన గీత ఏమైందని అడిగింది. అయినా, ఏమీ చెప్పలేకపోయింది సంధ్య. కానీ, గీత గట్టిగా అడిగేసరికి ‘చచ్చిపోతాను’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సమస్య ఏంటని సముదాయిస్తూ అడిగేసరికి తన ఫోన్ చూపించింది గీత.
సంధ్య స్నానం చేస్తుండగా ఎవరో తీసిన వీడియో అది. ఆ వీడియో ఏదో వెబ్‌సైట్‌లో ఉందని, స్నేహితురాలు తనకు షేర్ చేసిందని ఏడుస్తూ చెప్పింది సంధ్య. గీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. విషయాన్ని భర్తతో చెప్పింది. ఎటువైపు నుంచి ఏ దుండగుడు ఆ వీడియోను తీశాడో తెలియలేదు. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది.
సంధ్య స్నానం చేస్తుండగా కిశోర్ తీసిన వీడియో అది అని తేలి, ఇంట్లో అంతా ఉలిక్కిపడ్డారు. ఇలాగే, వారి ఇంటి పక్కనే ఉంటున్న అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్‌ల నుంచీ వీడియోలు తీస్తున్నాడనే విషయాన్ని రాబట్టారు. కిశోర్ ఫోన్‌లో ఉన్న వీడియోలు చూస్తే ఇలాంటి వీడియోలు పదికి పైగానే ఉన్నాయి. ఇంత దారుణాన్ని పన్నెండేళ్ల పిల్లవాడు చేశాడంటే ఎవ రికీ నమ్మబుద్ధికాలేదు.
ఆడుకోవడానికని ఇస్తే..
గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. పనివేళలూ ఎక్కువే. పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని స్మార్ట్‌ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశారు. కిశోర్ స్కూల్ టైమ్ అయిపోగానే వాటిని ముందేసుకునేవాడు. పెద్దవాళ్లు కూడా పిల్లవాడు తమను విసిగించుకుండా ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నాడని అనుకున్నారు. డిజిటల్ గేమ్స్ వల్ల మెదడు కూడా చురుకుగా మారుతుందని భావించారు.
అయితే, గేమ్‌లో భాగంగా ఆన్‌లైన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో భాగస్థుడయ్యాడు కిశోర్. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో భాగంగా టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్. అందులో ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో భాగంగా టీనేజర్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి, వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది.
కిందటేడాది...
2020 క్రైమ్ గణాంకాల ప్రకారం విజయవాడతో సహా కృష్ణాజిల్లాలో 220 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువమంది నిందితులు మైనర్లే. పోర్న్ వీడియోలు చూసి, తాము ఈ నేరం చేశారని అంగీకరించారు. కృష్ణా జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఎనిమిదేళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడన్న విషయమై అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తే స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చూసేవాడినని, అవే తనను ఈ దారుణానికి ప్రోత్సహించేలా చేశాయనే వాస్తవాన్ని బయటపెట్టాడు. టీనేజర్లు, యువకులు అశ్లీల చిత్రాలకు బానిసలైన వారు ఈ తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో టీనేజర్లు కోపం, క్రూరత్వం, వక్రబుద్ధి, లైంగిక దాడి వంటి అసాధారణ లక్షణాలను కూడా చూపుతున్నారని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. శారీరక శ్రమ లేకుండా డిజిటల్ మీడియాతో ఎక్కువ కాలక్షేపం చేసే టీనేజర్లలో విపరీత చర్యలు చూడాల్సి వస్తోందని, టీనేజర్ల మనసును క్రీడల వంటి శారీరక శ్రమ వైపు మళ్లిం^è గలగాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి
పిల్లలు డిజిటల్ వాతావరణంలో ఎంతవరకు సురక్షితంగా ఉన్నారనేది ఎలా తెలుసుకోవాలన్నది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పెద్ద సమస్య. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి కొన్ని హద్దులను నిర్ణయంచడంతో పాటు కొంత బ్యాలెన్సింగ్ విధానాన్ని కూడా నేర్పాలి. మీరు తమకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం పిల్లలు తెలుసుకోగలగాలి. ఆన్‌లైన్ సమస్యలను పరిష్కరించడంలో పెద్దలు తమకున్న అనుభవాన్ని పిల్లలకు చెప్పాలి.
పిల్లల భావాలను అర్ధం చేసుకోవడానికి ముఖ్యంగా వారు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నామన్నది వారికి తెలియాలి. వారి ఆన్‌లైన్ ప్రపంచాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, సరైన భద్రత తీసుకుంటూ వారు సురక్షితంగా ఉన్నారని పెద్దలు నిర్ధారించుకోవాలి. మీ పిల్లల మాట వినడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. దీనిద్వారా వారు ఏం చేస్తున్నారో గమనించవచ్చు.
– అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్
తల్లితండ్రుల పర్యవేక్షణే రక్షా కవచం
పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కానీ, అనవసర చెత్తనంతా మెదళ్లకు చేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, వీడియో గేమ్స్ దృష్ట్యా పిల్లలందరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే, డిజిటల్ విధానంలో జరిగే క్రైమ్‌ను అరికట్టాలంటే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ విషయంగా వచ్చే కేసుల విషయంలో మేం కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చినప్పటికీ అందులో కొన్ని సెక్యూరిటీ సేఫ్టీ యాప్స్ ఉన్నాయి.
వాటిని ఇన్‌స్టాల్ చేసి తాము పర్యవేక్షణ చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. ఏ మార్గమైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించని, కుటుంబానికి హాని తలపెట్టని విధంగా ఉండేందుకు ఎప్పుడూ గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి. పిల్లలను వారి మానాన వారిని వదిలేయకుండా, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావారణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– దీపికా పాటిల్,స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment