ఎం.నంజప్పనూర్ గ్రామానికి వచ్చి సంగవిని అభినందిస్తున్న తమిళనాడు మంత్రి సెల్వరాజ్
దేశంలోని చాలా అట్టడుగు వర్గాల గిరిజనుల నుంచి ఆడపిల్లలు ‘నీట్’ రాసి క్వాలిఫై కావడం గురించి విన్నామా? కాని తమిళనాడులో సంగవి చరిత్ర సృష్టించింది. కేవలం 10 వేల మంది ఉండే గిరిజన తెగ ‘మలసార్’ నుంచి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకుంది. ఆమె రేపో మాపో డాక్టర్ కోర్సులో చేరనుంది. అది ఒక్కటే కాదు... ఆమె తన ‘ఎస్.టి సర్టిఫికెట్’ కోసం ప్రభుత్వం కదిలే స్థాయిలో పోరాడింది. ఆమె చదువు గురించిన పట్టుదల ఇప్పుడు మొత్తం ఆ తెగకు మేలు చేసేలా కదలిక తీసుకువచ్చింది.
ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారుగాని మన దేశంలో నేటికీ అలాంటి చీకటి ఖండాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకు ఆనుకునే ఉన్న ఎం.నంజప్పనూర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వానికి తెలియదు. నగర వాసులకూ తెలియదు. ఎందుకంటే అక్కడ తరాలుగా జీవిస్తున్నది మలసార్ అనే తెగకు చెందిన గిరిజనులు కాబట్టి. కేరళ, తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ తెగ మొత్తం కలిపి 10 వేల మంది ఉండరు. వీళ్లది లిపి లేని భాష. నాలుగు ఆకులు, ప్లాస్టిక్ పట్టలు కట్టి పైకప్పుగా వేసుకుని జీవించే వీరి గురించి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆ తెగలో ఇంటర్ పాసైన సంగవి అనే అమ్మాయి. ‘నీట్ – 2021’లో ఆ అమ్మాయి 202 మార్కులు సంపాదించింది. ఎస్.టి కేటగిరిలో అర్హత మార్కులు 108– 121 కాగా వాటిని దాటి 202 మార్కులు తెచ్చుకోవడం విశేషమే. ఇలా మలసార్ తెగ నుంచి ఈ ఎగ్జామ్ రాసి ఈ స్థాయిలో క్వాలిఫై అయిన మొదటి అమ్మాయి సంగవే. అందుకే ఇప్పుడు తమిళనాడు గిరిజన శాఖ మంత్రితో మొదలు అధికారులు ఆమెను కలిసి అభినందిస్తున్నారు.
సర్టిఫికెట్ కోసం పోరాటం
ఇప్పుడు ఓ.టి.టిలో ప్లే అవుతున్న ‘జైభీమ్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో పాములు పట్టుకుని బతికే గిరిజన తెగ వాసులు తమకు ఎస్.టి సర్టిఫికెట్ ఇమ్మని, చదువుకుంటామని అధికారి దగ్గరకు వస్తారు. దానికి అధికారి ‘మీరు ఎక్కడ ఉంటారు.. మీ అమ్మా నాన్నలకు అలాంటి సర్టిఫికెట్ ఉందా... మీ కులం పేరుతో మీకు పట్టాలు ఉన్నాయా.. రేషన్ కార్డులు ఉన్నాయా.. అవి లేకుండా కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వము’ అంటాడు. ఇప్పుడు సంగవి గురించి అధికారులు అదే అన్నారు. టెన్త్ వరకూ ఏ కుల సర్టిఫికెట్ లేకుండానే చదువుకున్న సంగవి ఇంటర్ కూడా అలాగే చదివి 2018లో నీట్ రాసి క్వాలిఫై కాలేదు. దాంతో పాలిటెక్నిక్‌లో చేరింది. ఎస్‌టి కోటాలో సీట్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రోజులు టైమ్ ఇచ్చారు సంగవికి. 10 రోజుల్లో ఆ సర్టిఫికెట్‌ను ఇవ్వడానికి అధికారులు అంగీకరించకపోవడంతో సంగవి చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు సంవత్సరం పాటు సంగవి తన కేస్ట్ సర్టిఫికెట్ కోసం పోరాటం చేసింది. చివరకు 2020 కరోనా సమయంలో కొందరు ఎన్‌జివో కార్యకర్తలు వారి బస్తీకి వెళ్లినప్పుడు సంగవి గురించి విని ఆమె పోరాటాన్ని పత్రికలకు తెలియచేశారు. దాంతో ఏకంగా మంత్రే ఆమెను కలిసి సర్టిఫికెట్ అందజేశాడు. ఆ తర్వాత ఆమెకు నీట్ రాయాలని ఉందని తెలుసుకున్న ఆ ఎన్‌జివో కార్యకర్తలు కోచింగ్ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ మార్కులు.
తండ్రి కోరిక
మలసార్ తెగలో తరతరాలుగా ఎవరూ చదువుకోలేదు. పది వరకు చదవడం గొప్ప. కాని సంగవి తండ్రి మునియప్ప ‘నువ్వు డాక్టర్‌వి కావాలమ్మా’ అని అనేవాడు. సంగవి ఇంటర్ చదువు ముగిశాక గత సంవత్సరం అతడు మరణించాడు. తల్లి వసంతమణికి చూపు సరిగా కనిపించదు. వాళ్లు ఉంటున్న ఇల్లు వానకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి ఇంట్లో ఉంటూ తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని పంతం పట్టింది సంగవి. ‘నా కోరిక విని నన్ను కోచింగ్‌లో చేర్చారు ఎన్‌జివో వాళ్లు. కోచింగ్ సెంటర్ వాళ్లు మెటీరియల్ ఇస్తే నేను దానిని ప్లాస్టిక్ కవర్లలో దాచి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాన పడితే నా పుస్తకాలు తడిచిపోవడం ఆనవాయితీ’ అంది సంగవి. ఎస్‌టి సర్టిఫికెట్ కోసం సంగవి చేసిన పోరాటం వల్ల తమిళనాడులోని సంచార గిరిజనులకు ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికెట్‌లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు సంగవికి మార్కులు రావడం వల్ల వారి పేటను సందర్శిస్తున్న అధికారులు ఆ పేటకు ఇళ్ల పట్టాలు ఇస్తామని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వెళుతున్నారు.
తీరని కష్టాలు
నీట్‌లో సంగవికి వచ్చిన మార్కులకు ఎస్.టి కోటా వల్ల కాని తమిళనాడు ప్రభుత్వం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్‌ల వల్లగాని తప్పక సీట్ వస్తుందని భావిస్తున్నారు. ‘అయితే ఆ చదువు నేను చదవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. స్టాలిన్ సార్ నన్ను ఆదుకుంటారని భావిస్తున్నా’ అని సంగవి అంది. చదువు ఇంకా అందని వర్గాలు చదువే గెలుపు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం గ్రహించారు. వారి చదువే వారిని గెలిపిస్తుంది. అలాంటి చదువు వల్లే అట్టడుగు వర్గాలు తప్పక వికాసంలోకి వస్తాయి. ‘మావాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి చదువుకోవాలనుకుంటున్నారు’ అంటున్న సంగవి మాట ఆ ఆశనే కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment