మాయలు మంత్రాలు అంటే ఆసక్తి ఉండేదట | Director B Vittalacharya Special Story In Family | Sakshi
Sakshi News home page

అక్కడికక్కడ అల్లేసేవారు

Published Wed, Nov 18 2020 10:40 AM | Last Updated on Wed, Nov 18 2020 10:40 AM

Director B Vittalacharya Special Story In Family - Sakshi

బి. విఠలాచార్య (1920–1999), సినీ దర్శకులు, నిర్మాత 

అట్టలతో సెట్టింగులు.. కత్తి యుద్ధాలు. మాయలు మంత్రాలు.. దెయ్యాలు, పిశాచాలు. మనిషి ఎలుగుబంటిగా మారటం!  అబ్బో పిల్లలకు ఎంతిష్టమో విఠలాచార్య.  పెద్దలకు మాత్రం!! ఆయన మ్యాజిక్కులు చూడటానికి ఎగపడేవారు. వ్యక్తిగతంగా.. క్రమశిక్షణ, పొదుపు, పరోపకారం.. ఇవన్నీ ఒక పాత్రలో పోస్తే  ఆయనే విఠలాచార్య. ఫ్యామిలీ ‘సినీ పరివారం’ శీర్షిక కోసం ఆయన కుమార్తె రాధను  కలిసినప్పుడు.. తండ్రి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

నాన్నగారు మొత్తం డెబ్బై సినిమాలు తీశారు. క్షణం తీరిక ఉండేది కాదు. మాతో మాట్లాడటానికి ఇంటి దగ్గర దొరకడమే కష్టంగా ఉండేది. అంత బిజీలోనూ నాన్నగారు మా చదువుల్ని నిర్లక్ష్యం చేయలేదు. మేం ఎనిమిది మందిమి. మా అందర్నీ బాగా చదివించారు. నేను బి.ఏ. చేశాను. మా అన్నయ్యకి, నాకు మాత్రమే తెలుగు వచ్చు. ఇంటి విషయాలన్నీ అమ్మే చూసుకునేది. మేం ఉడిపివాళ్లం. నాన్న సినీ దర్శకులు, నిర్మాత. సినిమా తీశాక టీమ్‌ అందరికీ ప్రివ్యూ వేసేవారు. ఇంట్లో వాళ్లం కూడా వెళ్లేవాళ్లం. సినిమా చూసి వచ్చాక ఆ సినిమా గురించి నాన్నగారితో చర్చించేవాళ్లం. ఆయన చాలా తక్కువగా మాత్రమే మాట్లాడేవారు. నాన్నగారికి చిన్నప్పుడు మాయలు మంత్రాలు అంటే చాలా ఆసక్తిగా ఉండేదట. ఆయనకు ఇష్టం అని నాన్నగారి అమ్మమ్మ నాన్నగారి చిన్నతనంలో అన్నీ అలాంటి కథలే చెప్పేవారట. ఆవిడ ప్రభావం కారణంగానే నాన్న జానపద చిత్రాలు తీసి, జానపద బ్రహ్మ అనిపించుకుని ఉంటారు.

రాధ, విఠాలాచార్య కుమార్తె, కుమారులు, కుమార్తెలు  (ఎడమ నుంచి కుడి) శశిధర్‌ ఆచార్య, పద్మిని, శ్రీనివాస ఆచార్య, రాజి, పద్మనాభ ఆచార్య, రాధ, లలిత,
మురళీధర ఆచార్యలతో విఠలాచార్య భార్య జయలక్ష్మి ఆచార్య 

సినిమా సన్నివేశాలు అక్కడికక్కడ అల్లేయడం ఆయనకు చిటికెలో పని. మాక్కూడా కథలు కల్పించి తమాషాగా చెప్పేవారు. కథలే కాదు, నాన్నగారితో కలిసి షూటింగులు చూడటానికి కూడా స్టూడియోలకు వెళ్లేవాళ్లం. ఒకసారి ఆయన మెగా ఫోన్‌ పట్టుకుని, ‘యాక్షన్‌’ అన్నారంటే మేమంతా మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సిందే. మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాక, మమ్మల్ని సినిమా నుంచి దూరంగా ఉంచారు నాన్నగారు. మేం చెన్నైలో ఉన్నప్పుడు మా ఇల్లు కింద ఉండేది. మేడ మీద డ్యాన్సులు, పాటల ప్రాక్టీసు, రికార్డింగు జరిగేవి. పాటల కోసం పి.సుశీల, జిక్కి ఇతర ప్రముఖులు వచ్చేవారు. వారు మాకు చాకొలేట్స్‌ తెచ్చి ఇచ్చి ముద్దు చేసేవారు. ప్రముఖ సంగీత దర్శకులు రాజన్, నాగేంద్ర అప్పట్లో నాన్నగారి చిత్రాలకు సంగీతం సమకూర్చేవారు. వారు కూడా ఇంటికి వచ్చేవారు. వాళ్లందరినీ దూరం నుంచి చూసేవాళ్లం.

నాన్నగారు మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. ఆ సమయంలో నాన్న దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ బయటి సంస్థలకు పనిచేయడం ప్రారంభించారు. నాన్నగారు మళ్లీ ప్రొడక్షన్‌ ప్రారంభించగానే, వారంతా వెనక్కు వచ్చేశారు. స్టంట్‌ వాళ్లు, లైటింగ్‌ బాయ్స్‌ నుంచి అందరూ మళ్లీ నాన్న ప్రొడక్షన్‌ రీ ఎంట్రీగా నాన్నగారి దగ్గరకే వచ్చేశారు. నాన్న వాళ్లందరి క్షేమసమాచారాలు కనుక్కునేవారు. వాళ్లు నాన్నతో కష్ట సుఖా లు చెప్పుకునేవారు. వాళ్లంతా ఎంత కష్టపడతారో నాన్నకు తెలుసు. సినిమాలలో హీరోలకు బదులుగా గుర్రాల మీద దూకడం వంటివి డూప్‌లుగా చేసేవారు. వాళ్లకి దెబ్బలు కూడా తగిలేవి. అందుకే వారి సంక్షేమం నాన్నగారు చూసుకునేవారు.

ఉన్నదంతా ఇచ్చేసేవారు
నాన్నగారు మొదట్లో కన్నడ పరిశ్రమలోనే చిత్రాలు తీశారు. ఆ భాషలో ఏడెనిమిది సినిమాలు తీశారు. అందులో ఎక్కువగా సాంఘిక చిత్రాలే. అక్కడ పెద్దగా లాభాలు రాలేదు. అందువల్ల తెలుగులోకి మారారు. తెలుగులో కూడా ఎక్కువగా జానపదాలే తీశారు. తక్కువ ఖర్చులో సినిమా పూర్తి చేసేవారు. సెట్టింగ్‌లకు కూడా ఎక్కువ ఖర్చు చేయించేవారు కాదు. ఆయన సినిమాలు చూస్తుంటే చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపించేది. సూపర్‌ హిట్‌ అయిన ‘జగన్మోహిని’ చిత్రాన్ని నాన్నగారు ముందర కన్నడంలో తీశారు. ఆ తరువాత తెలుగులో తీశారు. అప్పట్నుంచీ నాన్నగారిని జగన్మోహిని విఠలాచారి అని పిలిచేవారు. కథ, దర్శకత్వం అన్నీ నాన్నగారే. అన్నీ ఆయనకు నచ్చితేనే సినిమా ప్రారంభమయ్యేది. నాన్నగారి సినిమాల గురించి అందరికీ తెలిసిందే.

మనిషిగా ఆయన ఏమిటో మీకు చెప్పాలి. నాన్నగారు ఉదయాన్నే వరండాలో ఒక కుర్చీలో కూర్చునేవారు. ఆ సమయంలో చాలామంది సహాయం కోసం వచ్చేవారు. ఎవరు ఏది అడిగితే వాళ్లకి అది ఇచ్చి పంపేవారు నాన్నగారు. పరిశ్రమలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వారికి సహాయం చేయటంలో ముందుండేవారు. కొందరు స్టౌ మీద ఎసరు పెట్టుకుని బియ్యం కోసం వచ్చేవారు. వెంటనే నాన్నగారు ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. ఒక్కోసారి జేబులో ఉన్నంతా ఇచ్చేసేవారు. బాగా ఇబ్బందిగా ఉన్నవారికైతే నెల రోజులకు సరిపడా సంభారాలు తెప్పించి ఇచ్చేవారు. ఎవ్వరు ఏమి అడిగినా లేదనేవారు కాదని అన్నయ్య చెప్పేవారు మాకు.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement