
సీజన్ మారిన ప్రతిసారి ఏదో ఒక ఆరోగ్య సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇందుకు వింటర్ (చలికాలం) మినహాయింపు కాదు. వింటర్ చల్లదనాన్ని ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఎంజాయ్ చేయాలంటే వెల్లుల్లి (గార్లిక్)ని డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదట.
మన భారతీయ వంటకాలకు వెల్లుల్లితో విడదీయరాని బంధం ఉంది. దాదాపుగా వండే అన్ని కూరల్లో వెల్లుల్లి వాడుతుంటారు. అంతేగాక సంప్రదాయ సనాతన ఔషధాలలో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్‌గా వెల్లుల్లి వినియోగిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వెల్లుల్లి మన శరీరంలో ఉన్న ట్రై గ్లిసరైడ్స్‌ని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో వెల్లుల్లి పాత్ర అమోఘం. అయితే ఇన్ని సుగుణాలు ఉన్న వెల్లుల్లిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.
వింటర్‌లోనే ఎందుకు..
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు దీనిలో అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ బి6(పైరిడాక్సిన్) కూడా ఉంటాయి. సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా బాధించదు.
ఉదయాన్నే పరగడుపున (ఖాళీకడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. అంతేగాకుండా ధమనుల లో ఎటువంటి బ్లాకేజ్ లేకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. వెల్లుల్లిని ఉడికించినప్పుడు ఈ అల్లిసిన్ స్థాయులు తగ్గిపోతాయి. అందువల్ల పచ్చిది తింటే ఎంతో మంచిది. అయితే పచ్చి వెల్లుల్లి తినేటప్పుడు దానిని కొంచెం చితక్కొట్టి కాసేపు గడిచాక తింటే మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవాలి.
గార్లిక్ టీ..
అయితే పచ్చి వెల్లుల్లి తీసుకోవాలంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటి వారు వెల్లుల్లి టీ చేసుకుని తాగితే సరిపోతుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మరిగే నీటిలో వేయాలి. నీరు బాగా మరిగాక అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి. దీన్ని మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్‌లో పోసుకుని దానిలో ఒక టీ స్పూన్ తేనె, అరటీస్పూన్ నిమ్మరసం వేయాలి. దీనిని బాగా కలుపుకుని తాగితే గార్లిక్ టీ ఫ్లేవర్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
గార్లిక్ స్టీవ్..
వెల్లుల్లి ఏ కూరలో వేసినా దాని రుచి మరింత పెరుగుతుంది. ఈ కోవకు చెందినదే గార్లిక్ స్టీవ్. ఇది రుచితోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చికెన్‌తో చేసే ఈ రెసిపీలో చాలా పోషకాలు ఉంటాయి. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్‌ను తీసుకుని దానిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ప్రెషర్ కుక్కర్‌లో వేసి దానిలో ఒక టీస్పూన్ బటర్, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, నాలుగు మిరియాలు, ఒక టేబుల్‌స్పూన్ పార్సెల్లీ, ఒక అంగుళం ముక్క అల్లం పేస్టు చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద 3–4విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి. తరువాత కుకర్ మూత తీసి కాస్త కొత్తిమీర చల్లి వడ్డిస్తే హెల్తీ అండ్ టేస్టీ గార్లిక్ స్టీవ్ రెడీ అయినట్లే. ప్రోటీన్‌తో నిండిన చికెన్, వెల్లుల్లి సుగుణాలు కలగలిసి గార్లిక్ స్టీవ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్ని పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లిని రోజువారి ఆహారంలో తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా..! ఇంకెందుకాలస్యం? వీటిలో ఏదో ఒక దానిని మీ ఆహారంలో భాగం చేసుకోని ఆరోగ్యంగా జీవించండి.
Comments
Please login to add a commentAdd a comment