
దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరం అకాన్కాగువా (22,837 అడుగులు)ను అధిరోహించి మరో సారి చరిత్ర సృష్టించాడు హైదరాబాద నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడు పడకంటి విశ్వనాథ్ కార్తికే. ఇప్పటికే వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు, శిఖరాగ్రాలను చేరుకుని భారతీయ జెండాను సగర్వంగా ఎగురవేసిన విశ్వనాథ్ కార్తికే తన ఖాతాలో మరో ప్రపంచ ఎత్తైన పర్వతాన్ని చేర్చాడు.
నగరంలోని రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో 11వ తరగతి చదువుతున్న విశ్వనాథ్ కార్తికే, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు భరత్ తమ్మినేని, భారత సైనిక అధికారి లెఫ్టినెంట్ రోమిల్ బారాత్వల్ మార్గదర్శకత్వంలో నాలుగు సంవత్సరాలుగా ఎత్తైన పర్వతారోహణకు కఠిన శిక్షణ పొందుతున్నాడు.
ఈ ప్రయత్నంలో భాగంగానే బూట్స్– క్రాంపన్స్ బృందంతో పాటుగా అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి సురక్షితంగా బేస్ క్యాంప్‌కు తిరిగి చేరుకున్నాడు. 22,837 అడుగుల (6,961 మీటర్లు) ఎత్తులో ఉన్న అకాన్కాగువా పర్వతం ఆసియా వెలుపల ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. అక్కడి వాతావరణం విపత్కంగా ఉండటంతో పాటు అధిక గాలులు, విపరీతమైన చలి తన లక్ష్యానికి కఠిన సవాలుగా నిలిచిందని విశ్వనాథ్ తెలిపాడు. అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణిలోని ఈ శిఖరం భూతలానికి అత్యంత ఎత్తైన శిఖరం.
ఖండాంతరాలను దాటి..
మౌంట్ అకాన్కాగువానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలు.. డెనాలి (ఉత్తర అమెరికా), ఎల్బ్రస్ (యూరప్), కిలిమంజారో (ఆఫ్రికా), కోస్కియుస్కో (ఆ్రస్టేలియా), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), ఐస్‌లాండ్ పీక్ (నేపాల్), భారత్‌లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలతో పాటు డిజో జోంగో, ఫ్రెండ్‌షిప్ పీక్, కాలా పత్తర్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వంటి వాటిని ఇప్పటికే అధిరోహించి చరిత్ర సృష్టించాడు.
తన తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ పర్వతం (29,032 అడుగులు)అని, ఈ లక్ష్యాన్ని ఈ ఏడాది మేలో పూర్తిచేయడానికి సన్నద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. ఈ లక్ష్యాన్ని చేరుకుని యువ సాహాసికులకు విశ్వనాథ్ స్ఫూర్తిగా నిలవనున్నాడని శిక్షకులు భరత్ తమ్మినేని సంతోషం వ్యక్తం చేశారు.