చెప్పులు మధ్యాహ్నమే ఎందుకు కొనాలి?  | Doctor Alerts Be Care With Footwear When You Bought | Sakshi
Sakshi News home page

చెప్పులు మధ్యాహ్నమే ఎందుకు కొనాలి? 

Feb 5 2021 9:04 AM | Updated on Feb 5 2021 4:25 PM

Doctor Alerts Be Care With Footwear When You Bought - Sakshi

సుష్మ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తోంది. ఎప్పుడూ పాదాల పగుళ్లు, కాలి గోర్ల చివరన ఇన్ఫెక్షన్‌తో బాధపడేది.

సుష్మ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తోంది. ఎప్పుడూ పాదాల పగుళ్లు, కాలి గోర్ల చివరన ఇన్ఫెక్షన్‌తో బాధపడేది. ఆయింట్‌మెంట్లు, ఇతర మందులు వాడినా ఫలితం లేదు. ఇటీవల ఓ డాక్టర్‌ను సంప్రదించి తన సమస్యను వివరించగా.. ఆయన అది మీరు వేసుకునే చెప్పుల లోపంగా చెప్పడంతో సుష్మ విస్తుపోయింది. ఆయన సలహా మేరకు పాదరక్షలు వినియోగించడంతో ఆర్నెల్లలోనే  ఆమె సమస్య నుంచి బయట పడింది. 

సాక్షి, హైదరాబాద్‌:  దుస్తుల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా వరకు నిక్కచ్చిగానే వ్యవహరిస్తుంటారు. అంటే కొలతలు కరెక్టుగా ఉండాలని భావిస్తుంటారు. వాటి ప్రాధాన్యత అలాంటిది మరి. వినడానికి కాస్త వింతగా అని్పంచవచ్చు కానీ మనం వేసుకునే పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మన పాదాలకు అతుక్కుని ఉండి, వాటిని కాపాడేది పాదరక్షలే.

ఈ పాదరక్షల విషయంలో ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యగా కూడా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదరక్షలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరైన సైజును ఎంచుకోవాలని చెబుతున్నారు. మరి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, డయాబెటిస్‌ రోగులు, సర్జరీలు చేయించుకున్న వాళ్లు తప్పకుండా మధ్యాహ్నం, సాయంత్రం మధ్య వేళలో (లేట్‌ ఆఫ్టర్‌నూన్‌) చెప్పులైనా, బూట్లైనా కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు. 

మధ్యాహ్నమే ఎందుకు...? 
గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్‌ పేషంట్లకు సహజంగా కాళ్ల వాపులుంటాయి. అదే విధంగా ఎక్కువ సమయం కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం విధినిర్వహణలో ఉన్నంత సేపు కాళ్లు కాస్త వాచి కనిపిస్తుంటాయి. ఎక్కువసేపు కూర్చోవడంతో కండరాల్లో ఎక్కువ సేపు కదలికలు నిలిచిపోవడంతో వాపు వస్తుంది. ఈ కేటగిరీలోనివారికి ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దది తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగని బాగా పెద్ద సైజు తీసుకుంటే మామూలు సమయంలో వదులవుతాయనుకోండి. అయితే పనివేళలో సరైన సైజ్‌ చెప్పులు, బూట్లు వేసుకోవడం సౌకర్యంగా ఉంటుందని, ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. 

బిగుతు చెప్పులతో తిప్పలు... 
కాలి సైజు కంటే చిన్నగా, బిగుతుగా ఉండేవి ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాదాలకు పగుళ్లు వస్తాయి. అవి దీర్ఘకాలికంగా తగ్గవు. కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు సైతం ఎదురవుతాయి. బిగుతైన బూట్లు వేసుకుంటే గోర్లు పెరుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లకు గురై తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడంతో మడమల సమస్యలు ఎదురవుతాయి. అలాగే తరుచూ కాళ్లు బెణకడంతో పాటు నడకలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

రెండు కాళ్లకూ వేసుకుని చూడాలి 
పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్‌ వేసి ఖరారు చేసుకోవద్దు. రెండు కాళ్లకు వేసుకుని కాస్త ముందు, వెనక్కి నడిచిన తర్వాత సౌకర్యవంతంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు సాక్స్‌ ధరించి ట్రయల్‌ వేయాలి. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. 
– డాక్టర్‌ కుమార్‌ కృష్ణమోహన్, సీనియర్‌ జనరల్‌ సర్జన్, రెనోవా హాస్పిటల్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement