విదేశీయులు మన భారతీయ సంప్రదాయాలను ఇష్టపడడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ ఇటలీకి చెందిన ఇలియానా సిటార్టి మన సంస్కృతి, కళలను ఇష్టపడడమే కాకుండా, వాటిని నేర్చుకుని మరెంతోమందికి నేర్పిస్తున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలపై ఎంతో మక్కువ పెంచుకున్న ఇలియానా 1979లో ఒడిషా రాష్ట్రం చేరుకుని అక్కడ ఒడిస్సీ, చౌ డ్యాన్స్‌లను నేర్చుకున్నారు.
నేర్చుకోవడమంటే ఏదో ఆషామాషీగా నేర్చుకోలేదు. ఇలియానా ఒడిస్సీని ఒడిసి పట్టారు. 1995 నుంచి ఆమె తాను నేర్చుకున్న నాట్యాన్నీ వివిధ వేదికలపై ప్రదర్శిస్తూ.. ఎంతోమంది ఔత్సాహికులకు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలియనా వివిధ వేదికలపై ఒడిస్సీ నృత్యాన్నీ ప్రదర్శించడం, ఎక్కువ మందికి నాట్యం నేర్పించడం ద్వారా 2006లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
క్లాసికల్ డ్యాన్స్‌లో పద్మశ్రీ అందుకున్న తొలి విదేశీయురాలిగా ఇలియానా గుర్తింపు పొందారు. 43వ జాతీయ చిత్ర పురస్కారాల్లో యుగాంత్ అనే బెంగాలీ సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును కూడా అందుకున్నారు. 1995లో ‘ఆర్ట్ విజన్’ అనే సంస్థను ఇలియానా భువనేశ్వర్ లో స్థాపించారు. దీని ద్వారా స్థానిక విద్యార్థులకు ఒడిస్సీ, ఛౌ డ్యాన్స్‌లలో శిక్షణనిస్తున్నారు. అంతేకాకుండా ఆర్ట్ విజన్ ద్వారా వివిధ భావనలను థీమ్‌గా తీసుకుని ఏళ్లుగా రకరకాల పేర్లతో డ్యాన్స్ పండుగలను నిర్వహిస్తున్నారు. వీటిలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ పెర్‌ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్’ వంటివి కూడా ఉన్నాయి. ఒడిషా వచ్చినప్పటి నుంచి తన గురువు అయిన పద్మ విభూషణ్∙కేలుచరణ మోహపాట్రా దగ్గర డ్యాన్స్‌ను నేర్చుకున్నారు. ‘సైకోఎనాలసిస్ అండ్ ఈస్ట్రన్ మైథాలజీ’లో పీహెచ్‌డీ చేశారు. శ్రీ హరి నాయక్ గురువు దగ్గర ఛౌ డ్యాన్స్ నేర్చుకున్నారు.
ఒరియా సంస్కృతి సంప్రదాయాలపై ఆమె పరిశోధనలతోపాటు, అనేక ఆర్టికల్స్ రాసి ప్రచురించారు. అంతేకాకుండా లెక్చర్ డిమాన్‌స్ట్రేషన్‌తో ఒరియా సంప్రదాయాల ప్రాముఖ్యతను చాటిచెబుతున్నారు. ఒడిస్సీ, ఛౌ డ్యాన్సలపై అనేక వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఈ రెండింటి ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తున్నారు. ఇలియానా ఇండియాలోనేగాక ఇటలీ, అర్జెంటినా, పోలండ్, ఫ్రాన్స్, జర్మనీ, హోలాండ్, డెన్మార్క్, మలేసియా, హాంగ్‌కాంగ్, జపాన్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, ఇజ్రాయేల్, స్పెయిన్, దక్షిణ కొరియా, కెనడా, పెరు వంటి దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. మన దేశంలోనే గాక వివిధ దేశాల్లో ఒడిస్సీ ప్రదర్శిస్తూ అనేక అవార్డులు పొందారు. మన దేశ సాంప్రదాయాలను వదిలేస్తున్న ఈతరానికి ఇలియానా ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment