
ఈ ఎండలతో దేహానికి వడదెబ్బ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే మూత్రపిండాల (కిడ్నీల)కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’ (ఏకేఐ), మూత్రవ్యవస్థలో రాళ్లు ఏర్పడే‘యూరో లిథియాసిస్’, కొన్నిరకాల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ కారణంగా ఏర్పడే కిడ్నీ సమస్యలు ఇందులో కొన్ని. ఈ మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి వాటి గురించి తెలిపే కథనమిది.
ఏప్రిల్ నెల ఇంకా ముగియక ముందే... నమోదవుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైమాటే. దాంతో డీహైడ్రేషన్ వల్ల సమస్యలకు గురయ్యే కీలక అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి.
కిడ్నీపై దుష్ప్రభావాలిలా...
అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) : దేహంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడి, రక్తప్రవాహ వేగమూ మందగిస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలకు లాగే కిడ్నీకి అందే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో దేహంలో పేరుకు పోయే వ్యర్థాలను బయటకు పంపే వేగమూ తగ్గుతుంది. దాంతో కిడ్నీల పనితీరులో ఆకస్మికంగా మార్పులు వచ్చి, అస్తవ్యస్తంగా పని చేస్తాయి. ఈ కండిషన్ పేరే ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ’. దీని దశలు:
ఆలిగ్యూరిక్ ఫేజ్: ఈ దశలో యూరిన్ ఔట్‌పుట్ బాగా తగ్గి, కిడ్నీల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే సన్నటి నాళాలు దెబ్బతింటాయి.
డైయూరెటిక్ ఫేజ్: ఈ దశలో కిడ్నీ తనను తాను రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
రికవరీ ఫేజ్: ఒకవేళ తగినన్ని నీళ్లు, ద్రవాహారం అంది రీ–హైడ్రేషన్ జరిగితే...కిడ్నీల పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది.
ఏకేఐ లక్షణాలు...
► మూత్రం తక్కువగా రావడం.
► ఒంట్లో వాపు
► వికారం ∙తీవ్రమైన నిస్సత్తువ, అలసట
► శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండటం... సరిగా అందకపోవడం.
చికిత్స... ఇది పరిస్థితి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సెలైన్ పెట్టి, దేహానికి తగినంత రీహైడ్రేషన్ జరిగేలా చూడటం. ∙అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్స్ వాడటం. ∙కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయక దేహంలో బాగా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి డయాలసిస్ చేయాల్సి రావడం.
కిడ్నీలో రాళ్లు (యూరోలిథియాసిస్): మూత్ర వ్యవస్థలో లవణాల స్ఫటికాలతో రాళ్లు ఏర్పడటాన్ని ‘యూరోలిథియాసిస్’ అంటారు. దీన్నే వాడుక భాషలో మూత్రపిండాల్లో రాళ్లు రావడంగా చెబుతారు. తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే ఈ సమస్యలో రాళ్లు చిన్నగా ఉంటే మందులతో పాటు, తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం, రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉండే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను సూచిస్తారు. రాయి పరిమాణాన్ని బట్టి కొన్ని ప్రక్రియలతో చూర్ణమయ్యేలా చేసి, మూత్రంతో పాటు పోయేలా చూస్తారు. కుదరనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు.
మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు : వ్యర్థాలు బయటకు పోని సందర్భాల్లో... అవి దేహంలో పేరుకు పోయి, బ్యాక్టీరియా పెరిగిపోయి, మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బంది, నొప్పి, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు.
నివారణ కోసం...
►సాధ్యమైనంతవరకు నీడపట్టునే ఉండటం.
►తేలికపాటి రంగులతో కూడిన, గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, బ్రిమ్ హ్యాట్, స్కార్ఫ్ వంటివి వాడటం.
► తగినన్ని నీళ్లు తాగుతూ, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) అందేలా చూసుకోవడం.
►డాక్టర్ సూచన లేకుండా డై–యూరెటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడకపోవడం. ∙
Comments
Please login to add a commentAdd a comment