ఉచ్చారణ దోషాలు, పర భాషా పదాల డాంబికాల నేటి పాటల నడుమ ఒక అచ్చ తెలుగు పాట పుట్టిన రోజు జరుపుకోనుంది. తెలుగు నుడికి, వెలుగు జడికి ఆలవాలంగా నిలిచిన సుశీల గళం తన 86వ పుట్టినరోజు కేక్ కట్ చేయనుంది. రేపు దీపావళి సందర్భంగా... పండుగ సందర్భాలను, ఆధ్యాత్మిక భావాలను గాన సంబరంతో నింపిన సుశీల గీతాల ప్రత్యేకం ఇది.
‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’ అని రేడియోలో పాట వస్తుంది ప్రతి దీపావళికి– సుశీల గొంతును మోసుకుని. తెలుగువారికి పండగ అంటే పెద్దలు, పిల్లలు, పిండి వంటలు మాత్రమే కాదు.. పాటలు కూడా. పి.సుశీల కూడా. ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని సుశీల పాట వినిపించకుండా దీపావళి రాదు. పోదు.
తెలుగు నేపథ్య సంగీతంలో ఒక స్త్రీ గళం దీపంలా వెలిగింది. అది సుశీలది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్‌డమ్‌లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్‌డమ్‌లోకి వచ్చారు. స్టార్‌డమ్ సమయానికి సరిగ్గా ఇద్దరికీ 20 ఏళ్లు. లతా తన పాటలతో దేశానికి వెలుతురూ ఇస్తే సుశీల గాత్ర ధారలతో దక్షిణ భారతదేశంలో ప్రమిదల వరుస పేర్చారు. సినీ సంగీతం వినోదానికే కావచ్చు. కాని సినీ సంగీతంలో ఉన్న అన్ని గొంతులూ అన్ని భావాలకూ సరిపోవు. సుశీలమ్మ గీతం ప్రభాతం అయ్యింది. పూజగదిలో ధూపం అయ్యింది. వెలుతురు అయ్యింది. గుడి గంటలా మోగింది. ఆమె తన గొంతుతో పవిత్ర భావన తెచ్చారు. పండగ వేళ తెలుగు పాట వినాలంటే తెలుగు వారు తెరవాల్సిన సందుక సుశీలదే.
‘పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా’ అని ఆమె పాడితే తెలుగు స్త్రీలు దేవుణ్ణి నోచడానికి ఆ పాటనే సాధనం చేసుకున్నారు. ‘నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై’ అని సుశీల భక్తితో భంగపడితే మా మనసులోని భావనా ఇదే స్వామి అని ఎందరో భక్తులు దేవుని పటాల ముందు దండం పెట్టుకున్నారు. దేవునికి సమర్పించడానికి శ్రీపారిజాతమైనా ఒకటే సుశీల పాటైనా ఒకటే కొందరికి.
ఇవి మాత్రమే కాదు నారాయణుని దాసులు ఆమె స్తోత్రించిన ‘నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం’ (భక్త ప్రహ్లాద)లో ఎన్నోసార్లు మునిగి తేలారు. పార్వతి దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆమె పాడిన ‘జననీ శివకామిని’ (నర్తనశాల) మదిలో మననం చేసకున్నారు. శ్రీ వేంకటేశ్వరుని కోసం ఆమె ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము’ (కలియుగ దైవం) పాడి అన్నమయ్య పదానికి అనల్ప తాదాత్య ్మం తెచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మహిళల కోసం సుశీల పాడిన ‘శ్రీసత్యనారాయణుని సేవకురాలమ్మా’ (గృహ ప్రవేశం) ఇంటింటి గీతమే అయ్యింది. ఇక సాయిబాబాను అర్చిస్తూ సుశీల పాడిన ‘దైవం మానవ రూపంలో’ (శ్రీ షిర్డీ సాయిబాబా మహత్య ్మం) సాయిభక్తులకు దివ్యకానుక.
సినిమా రంగంలో నిలిచి దాదాపు యాభై ఏళ్లు సుశీల పాడటానికి కారణం ఆమె గళమే కాదు అది ప్రకటించిన భావం కూడా కారణం. తెలుగు భాషకు ఆమె తన పాట ద్వారా పరోక్ష సేవ చేశారు. తెలుగు భాష సౌందర్యం, ఉచ్చారణ ద్వారా వచ్చే సొగసు సుశీల పాటలో చూస్తాం. తెలుగువారు తమ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, తమ పర్వదినాలను కాంతిమంతం చేసుకోవాలనుకున్నప్పుడు అది సుశీల పాట ప్రమేయం లేకుండా అసంపూర్ణం అయిపోతుంది.
సుశీలను తెలుగువారితో పాటు తమిళులు తమ ఆధ్యాత్మిక గళంగా తలుస్తారు. కన్నడిగులు ఆమె పాడిన భక్తి గీతాలకు చెవి వొగ్గుతారు. ఇంకా చెప్పాలంటే మలయాళీలు తమ గొప్ప డివోషనల్ గీతాల్లో సుశీలమ్మవి కూడా ఎంచుతారు.
సుశీల దాదాపు 19 వేల పాటలను రికార్డుల్లో చూపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు. ఆమెతోపాటు పాడిన గాయకులు, గాయనీమణులు ఆమెకు శక్తినిచ్చారు. ఆమె నుంచి శక్తిని పొందారు.
సుశీల, బాలూతో కలిసి పాడిన ఒక పాటను ఈ కరోనా చీకటి సమయాలలో దీపావళి దీపం లా తలుచుకోవాలి. ఆ పాట ‘గోరంత దీపం’లో ఉంది. ‘గోరంత దీపం కొండంత వెలుగు .. చిగురంత ఆశ బతుకంత వెలుగు’
ఈ దీపావళి ఎలా ఉన్నా నిజమైన పర్వదినం కరోనా వెళ్లాకే. అది నిర్మూలింపబడ్డాకే. ఆ రోజు వస్తుందన్న ఆశ కోసం సుశీల పాడిన పాటలు వినొచ్చు. ఆమె గానం చూపిన ఆధ్యాత్మిక దారిలో శక్తిని పుంజుకోవచ్చు. ఆమె అన్ని గీతాల నుంచి నిస్పృహను వదలగొట్టుకోవచ్చు. ఉత్సాహాన్ని నింపుకోవచ్చు.
సుశీల గీతం సదా వెలుగుగాక.
సుశీలమ్మ గొంతు ఏ దేవునికి చేరలేదని? ఏ కోవెలను తాకలేదని? ముఖ్యంగా ఆమె పాడిన రాముడి పాటలు అనేకం. రామనామాన్ని పానకం వలే స్వీకరించేవారు ఆమె పాడిన ‘శ్రీరామనామాలు బహుతీపి’ (మీనా) ఎన్నిసార్లు విని వుంటారు. ‘మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు’ (పంతులమ్మ) సుశీల స్పష్టభక్తిని ప్రతి మాటలో చాటుతుంది. ప్రయివేట్ ఆల్బమ్ కోసం ఆమె పాడిన ‘రామచంద్రుడితడు రఘువీరుడు’, ‘రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా’ పాటలు పల్లె పల్లెన ఉన్న రాముని కోవెలల్లో ప్రభాత గీతాలే కదా. ఇక ఆమె రామాయణం మొత్తాన్ని ఒక సులభ పాటగా చేసిన ‘వినుడు వినుడు రామాయణ గాధ’, ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’ (లవకుశ) మనసారా వినని వారు లేరు.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment