ఆరోగ్యంపై స్పృహ పెరిగాక ఆహారంపైనా అదే స్థాయిలో జాగ్రత్త మొదలైంది. ఫలితంగా ఏ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి? ఏ పానీయంలో ఎంత సుగర్ శాతం ఉంది? లాంటి తదితర వాటినీ గమనించడం మొదలైంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వివిధ ఆహార ఉత్పత్తుల, పానీయాల సంస్థలు రంగంలోకి దిగాయి. కూల్‌డ్రింక్స్ స్థానంలో ఎనర్జీ డ్రింకులు, డైట్ డ్రింక్‌లు మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. కూల్ డ్రింక్స్‌తో ఉండే నష్టాలు వీటితో ఉండవనే వాదనలు బయలుదేరాయి. వీటితో తక్షణ శక్తి వస్తుందని, బరువు తగ్గుతారని, డయాబెటిక్ పేషెంట్లు నిర్భయంగా తాగవచ్చని.. అనేక పుకార్లు వీటి చుట్టూ హల్‌చల్ చేస్తున్నాయి. అసలు నిజంగా ఈ పానీయాలు మేలు చేస్తాయా? వీటితో నిజంగానే ఏ సమస్యలు ఉండవా? చూద్దాం.
1950 నుంచే...
నిజానికి డైట్ డ్రింక్స్‌కు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోన్నప్పటికీ వాస్తవానికి వీటి ఉనికి 1950 నుంచే ఉంది. అప్పట్లో వీటిని మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఇవి బరువు తగ్గడం కోసం, చక్కెర శాతం తక్కువ తీసుకోవాలనుకునేవారి కోసం రూపొందించినట్లు ప్రచారంలోకి వచ్చింది. డైట్ డ్రింక్స్‌ను కార్బొనేటేడ్ వాటర్, స్వీట్నర్ (కృత్రిమ తీపి పదార్థం), రంగులు, ఫ్లేవర్స్ తదితర వాటిని ఉపయోగించి చేస్తారు. డైట్ డ్రింక్స్‌లో కేలరీలు ఉండవు. 354 ఎంఎల్ డైట్ సోడా క్యాన్(డబ్బా)లో కేలరీలు, చక్కెర, ప్రొటీన్ శాతం జీరో. 40 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే ఉంటుంది.
అయితే, కృత్రిమ తీపిపదార్థంతో చేసే అన్ని డైట్ డ్రింక్‌లూ కేలరీలు లేనివి, సుగర్ ఫ్రీ అయినవీ కాదు. కొన్నింటిలో కొంచెం చక్కెర, మరికొంత స్వీట్నర్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు కృత్రిమ తీపిపదార్థం స్టివియాతో తయారుచేసే ‘కోకా కోలా లైఫ్’ డైట్ సోడాలో 24 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. అంటే బ్రాండ్‌ను బట్టి డైట్ డ్రింక్స్‌లోనూ తేడాలుంటాయి. అయితే, అన్నింటిలోనూ సర్వసాధారణంగా ఉండేవి మాత్రం కార్బొనేటెడ్ నీరు, స్వీట్నర్స్, యాసిడ్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, విటమిన్స్, మినరల్స్, కెఫైన్.
బరువు తగ్గడం నిజమేనా?
డైట్ డ్రింక్స్‌లో కేలరీల శాతం సున్నా అని చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం సహజంగానే ఇది బరువు తగ్గడంలో తోడ్పడుతుందని ప్రచారంలోకి వచ్చింది. అయితే, దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. డైట్ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, ఊబకాయం ముప్పు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డైట్ డ్రింక్‌లోని స్వీట్నర్ ప్రభావం వల్ల మెదడులోని డోపమైన్ స్పందనలు మారడం, అలాగే ఆకలి హార్మోన్ల సంఖ్య వృద్ధి చెందడం దీనికి కారణమంటు న్నాయి. ముఖ్యంగా కేలరీలు లేని డైట్ డ్రింక్స్ తాగడం వల్ల అధిక స్థాయిలో తీపి, కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంపై ధ్యాస ఎక్కువవుతుందని, ఆ ప్రకారం ఇది బరువు పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుందని వివరిస్తున్నాయి.
మరొక అధ్యయనం ఏం చెబుతోందంటే సాధారణంగా మద్యం విపరీతంగా సేవించే వారు, చెడు అలవాట్లు ఉన్నవారు ఎక్కువగా డైట్ సోడాలను తాగుతుంటారు. ఆ కారణంగానే డైట్ సోడాకు, బరువు పెరగడానికి మధ్య పరస్పర సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటోంది. అయితే, ఇవన్నీ పరిశీలనాత్మక అధ్యయనాలే. ప్రయోగాత్మకం కాదు. వాస్తవానికి సాధారణ డ్రింక్స్‌తో పోలిస్తే డైట్ సోడాల వల్ల బరువు తగ్గినట్లు కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ, ఈ పరిశోధనలను డైట్ డ్రింక్స్ తయారీ కంపెనీలు ప్రభావితం చేస్తున్నాయనేది ఆరోపణ
మధుమేహం, హృద్రోగాలకు అవకాశం?
డైట్ డ్రింక్స్‌లో కేలరీలు, షుగర్, ఫ్యాట్ లేనప్పటికీ దీన్ని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, హృద్రోగాలు వస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం ఒక డైట్ సోడా తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు 8 నుంచి 13శాతం మేర అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే రోజూ కనీసం ఒక బాటిల్ డైట్ డ్రింక్ తాగే 64,850 మంది మహిళల్లో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం ఉన్నట్లు మరొక పరిశోధన చెప్పింది. అయితే, సాధారణ డ్రింక్స్‌తో పోలిస్తే ఈ ప్రమాదం సగమే కావడం గమనార్హం. తాజాగా వెల్లడైన మరొక అధ్యయనం డైట్ డ్రింక్స్‌కు మధుమేహానికి సంబంధం లేదంటోంది.
ఇక డైట్ డ్రింక్స్‌పై ఉన్న మరో ప్రచారం.. ఇవి బీపీ పెరగడానికి, హృద్రోగాలకు కారణం. రోజూ డైట్ డ్రింక్స్ తాగే వారిలో హైబీపీ రావడానికి 9శాతం అవకాశం ఉన్నట్లు కొన్ని పరిశోధనలు తేల్చాయి. దీనికి తోడు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని మరొక పరిశోధన పేర్కొంది. అయితే ముందు చెప్పుకున్నట్లు ఇవన్నీ పరిశీలనాత్మక అధ్యయనాలే. నిజానికి డైట్ సోడా తాగడానికి బీపీ పెరగడానికి, గుండెపోటుకు మధ్య సంబంధం ప్రయోగాత్మకంగా కనుగొనలేదు.
అలా ఆరంభం
బరువు పెరిగితే సమస్యలు పెరుగుతాయన్న స్పృహ పెరిగాక ‘డైట్’ సంబంధ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తాయి. వీటిలో డైట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారని, మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలని.. ఇలా రకరకాల వాదనలు బయలుదేరాయి. మరి ఇవన్నీ నిజమేనా? కొంతవరకే అంటున్నారు నిపుణులు. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల సాధారణ సాఫ్ట్ డ్రింక్స్ (శీతల పానీయాలు)కు మరో రూపమే ఈ డైట్ డ్రింక్స్. వీటినే అమెరికాలో డైట్ సోడాలుగానూ వ్యవహరిస్తారు.
సాఫ్ట్ డ్రింక్స్ (కోక్, పెప్సి..)ల తయారీలో కొద్ది మేర చక్కెర వాడతారు. అయితే, దీనికి బదులు కృత్రిమ తీపి పదార్థాలైన ఆస్పర్టమ్, సిక్లమేట్స్, శాచరిన్, ఎసెసుల్ఫేమ్‌కె, సుక్రలోజ్ వంటి వాటిని ఉపయోగించే తయారు చేసేవే డైట్ డ్రింక్స్. ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమయ్యే డైట్ కోక్, కోక్ జీరో, పెప్సి మాక్స్, స్పైట్ జీరో వంటివి ఇలాంటివే. కొన్నింటిపై ‘డైట్’కు బదులు ‘లైట్’ అని కూడా ఉంటుంది.
ఊపిరితిత్తుల సమస్యలు కూడా..
దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి డైట్ డ్రింక్స్‌కు మధ్య సంబంధం ఉందని మరో వాదన ప్రచారంలో ఉంది. ఇది నిజమో కాదో తేల్చేందుకు 15,368 మందిపై ఒక అధ్యయనం జరిగింది. వీరిలో సగం మంది రోజూ కనీసం ఒక గ్లాస్ డైట్ డ్రింక్ తాగేవారు కాగా, మిగిలిన వారు వారానికి ఒకసారి ఒక డైట్ డ్రింక్స్ తాగేవాళ్లు. ఇందులో వారానికి ఒకసారి తాగేవారితో పోలిస్తే రోజూ తాగేవారికి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం రెట్టింపు ఉన్నట్లు తేలింది. డైట్ డ్రింక్స్‌లో అధిక స్థాయిలో ఉన్న భాస్పరం.. మూత్రపిండాల్లో ఆమ్ల శాతం పెరిగేందుకు తోడ్పడుతోందని, ఫలితంగా కిడ్నీపై దుష్ప్రభావం చూపుతోందని కనుగొన్నారు. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికీ ఇదే కారణమంటున్నారు.
మరికొన్ని దుష్ప్రభావాలు..
- గర్భిణులు డైట్ డ్రింక్స్ తీసుకోవడం కొన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ముందస్తు ప్రసవం, శిశువుల్లో ఊబకాయం ఇందులో ప్రధానమైనవని చెబుతున్నారు.
- డైట్ డ్రింక్స్ తీసుకోవడం వలన కాలేయం చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
- డైట్ డ్రింక్స్‌తో కేన్సర్ వచ్చే అవకాశం ఉందనడానికి ఆధారాలు లేవని మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
- డైట్ డ్రింక్స్‌లోని మలిక్, క్రిటిక్, పాస్పరిక్ ఆమ్లాల కారణంగా దంత సమస్యలు వస్తున్నట్లు కొన్నింటిలో తేలింది.
- రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డైట్ డ్రింక్స్ తాగేవారు ఒత్తిడికి గురవుతున్నట్లు మరికొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
- ఆరోగ్యంపై డైట్ డ్రింక్స్ ప్రభావం గురించి వెలువడిన చాలా అధ్యయనాలు పరస్పరం విభిన్నంగా ఉన్నాయి. కారణం.. ఇవన్నీ కేవలం పరిశీలనాత్మకమైనవే. ప్రయోగాత్మకమైనవి కావు. అందువల్ల డైట్ డ్రింక్స్ కచ్చితమైన దుష్ప్రభావాలు తెలియాలంటే సరైన ప్రయోగాత్మక పరిశోధనలు అవసరం. వీటిని బట్టి చివరగా గ్రహించాల్సింది ఏంటంటే రెగ్యులర్ సాఫ్ట్ డ్రింక్స్ కంటే డైట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలేమీ ఉండవు. దీనికి బదులు పాలు, కాఫీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, పండ్ల రసాలు తీసుకోవడం అత్యుత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment