బంగారాన్ని కొందరు ఆభరణంగా వినియోగిస్తే, ఇంకొందరు పెట్టుబడి సాధనంగా భావిస్తారు. దాంతో పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో కొంత బంగారం కొనుగోలు చేస్తూంటారు. అయితే రిటైల్ షాపుల్లో తీసుకునే బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? అయినా అంత పెద్దషాపు నిర్వహిస్తున్నవారు ఎందుకు మోసం చేస్తారని అనుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నడుపుతున్న షాపుల్లో ఈ మోసాలు తక్కువే. సరైన నిబంధనలు పాటించనివారు మాత్రం బంగారం స్వచ్ఛత విషయంలో వినియోగదారులను మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో బంగారం నాణ్యతను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.
బంగారం నాణ్యతను క్యారట్లలో కొలుస్తారు. బంగారం కొనేందుకు షాపులోకి వెళ్లిన వెంటనే నచ్చిన ఆభరణాలు ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు షాపు సిబ్బంది 24, 22, 18 క్యారట్ల బంగారం అని చెబుతూ తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 18 క్యారట్ నాణ్యత కలిగిన బంగారం చూపుతూ..అది 22 క్యారట్ గోల్డ్ అని చెబుతుంటారు. అది నమ్మి చివరకు 22 క్యారట్ బంగారం ధర చెల్లిస్తుంటారు. అయితే ఇలాంటి మోసాలు ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న బంగారు ఆభరణాలపై ముందుగా ప్రభుత్వ అధీనంలోని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సంస్థ హాల్‌మార్క్ ఉందో పరిశీలించాలి. దీంతోపాటు ఆభరణంపై కొన్ని నంబర్లు కూడా ఉంటాయి. వాటిని బట్టి అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.
24 క్యారట్ బంగారం: 999 అనే సంఖ్య ఉంటుంది.
22 క్యారట్: 916
18 క్యారట్: 750
14 క్యారట్: 583
10 క్యారట్: 417 అనే నంబర్ ఉంటుంది.
ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!
24 క్యారట్ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్ బంగారంలో 8.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు. 18 క్యారట్ బంగారంలో 25 శాతం ఇతర పదార్థాలతో కల్తీ చేస్తారు. 14 క్యారట్-41.7 శాతం, 10 క్యారట్-58.3 శాతం ఇతర పదార్థాలు కలుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment