![Get Relief From Neck Pain Simple Tips To Follow - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/28/Neck-Pain.jpg.webp?itok=rjSun86f)
ప్రతీకాత్మక చిత్రం
చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ అంటారు. ఇలా మెడ పట్టేసినప్పుడు మళ్లీ అది నిద్రలోనే సర్దుకుంటుందనీ లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడ పట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి...
- ఒక మెత్తటి టర్కీ టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా రోల్ చేసుకుని మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా వాడాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి.
- తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది.
- వ్యాయామాలు చేస్తుండేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయకూడదు. పైగా మెడ పట్టేయడం సర్దుకునేందుకు అంటూ ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది.
- కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు.
- కొందరు సెలూన్ షాప్‌లో మెడను రెండువైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇది మొరటు పద్ధతి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసరించకూడదు.
- నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమల్ లేదా ప్రమాదం లేని సాధారణ నొప్పి నివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యలో అప్పటికీ ఉపశమనం లేకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment