
PC: chatore_broothers
ఇదేదో కొత్తగా ఉందే.. మట్టిలో టమాటాలను వేయించి.. ఆపై
Delhi Street Food Vendor Roast Tomato In Sand Video Goes Viral Watch: నోరూరించే.. ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్‌ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పానీపూరీ, వడాపావ్.. కరకరలాడే బజ్జీలు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే జిలేబి.. ఇలా చెప్పుకొంటూ పోతే లిస్టు పెద్దదే. మరి... జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు కదా! అందరిలా ఆలోచిస్తే ప్రత్యేకత ఏముంటుంది? కొత్త కొత్త వంటకాలు ట్రై చేయాలి అనుకున్నాడో ఏమో.. ఓ యువకుడు కాస్త వెరైటీ ఫుడ్ ఐటమ్‌తో ముందుకు వచ్చాడు.
సాధారణంగా టమాటాలతో మనం కూర, చట్నీ, చారు.. మహా అయితే టమాటా బాత్ వంటి వంటకాలు చేసుకుంటాం! కానీ... తూర్పు ఢిల్లీలోని చిత్రవిహార్‌కు చెందిన ఈ అబ్బాయి మాత్రం.. నూనెతో పని లేకుండానే.. పొయ్యి మీద మూకుడులో మట్టిపోసి.. దాంట్లోనే టమాటాలను వేయిస్తున్నాడు. ఆ తర్వాత నీటిలో వాటి శుభ్రంగా కడిగి... ముక్కలు చేసి.. అందులో మసాలాలు.. చట్నీ వేసి తన దగ్గరికి వచ్చిన కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఫుడ్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలని భావించేవాళ్లు.. వీలైతే ఓసారి ట్రై చేయండి! అసలే టమాటా ధర కిలో వంద దాటింది అని మండిపోతుంటే.. మీ ఉచిత సలహా ఏంటని తిట్టుకోకండి! మర్లేం పర్లేదు ధర తగ్గిన తర్వాతే.. మట్టిలో టమాటాలను వేయించుకుని తినండి!
చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..!