- హైదరాబాద్‌లో 8.88 శాతం మందిలో థైరాయిడ్ సమస్య
- దేశంలో ఐదో స్థానం
- వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం
- ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ వెల్లడి
ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రకటించింది. కానీ వాహన, పారిశ్రామిక కాలుష్యం, హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడు హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సైతం థైరాయిడ్ కేసులు నమోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధపడుతుంటే, అత్యధిక బాధితులతో కోల్‌కతా తొలి స్థానంలో, హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ పెరిగిపోతున్నాయి. మధుమేహం, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో తాజాగా హైపోథైరాయిడిజం కేసులూ అధికమవుతున్నాయి. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉన్నారు. హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధారణయింది. వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియకపోవడం గమనార్హం.
కోల్‌కతా టాప్...
2012–2013లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చైన్నై, హైదరాబాద్‌ల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో థైరాయిడ్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలోనే అత్యధికంగా కోల్‌కతాలో 21.6, ఢిల్లీలో 11.07, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా... దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలజీ విభాగం వైద్యుడు రాకేష్‌సహాయ్ తెలిపారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని చెప్పారు.
ఏమిటీ థైరాయిడ్..!
థైరాయిడ్ రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వర్తించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజంకు కారణమవుతోంది. అకస్మాత్తుగా బరువు పెరిగితే హైపోథైరాయిడిజంకు సంకేతం. దీన్ని గుర్తించడం కష్టం.
వాహన, పారిశ్రామిక కాలుష్యం ప్రధాన కారణం...
శరీరంలో అయోడిన్ మూలకం లోపంవల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో దీని బారిన పడేవారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతున్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి... అందుకు విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం.
– డాక్టర్ శ్రీనగేష్, ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
వయసుల వారీగా థైరాయిడ్ బాధితుల వివరాలు (శాతాల్లో)...
18 నుంచి 35 ఏళ్లలోపు 7.53
36 నుంచి 45 ఏళ్లలోపు 12.22
46 నుంచి 54 ఏళ్లలోపు 13.11
55 ఏళ్లు పైబడిన వారిలో
11.62
