![Doctor Tips For Saliva Control in Children - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/15/kids.jpg.webp?itok=Wc4En7oQ)
పిల్లల్లో నోటి నుంచి చొల్లు కారడం చాలా సహజంగా కనిపించే లక్షణం. ఇలా చొల్లు/జొల్లు కారుతూ ఉన్న కండిషన్‌ను సైలోరియా అంటారు. ఇది 6 నుంచి 18 నెలల వరకు సాధారణంగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో అలా చొల్లు కారడాన్ని సాధారణంగానే పరిగణించవచ్చు. నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం కారుతుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు కారుతుంటే దాన్ని అబ్‌నార్మాలిటీగా పరిగణించాలి. కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన రుగ్మతలు ఉంటే ఈ లక్షణం కనిపిస్తుంటుంది. కారణం... వాళ్లలో నోట్లో స్రవించిన లాలాజలాన్ని తమంతట తామే మింగలేని పరిస్థితి ఉంటుంది.
చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేకపోవడానికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) కూడా చొల్లు/జొల్లు కారుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నపుడు జొల్లు కారవడం ఎక్కువవుతుంది. కాని ఇవన్నీ తాత్కాలికం.
పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు/జొల్లు కారడం సమస్య ఉన్నప్పుడు వాళ్లంతట వాళ్లే లాలాజల స్రావాన్ని మింగేలా అలవాటు చేయాలి. ఇలా లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా మింగడం అలవాటు చేయించవచ్చు. మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం టాక్సిమ్ అనే పదార్థాన్ని లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేయడం కూడా చేస్తున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి...
♦ మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్)
♦ తరచూ మింగడం అలవాటు చేయడం
♦ నోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ ఇలా చొల్లు/జొల్లు కారకుండా చేసేందుకు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment