1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.
రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం.
మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి.
పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.
కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు.
నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన.
పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి!
-రచయిత, ఫోటోలు : జానకి లెనిన్
-అనువాదం : చంద్ర శేఖర్ బండి
Comments
Please login to add a commentAdd a comment