వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి.
స్వీట్ కార్న్ లాలీపాప్స్
కావలసిన పదార్థాలు
చిల్లీ ఫ్లేక్
మిరియాల పొడి
జీలకర్ర
ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున
పచ్చిమిర్చి – 2
స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు
ఉప్పు – తగినంత
కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
బంగాళ దుంప తురుము – అర కప్పు
మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు
మైదా పిండి – 1 టీ స్పూన్
నీళ్లు – కొద్దిగా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్‌లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్.
చికెన్ బీట్‌రూట్ సమోసా
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి)
బీట్‌రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు
సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున
మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు
మిరియాల పొడి – 1 టీ స్పూన్
బీట్‌రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్‌రూట్ రసం కలుపుకోవాలి)
ఉప్పు – సరిపడా
నూనె – తగినంత
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్‌రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్‌రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది.
చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్..
Comments
Please login to add a commentAdd a comment