
చీప్ నెక్లెస్‌ని రూ. 6 కోట్లకు అమ్మేసిన వైనం దిగ్భ్రాంతి రేపింది
నకిలీ బంగారం పట్ల అప్రమత్తంగా ఉండాలి
రాజస్థాన్‌లోని జైపూర్‌లో నకిలీ ఆభరణాన్ని స్వచ్ఛమైన బంగారు నగగా నమ్మించి ఒక అమెరికన్ టూరిస్ట్ మహిళను ఏకంగా రూ. 6 కోట్లకు ముంచేసిన వైనం దిగ్భ్రాంతికి గురి చేసింది. రూ. 300 విలువైన బంగారు పూత పూసిన వెండి నెక్లెస్‌ను గోల్డ్ నెక్లెస్‌గా నమ్మించాడో నగల వ్యాపారి. తరువాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేదో, నకిలీ ఏదో ఎలా తెలుసుకోవాలి? కృత్రిమ బంగారు ఆభరణాలను ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం రండి!
అందం, స్టేటస్‌కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంగార ధర ఎపుడూ ఖరీదైందే కాబట్టి మోసాలకు చాలా అవకాశం ఉంది. అందులోనూ ఈ మధ్యకాలంలో నిజమైన బంగారంలా మురిపిస్తున్న ఇమిటేషన్ జ్యుయల్లరీకి ఆదరణబాగా పెరుగుతోంది. అందుకే అసలు బంగారాన్ని, నకిలీ బంగారానికి తేడాను గుర్తించడం చాలా కీలకం. ఆభరణాల నిపుణులు, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు బంగారం నిజమో కాదో సులువుగా గుర్తిస్తారు. నిజానికి కాస్త పరిశీలిస్తే అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని గుర్తించడం ఎవరికైనా పెద్ద కష్టమేమీకాదు.
మెరిసీ ప్రతీదీ బంగారం కాదు
పసుపు రంగులో కనిపించే ప్రతిదీ బంగారం కాదు. బంగారం పెద్దగా మెరవదు. నిజమైన బంగారం అందమైన మృదువైన పసుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు కలిసిన పసుపు రంగులో ఉన్నా, బాగా మెరుస్తున్నా అనుమానించాలి.
హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసే హాల్‌మార్క్ ధృవీకరణను తనిఖీ చేయడం.
బ్రాండ్: కొన్ని రకాల బ్రాండ్లు నాణ్యతకు మారుపేరుగా ఉంటాయి. అలాంటి బ్రాండ్స్‌కి చెందిన లోగో, పేరు, అక్షరాలను శ్రద్దగా గమనించాలి.
గోల్డ్ మాగ్నెట్ టెస్ట్: నకిలీ బంగారం లేదా బంగారు మిశ్రమాలు తక్షణమే అయస్కాంతానికి ఆకర్షితులవుతాయి. ఇది అంతర్లీన లోహం యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఇది బంగారంతో చేసినది కాదు లేదా దానిలో కొద్ది శాతం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన బంగారంలో అయస్కాంత మూలకాలు ఉండవు.
యాసిడ్ టెస్ట్ : వివిధ కెమికల్స్ యాసిడ్‌ని కూడా బంగారాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. బంగారు ఆభరణాల నైట్రిక్ టెస్ట్ చేయడానికి, బంగారంపై కొన్ని చుక్కల నైట్రిక్ యాసిడ్ వేయండి. ఆభరణాల రంగులో మార్పు రాకపోతే, అది బంగారం అని నమ్మవచ్చు.
మెటీరియల్‌ని, రాళ్లను బాగా పరిశీలించడం: ఆభరణాల్లో ఉపయోగించి మెటల్స్‌పై చాలా శ్రద్ధ వహించాలి. అలాగే ఆభరణంలోని రాళ్లను, స్ఫటికాలను నిశితంగా గమనించాలి. ఇమిటేషన్ జ్యుయల్లరీ బరువును గమనించాలి. ఫినిషింగ్ చెక్ చేయాలి, పేలవమైన ఫినిషింగ్ లేదా అంచులు గరుకుగా ఉన్నా అనుమానించాలి.
తక్కువ ధర అని మభ్య పెట్టినా: బంగారు ఆభరణాలను తక్కువ ధరకే ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా అనుమానించాలి. నిజా నిజాలను, నాణ్యత, బరువును నిర్ధారించుకోవాలి. తొందరపడి అస్సలు మోసపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment