పండుగ వస్తోంది... ఇంటికి కొత్త ప్రమిదలు వచ్చేసి ఉంటాయి. ఇంటి ముందు ముగ్గులు... వాకిటికి పూలతోరణాలు వెలుస్తాయి. పండుగ అంతా ఇంటి ముందే ఉంటే... ఇంటి లోపల ఏముంటుంది? పండుగ సంతోషంలో నేను లేనా అని వంటగది ఎదురు చూస్తుంటుంది. పిండివంటల పాత్రల కోసం భోజనాల గది దొంగచూపులు చూస్తుంది. తియ్యటి రుచుల కోసం ఇంటిల్లిపాది నోట్లో నీళ్లూరుతుంటాయి.
చక్కగా వండండి... ప్రేమగా వడ్డించండి... హాయిగా ఆస్వాదించండి. పిల్లల ముఖాలు పగలే మతాబుల్లా వెలగకపోతే అడగండి. బాణలి పెట్టండి... స్టవ్ వెలిగించండి... పండగ చేసుకుందాం.
మాల్ పువా
కావలసినవి:
►గోధుమ పిండి– ముప్పావు కప్పు
►సూజీ (బొంబాయి) రవ్వ– పావు కప్పు
►యాలకుల పొడి– అర టీ స్పూన్
►సోంపు పొడి– పావు టీ స్పూన్
►వేడి పాలు – ఒకటిన్నర కప్పు
►పాల మీగడ– రెండు టేబుల్ స్పూన్‌లు
►చక్కెర – కప్పు
►కుంకుమ పువ్వు – పది రేకలు
►నెయ్యి – వేయించడానికి తగినంత
►బాదం – పది (సన్నగా తరగాలి), పిస్తా – పది.
తయారీ
►పెద్ద పాత్రలో గోధుమపిండి, రవ్వ, యాలకులపొడి, సోంపు పొడి వేసి బాగా కలపాలి.
►ఇందులో పాలు పోసి కలుపుకోవాలి.
►ఇప్పుడు పాల మీగడ వేసి గరిటజారుడుగా కలిపి మూతపెట్టి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
►స్టవ్ మీద వెడల్పు పాత్రలో చక్కెరలో అదే మోతాదులో నీరు పోసి మీడియం మంట మీద మరిగించాలి.
►అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బాదం తరుగు, పిస్తా వేసి కలపాలి.
►చక్కెర పాకం చిక్కబడేటప్పుడు మంట తగ్గించాలి.
►తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి.
►స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి.
►ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి సరి చూసుకోవాలి.
►మరీ గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు పోసి కలపాలి, మరీ వదులుగా ఉంటే కొంచెం గోధుమ పిండి వేసి కలపాలి.
►ఈ పిండిని చిన్న గరిటెతో తీసుకుని కాగిన నెయ్యిలో పోసి దోరగా వేగే వరకు కదిలించకూడదు.
►రెండు వైపులా దోరగా కాలిన తరవాత చిల్లుల గరిటెతో తీసి మరొక చెక్క గరిట సాయంతో నెయ్యి జారిపోయేటట్లు వత్తి చక్కెర పాకంలో వేయాలి.
►మూడు– నాలుగు నిమిషాల పాటు పాకంలో మునిగేటట్లు ఉంచి తీసివేయాలి.
►ఇలాగే పిండినంతటినీ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి!
Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment