Neck Pain: సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ... అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ (పోష్చర్‌కు సంబంధించినవి), ఇబ్బందులూ కారణం. ఉదాహరణకు... వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు.
అలవాట్లు కాకుండా... ఇక ఆరోగ్య సమస్యల విషయాన్ని తీసుకుంటే... థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే దేహశ్రమ, ఒకే చోట కూర్చుని ఉండటం లాంటి విషయాలకు వస్తే... టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి.
పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు...
►స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ అతడి ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అతడి ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.
కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు.
►పోష్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.
►స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.
►గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది.
►తగినంత వ్యాయామం లేని టీనేజర్లు... తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.
►పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తగ్గి... వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి.
►ఇలాంటి సూచనలు పాటించాక కూడా మెడనొప్పి వస్తుంటే... థైరాయిడ్ లేదా ఇతరత్రా వైద్య సమస్యలను గుర్తించడానికి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించాలి. ఆ ఫలితాల ఆధారంగా సమస్యను సరిగా నిర్ధారణ చేసి, డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు.
-డాక్టర్ వెంకటరామ్ తేలపల్లి, సీనియర్ పీడియాట్రిక్ ఆర్థోపెడీషియన్
Comments
Please login to add a commentAdd a comment