పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ శరన్నవరాత్రులు కోలహలం ప్రారంభమయ్యింది. రోజుకో అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు శరన్నవరాత్రి రెండో రోజు గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. వేదాలకు అధిదేవత అయిన గాయత్రి మాత ఆరాధనతో సమస్త విద్యలు ఒంటబడతాయనేది భక్తుల నమ్మకం.
ఈ రోజు అమ్మవారు ఆయా ప్రాంతాల వారిగా పసుపు లేదా కనకాంబరం లేదా నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.
సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం..
"ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్నమకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వాహంతీం భజే"
శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో రెండో రోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలవడం జరిగిందనేది పురాణ కథనం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు.
'ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః’
ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరిక సిద్ధిస్తుందని నమ్మకం.
నైవేద్యం: అల్లం గారెలు, పులిహోర
(చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!)
Comments
Please login to add a commentAdd a comment