Health Tips in Telugu: What Is Sound Bath, How It Helps - Sakshi
Sakshi News home page

Sound Bath- Health benefits: సౌండ్‌ బాత్‌.. ప్రయోజనాలెన్నో! ఒత్తిడి మాయం.. మూడ్స్‌ మారతాయి! అయితే..

Published Fri, Dec 23 2022 11:41 AM | Last Updated on Fri, Dec 23 2022 2:47 PM

Health Tips: What Is Sound Bath How It Helps Check Details - Sakshi

తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన సంగీతం విని, దాన్ని తగ్గించుకోవడం చాలామందికి అలవాటే. ఇందుకోసం కొందరు లలితమైన సంగీతం ఆలకిస్తుంటారు. మరికొందరు బీట్‌ బాగా ఉండే హుషారు, ఊపు పాటలను వింటారు. ఈ భిన్న ఆసక్తులు ఉన్నవారికి ఒకరి సంగీతం మరొకరికి అంత ఇంపుగా అనిపించదు. కేవలం ఇలా సంగీత మాధ్యమంలోనే కాకుండా... కొన్ని నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలలో వెలువడే శబ్దాలతో ఒత్తిడి తగ్గించే ప్రక్రియే సౌండ్‌బాత్‌.

ఇది కూడా ఒక ధ్యానం (మెడిటేషన్‌) లాంటి లేదా యోగాలాంటి ఫలితాలనిచ్చే ప్రక్రియ. కొన్ని రకాల శబ్దాలు ఓ క్రమపద్ధతిలో ఒకేలాంటి ఫ్రీక్వెన్సీ స్థాయుల్లో మంద్రంగా వెలువడుతూ... మన దేహాన్ని కండరాల ఒత్తిడి ఉన్నప్పుడు వాటిని రిలాక్స్‌ చేసేలా, మానసిక ఒత్తిడి నుంచి విముక్తం చేసేందుకు ఉపకరించే ఈ ప్రక్రియ ఒక యోగాలాంటిదని క్లివ్‌లాండ్‌ క్లినిక్‌లోని మేరిమైంట్‌ మెడికల్‌ సెంటర్, బ్రాడ్‌వ్యూ హైట్‌కు చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్య సహాయకురాలు కరేన్‌బాండ్‌ చెప్పారు.

ఇలా ఒత్తిడి మాయం
దీనికి ఆమె భారతీయ యోగా ప్రక్రియలో ఉచ్చరించే ‘ఓమ్‌’ శబ్దాలు, చైనా సంప్రదాయ వైద్యం (ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌–టీఎమ్‌సీ)లో ఉచ్చరించే ‘చి’ లాంటి శబ్దాలను (చైనీస్‌ అక్షరమైన దీని స్పెల్లింగ్‌ ఇంగ్లిష్‌లో ‘క్యూఐ’ కాగా దీన్ని (సీహెచ్‌ఐ గా ఉచ్చరిస్తారు) ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి శరీరంలోని శక్తిప్రవాహాన్ని ఏర్పరచడం, క్రమబద్ధ పద్ధతిలో ప్రవహింపజేయడం ద్వారా ఒత్తిడిని తొలగించేందుకు సహాయపడతాయని పేర్కొంటున్నారు.

అధ్యయనాల ఫలితంగానే
ఇదెలా జరుగుతుందనేది చెబుతూ ‘‘ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తన జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా లేకపోవడాన్ని కంప్లెయింట్‌గా చెబితే... వారిలో ఆ ప్రాంతాన్ని నయం చేసేలా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో శబ్దాలు వినిపించడం జరుగుతుంది’’ అని తెలిపారు. శబ్దాలతో కలిగే వైద్య ప్రయోజనాలపై 2014 నుంచి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయనీ, ఈ తరహా శబ్దచికిత్సలు చవకైనవి మాత్రమే గాక... సురక్షితమైనవని ఆమె తెలిపారు.

చిన్న చిన్న సమస్యల్లోనే కాకుండా దీర్ఘకాలిక వెన్నునొప్పులు, క్యాన్సర్‌తో బాధపడేవారిలో కలిగే నొప్పుల ఉపశమనానికి కూడా ఈ శబ్ద చికిత్సలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా ఈ తరహా పరిశీలనలు జరుగుతున్నప్పుడు నిదర్శనాలు, ఫలితాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకునే పరిశోధన జరుగుతోందని వెల్లడించారు.

అనేక నిదర్శనాలు, ఫలితాలను పరిశీలించినప్పుడు సౌండ్‌ బాత్‌ తర్వాత తమ క్లయింట్లను ప్రశ్నించినప్పుడు... కొందరు ఒత్తిడి తగ్గిందనీ, మరికొందరు తమ కండరాలు వదులుగా, రిలాక్స్‌డ్‌గా మారాయనీ, నొప్పి తగ్గిందనీ, నిద్ర బాగా పట్టిందని, మూడ్స్‌ మెరుగుపడ్డాయని, తమ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు తమకు బాగా తెలిసినట్లుగా అనుభూతి కలిగిందనీ వివరించినట్లు కరేన్‌ బాండ్‌ తెలిపారు.

సౌండ్‌ బాత్‌ కోసం ఏయే పరికరాలు ఉపయోగిస్తారంటే...?
►జేగంటలు (గాంగ్‌)
►జలతరంగిణిలో ఉపయోగించేలాంటి గిన్నెలు
►టిబెటన్‌ పాటల్లో ఉపయోగించేలాంటి గిన్నెలు
►ట్యూనింగ్‌ ఫోర్క్‌లు
►ఫెంగ్‌ షుయీ పద్ధతుల్లో ఇంట్లో వేలాడదీసినప్పుడు ఆహ్లాదకరంగా మోగుతుండే స్తూపాకారపు అలంకరణ వస్తువులు (చిమ్స్‌)
►కొన్ని చిరుమువ్వలు
►ఆహ్లాదకరమైన శబ్దాలను వెలువరించే చిరు గంటలను సౌండ్‌ బాతింగ్‌ కోసం ఉపయోగిస్తారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా..
దీని ఫలితాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. చాలా తక్కువమందిలోనే అయినా కొందరిలో సౌండ్‌బాత్‌ తర్వాత కొందరు కాస్త అలసట ఫీలవుతారు. దీనికి భిన్నంగా మరికొందరు బాగా శక్తిపుంజుకున్నట్లు అనుభూతి చెందుతారు.

అందుకే సౌండ్‌బాతింగ్‌ ప్రక్రియకు ముందు మంచి ఆహారం, తగినన్ని నీళ్లతో పాటు కంటినిండా నిద్ర అవసరమని సూచించారు. మానసిక (సైకియాట్రిక్‌) సమస్యలతో బాధపడేవారు సౌండ్‌ బాత్‌కు ముందు తమ డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

చదవండి: నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement