కొందరిలో కాళ్లమీద పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఈ పగుళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధారణంగా చాలామందిలో కాళ్ల పగుళ్లు చలికాలంలో వస్తుంటాయి. కానీ కొందరిలో మాత్రం వేసవిలోనూ కనిపిస్తుంటాయి.
►కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో దేహానికి తగినంత నీరు అందని సందర్భాల్లో కూడా కాళ్లలో పగుళ్లు రావచ్చు. మరికొందరిలో... వారు వాడే సబ్బు సరిపడకపోవడం, తరచూ సబ్బునీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. (బట్టలు ఉతికే మహిళల్లో డిటర్జెంట్ కలిసిన నీళ్లవల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది). ఇక ఆహారంలో పోషకాలు తగినన్ని అందని వారిలో కూడా ఈ సమస్య రావచ్చు.
►ఇక మరికొందరిలో డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి ఆరోగ్యసమస్యలు ఉన్న సందర్భాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఆ సమస్యలతో బాధపడుతున్నవారు తమకు ఏ కారణంగా కాళ్లపగుళ్లు వచ్చాయో నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యపరీక్షలు చేయించి, ముందుగా అసలు (అండర్‌లైయింగ్) సమస్యకు చికిత్స తీసుకోవాలి.
చదవండి: ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు
►ఇంకొందరిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. అలాంటివారిలో కాళ్ల పగుళ్లు బాగా లోతుగా ఉండి, వాటినుంచి రక్తస్రావం జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఆ దశకు చేరాక కూడా వాటికి తగిన చికిత్స తీసుకోకపోతే అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. ఇదేగానీ డయాబెటిస్ ఉన్నవారిలో జరిగితే సమస్య లు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది.
►కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా చాలామందిలో కనిపించే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు వీలైనంతగా మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. అలాగే ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి.
►మాయిశ్చరైజర్ ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని రాత్రంతా సాక్సులను ధరించి నిద్రించడం లాంటి చిన్న చిన్న ఉపశమన చికిత్సలతోనే చాలామందిలో ఇవి తగ్గిపోతాయి. అలా తగ్గకపోతే అవి ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చినవిగా పరిగణించి, అసలు సమస్య నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.
చదవండి: Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment