ప్రతీకాత్మక చిత్రం
లైఫ్ స్టయిల్ ఆరోగ్య సమస్యలకు ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్ కూడా తోడయింది. మధ్య వయసు వచ్చిన తర్వాత బీపీ, డయాబెటిస్‌లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో ఇరవైలలోనే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. హైపో థైరాయిడిజమ్ అనేది అనారోగ్యం కాదు, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) దేహానికి తగినంతగా అందని స్థితి. అలాగే హైపర్ థైరాయిడిజమ్ అంటే ఆ హార్మోన్ అవసరానికి మించి అందడం అన్నమాట. హైపో థైరాయిడిజమ్ విషయానికి వస్తే... ఇది మగవాళ్లలో కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటోంది. ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణమే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి మందులతోపాటు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం.
హైపో థైరాయిడిజమ్ నుంచి బయటపడడానికి అయోడిన్ అనే ఖనిజం చాలా అవసరం. ఈ ఖనిజం సహజంగా అందే ఆహారం తినదగిన (పఫర్ ఫిష్ వంటి విషపూరితం కాని)అన్ని రకాల చేపలు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు. వీటిలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది. అలాగే సెలీనియం బ్రెజిల్ నట్స్ (డ్రై ఫ్రూట్స్ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి. రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. వెజ్ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి.
పండ్ల విషయానికి వస్తే... స్ట్రాబెర్రీ, పీచ్ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలి. ఇక ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చు. తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలి. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..)
వీటికి దూరం!
► మిల్లెట్స్, సోయా గింజలు, టోఫు వంటి సోయా పనీర్, ఇతర సోయా ఉత్పత్తులను, చిలగడ దుంపలను మానేయాలి. వేరుశనగ గింజలు, క్యాబేజ్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పాలకూర వంటివి బాగా తగ్గించాలి. అయోడిన్ లోపం లేని వాళ్లు కొన్ని రకాల మిల్లెట్స్‌ను తీసుకోవచ్చు. ఇది డాక్టర్ సలహా మేరకు పాటించాల్సిన జాగ్రత్త. ఇది దేహతత్వాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది. అలాగే పూర్తిగా మానేయాల్సిన జాబితాలో మర్చిపోకూడని మరికొన్ని... బేకరీ ఉత్పత్తులు.
లక్షణాలివి
ఎప్పుడూ అలసట, బరువు పెరగడం, ఎప్పుడూ జలుబు చేసినట్లు అసౌకర్యంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, మానసికంగా న్యూనతకు లోనుకావడం వంటి ప్రధానంగా కనిపించే లక్షణాలతోపాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment