పబ్స్ నుంచీ టూర్స్ దాకా చెట్టాపట్టాల్
జిమ్ వర్కవుట్స్‌కైనా, నైట్ పార్టీస్‌కైనా..
అం‘తరాలు’ తుంచుకుంటూ..ఆంతర్యాలు పంచుకుంటూ
ఫ్రెండ్లీ పేరెంటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత
నేడు ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే
డ్రెస్సింగ్ స్టైల్స్‌లో గానీ.. అదిరిపోయే స్టెప్స్‌లో గానీ మాకు మేమే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నారు.. డ్యాన్స్ ఫ్లోర్ మీద వారిద్దరినీ చూస్తే కళ్లు తిప్పుకోలేకపోయారు..‘హేయ్, నీకు తెలుసా? వాళ్లిద్దరూ మామ్ అండ్ సన్ అట’... అంటూ వింతగా చెప్పుకుంటున్నారు. నగరంలో ఇలాంటి నృత్యాలు నిత్య కృత్యాలుగా మారుతున్నాయి. అహాలను వదిలేస్తున్న తల్లిదండ్రులు, పిల్లలకు నమ్మలేనంత స్నేహాల్ని పంచుతున్నారు.
నేను తండ్రిని కాబట్టి నా మాట వినాలి.. నేను తల్లిని కాబట్టి నాకు విలువ ఇవ్వాలి.. అంటూ పిల్లల మీద అజమాయిషీ చేస్తే.. చెల్లుబాటయ్యే కాలం కాదిది. పిల్లలపై పెత్తనం చెలాయించాలని కాకుండా వాళ్లలో తమ పట్ల స్నేహమనే విత్తనం మొలకెత్తాలని తల్లిదండ్రులు తపిస్తున్నారు. దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.
స్నేహసిరి.. ఉభయకుశలోపరి..
‘మా అబ్బాయితో స్నేహం వల్ల నాకు వయసు రోజు రోజుకూ తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది’ అని చెప్పారు లోయర్ ట్యాంక్ బండ్ నివాసి అలీసాగర్. ఆరుపదుల వయసుకు చేరువలో అలీ సాగర్ (58).. తన వయసులో సగం కూడా లేని కుమారుడు అమ్మార్ (28)తో కలిసి దాదాపు అన్ని సరదాలూ పంచుకుంటారు. ‘పబ్స్‌కి వెళతాం, షటిల్ ఆడతాం, మూవీస్, వెబ్‌సిరీస్ చూస్తూ వాటి గురించి బోల్డ్‌గా చర్చించుకుంటాం..’ అంటూ చెప్పుకుంటూ పోయే అలీసాగర్ మాటల్ని ఆపొచ్చేమో గానీ.. ఆయన తన కుమారుడితో కలిసి చేసే బైక్ టూర్స్‌ను మాత్రం ఆపలేం. నగరం నుంచి బెంగుళూర్, ముంబయి.. తదితర నగరాలకు ఇద్దరూ కలిసి బైక్స్‌పై ఝామ్మని దూసుకుపోతుంటారు. హిందుస్తాన్ రాయల్ బుల్లెటీర్స్ క్లబ్ సభ్యులు కూడా. తరాలకు అతీతంగా వరి్థల్లుతున్న ఈ స్నేహం.. పెద్దవాళ్లకు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంటే.. యువతకు అవసరమైన పరిణితిని అందిస్తోంది.
సన్నిహితమైతేనే..హితం..
‘మా అబ్బాయి విధాన్‌కి నన్ను మించిన ఫ్రెండ్ ఎవరూ లేరు’ అంటూ సగర్వంగా చెబుతారు ఈస్ట్ మారేడ్‌పల్లి నివాసి సుశీలా బొకాడియా. పబ్స్‌లో కావచ్చు, పేజ్ త్రీ పారీ్టస్‌లో కావచ్చు.. ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. పిల్లల పట్ల స్నేహ హస్తం చాస్తున్న ఆధునిక తల్లిదండ్రుల వైఖరికి సుశీల అచ్చమైన నిదర్శనంగా నిలుస్తారు. ‘తన వ్యక్తిగత విషయాలు నాతో పంచుకునేటప్పుడు నన్ను క్లోజ్ ఫ్రెండ్‌లా భావిస్తాడు’ అని చెబుతారామె. ఖచి్చతంగా ఇలాంటి భావన తమ పిల్లల్లో స్థిరపడడానికే పేరెంట్స్ ఇలా తమను తాము మలచుకుంటున్నారని చెప్పొచ్చు.
నేర్పుగా..నేస్తంగా..
‘పిల్లలతో గ్యాప్ ఉండకూడదంటే స్నేహం చేయాలి. వీలైనంత వరకూ వారితో ఆటలు, పాటలతో సరదాగా గడుపుతా’ అంటున్నారు బంజారాహిల్స్‌లో నివసించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సుచిర్ ఇండియా అధినేత లయన్ డా.వై.కిరణ్. వ్యాపార వ్యవహారాలతో బిజీగా గడిపే ఆయన తన కుమార్తెలు రూపాలీ, దీప్‌శిఖలతో గడిపే సమయం మాత్రం అమూల్యం అంటారు. ‘పిల్లలకు ఏ రకమైన మంచి నేర్పాలన్నా నేస్తంగా మారడం ఒక్కటే మార్గం’ అని స్పష్టం చేస్తున్నారు. ఆయనలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తాము ఏదైనా నేర్పడానికి నేస్తాలుగా మారడాన్నే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment