ఉనికిని గుర్తింపుగా మార్చుకోవాలని.. అభివృద్ధిలో తన మేధకూ శ్రమకూ చోటు దక్కాలని.. అవకాశాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలని.. నిర్ణయాలు తీసుకునే స్వాతంత్య్రం కావాలని.. కలలు కనే హక్కు అందరిదీ... అమ్మాయిలది కూడా! అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఇదే చెప్తోంది.
ఆడపిల్లల హక్కులను కాపాడేందుకు, స్వావలంబన దిశగా వాళ్లను నిలబెట్టేందుకు ఐక్యరాజ్యసమితి 2011, డిసెంబర్‌లో ఓ తీర్మానం చేసి, అక్టోబర్ పదకొండును అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించింది. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‌తో బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఆ థీమ్‌కు అనుగుణంగా బాలికల హక్కుల పరిరక్షణ, పురోగతి కోసం కృషిచేయాలని.
ఈ ఏడాది థీమ్.. మై వాయిస్, అవర్ ఈక్వల్ ఫ్యూచర్..
ఆడపిల్లల విషయంలో అటుఇటుగా లోకమంతా ‘వివక్ష’బాటనే అనుసరిస్తోంది. ఈ పందెంలో మూడో ప్రపంచ దేశాలు మరీ ముందున్నాయి. మన దేశం గురించి చెప్పక్కర్లేదు. మొన్నటికి మొన్న దేశాన్ని నెత్తుటితో తడిపేసిన కులదురహంకార హత్యలే పచ్చి ఉదాహరణలు. తెలంగాణలో ప్రణయ్ హత్యతో పట్టుకున్న వెన్నువణుకు హేమంత్ హత్య, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్, బలరాంపూర్, ఆజంగఢ్, బులంద్ షహర్ దారుణాలతో మెదడును చేరుకుంది. ఇవన్నీ ఎవరిని భయపెట్టడానికి? బలి తీసుకుంటున్నదెవరిని?
అమ్మాయిలనే కదా!
‘ఇప్పుడిప్పుడే అమ్మాయిలు గడప దాటి బయటకు వస్తున్నార్రా.. భయపెట్టి మళ్లీ వాళ్లను వంటింటికే పరిమితం చేయెద్దురా ప్లీజ్’ అని వేడుకుంటుంది ఆసిన్.. గజినీ సినిమాలో గర్ల్ ట్రాఫికర్స్‌తో. అది నిజమే అని తేలుతోంది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యయనాన్ని బట్టి. పదిహేనేళ్ల నుంచి పద్దెనిమిదేళ్లలోపు బాలికల్లో నలభై శాతం మంది స్కూలు, కాలేజీకి వెళ్లట్లేదట. దానికిగల అనేక కారణాల్లో బాలికల మీద పెరిగిన హింస, దాడులూ కారణాలుగా నమోదయ్యాయి. ఈ క్రమంలో భవిష్యత్ మీద మగపిల్లలకెంత హక్కుందో మాకూ అంతే ఉండాలని ఎంత గొంత్తెతితే మాత్రం? అలాగని నిరుత్సాహపరచడానికో.. ఇలాంటి దినోత్సవాలను చిన్నబుచ్చడానికో కాదు ఈ వ్యాసం. పంచభూతాల మీద జీవరాశులన్నిటి హక్కు ఎంత సహజమైందో పుట్టడం, పుట్టాక అబ్బాయిలతో సమంగా పెరగడమూ ఆడపిల్లలకున్న అంతే సహజమైన హక్కు. మగ, ఆడ.. ఒకరి వెనుక ఒకరు కాదు.. ఒకరి పక్కన ఒకరు. ఇదే ప్రకృతి ధర్మం. దీన్ని అవగతం చేసుకొని ఆ స్ఫూర్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఈ ప్రయత్నం. ‘నాన్నా.. నేను కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను’ అంటుంది కూతురు.
‘అవునా. అయితే నాతో రా’ అంటూ వంటింట్లోకి తీసుకెళ్తాడు కూతురిని ఆ తండ్రి. ‘ఇవిగో బంగాళ దుంపలు.. ఇదిగో గోధుమ పిండి.. ఆలూ పరాటా చెయ్యి.. పెళ్లయ్యాక ఇదేకదా నీ పని. ప్రాక్టీస్ చేసుకో.. ఊ... కమాన్.. ’ అంటూ బంగాళ దుంపలు, పిండి.. అన్నీటినీ కూతురు ముందుకు నెడ్తాడు. బిత్తరపోతుంది కూతురు. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు.. ‘నీ కల వేరు, నువ్వు చేరుకోవాలనుకుంటున్న గమ్యం వేరు. అప్పుడే పెళ్లితో ఓటమిని ఎందుకు అంగీకరిస్తావు. నీ ప్రయాణం ముందుకు సాగడానికి ట్రై చెయ్’ అంటూ కూతురికి రెక్కలున్నాయని గుర్తు చేస్తాడు. ఆ ప్రోత్సాహంతో ఆకాశంలోకి ఎగురుతుంది. ఫైటర్ పైలట్ అవుతుంది. ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌లోనిదీ సన్నివేశం. అలాంటి తండ్రులు ఎంతమంది ఉంటారు?
మెదడునెందుకు దారి మళ్లించడం
పొట్టలో ప్రాణం పోసుకోవడానికి, పుట్టాక ప్రాణం నిలుపుకోవడానికి ఆడబిడ్డ అయినా, మగబిడ్డ అయినా ఒకేరకమైన పోరాటం చేయాలి.. ప్రకృతిధర్మానుసారం. గెలుపోటములు, భావోద్వేగాలు అన్నీ సమానమే. వాటికి లింగవివక్ష లేదు. ఆడపిల్ల పుట్టగానే ఏడ్వడం, మగపిల్లాడు పుట్టగానే ఏడుపును ఆపుకోవడం ఉండదు. ఆ ఏడుపే బిడ్డ ఊపిరికి నిదర్శనం. ఆకలి, దప్పిక, నడక, మాట.. అన్నీ ఇద్దరు బిడ్డలకూ సమానమే. మరి ఆలోచననెందుకు అడ్డుకుంటారు? మెదడును ఎందుకు దారి మళ్లిస్తారు? మన ఆచార వ్యవహారాలు కూడా సైన్స్‌కు దగ్గరగా, ప్రకృతిలో ఇమిడేట్టు ఉంటాయని చెప్పుకుంటాం కదా.. దానికి తగ్గట్టుగానే అన్నప్రాశన రోజున ఆడబిడ్డ ముందైనా, మగబిడ్డ ముందైనా కత్తి, కలం, డబ్బు, బంగారం, పుస్తకం, స్వీట్స్ వంటివి పెడ్తాం. మరి పెంపకంలో ఎందుకు అమ్మాయి చేతికి బుట్టబొమ్మను, అబ్బాయి చేతికి బంతినీ ఇస్తాం? ఆడపిల్లకెందుకు బార్బీడాల్ అండ్ కిచెన్, అబ్బాయికెందుకు రేస్ కార్స్ సెట్‌ను కొనిస్తాం? అమ్మాయి నవ్వకూడదు.
అబ్బాయి ఏడ్వకూడదు. అమ్మాయి గెంతకూడదు. అబ్బాయి గెంతుతూనే ఉండాలి. అమ్మాయి అణగిమణిగి ఉండాలి.. అబ్బాయి పౌరుషం చూపించాలి. అమ్మాయి తలవంచాలి.. అబ్బాయి తలెత్తుకోవాలి. అమ్మాయి పరాధీన.. అబ్బాయి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అమ్మాయి ఆత్మవిశ్వాసం కనబరిస్తే పొగరు అని, ఆత్మవిశ్వాసం లోపించిన అబ్బాయిని ఆడంగి అని లేబుల్ వేస్తాం.. అంతగా రెండు మెదళ్లను కండిషనింగ్ చేస్తున్నాం. అది అమ్మాయిని మానసిక, శారీరక దుర్బలురాలిగా, అబ్బాయిని బలవంతుడిగా చూసేంత ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ వివక్ష అమ్మాయి జీవితంలో చదువు, కెరీర్, వేతనం, నిర్ణయాలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు దాకా కొనసాగుతోంది. దాకా ఏంటి ఆ ప్రభావంలోనే ఆమె జీవితం ముగిసిపోతుంటే!
అమ్మాయి నిర్ణయం.. సమాజం ఇగో
అమ్మాయిలను ఎక్కడ తక్కువ చూస్తున్నారు? చదువు, కెరీర్ కోసం బయటిదేశాలకూ పంపుతున్నారు. పెళ్లి విషయంలోనూ వాళ్ల నిర్ణయాన్ని కాదనట్లేదు.. అంటున్నారా? 135 కోట్ల జనాభాలో పది కోట్లమంది కూడా ఆ కోవలోకి రారేమో! వస్తే కులదురహంకార హత్యలెందుకు జరుగుతాయి? ఇక్కడ కులం ఒక్కటే కాదు ‘అమ్మాయి నిర్ణయం’ కూడా సమాజం ఇగోని హర్ట్ చేస్తోంది. ఆడపిల్లలు నిర్ణయాలు తీసుకునేదాకా ఎదుగుతున్నారు కాబట్టి అవకాశాల్లో కోత కనిపిస్తోంది. చదివించినా ఉద్యోగం చేసుకునే హక్కును లాగేసుకుంటున్నారు. లేదూ గ్రాడ్యుయేషన్ (సంప్రదాయ, ప్రొఫెషనల్) మధ్యలోనే పెళ్లిళ్లు చేసేసి.. తర్వాత చదువు కొనసాగించే, ఉద్యోగం చేయించే నిర్ణయాన్ని అత్తింటి లేదా వరుడి చేతుల్లో పెడ్తున్నారు కూతురితోపాటు. పట్టణాలు, ఉన్నత కుటుంబాల్లో చాలావరకు ఈ ధోరణి కన్పిస్తోంది. గ్రామీణ, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో పరిస్థితి ఇంకోరకం. ఆడపిల్ల అంటేనే భారం. వాళ్లకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఆడపిల్లకు చదువు ఖరీదైన వ్యవహారం. అందుకే ఆ ప్రివిలేజ్ మగపిల్లాడికి దక్కుతుంది. ఒకవేళ చదివించాలనే ఆశ మెండుగా ఉంటే అమ్మాయికి సర్కారు బడిలో, అబ్బాయికి ప్రైవేట్ కాన్వెంట్‌లో అటెండెన్స్ పడుతుంది. సాంఘిక ఆచారాల బరువును భరిస్తున్న మధ్యతరగతికి వరకట్నం ఒక హార్డిల్. అదీ మళ్లీ ఆడపిల్ల ఆశయాలకే ఉరి.
అమ్మాయి ఎక్కువ చదివితే అంతకన్నా ఎక్కువ చదివిన అబ్బాయికివ్వాలి.. అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ల పిల్లాడి పెంపకం, చదువు, ఉద్యోగానికి పెట్టిన ఖర్చులకు వడ్డీని కలిపి కట్నంగా డిమాండ్ చేస్తారు. అమ్మాయి, అబ్బాయి కాపురానికి భద్రతగా స్థిరాస్తీ చూపించమంటారు. అత్తింటి పరువును అమ్మాయి మోసేందుకు బంగారమూ కావాలంటారు. వీటన్నిటినీ పెంచుకునేకంటే అమ్మాయి చదువును తగ్గించడం తేలిక. ఇక పేదవాళ్ల లెక్క వేరు. అమ్మానాన్న పనిలోకి వెళితేనే ఇల్లు నడుస్తుంది. ఇల్లు నడవాలంటే ఆడపిల్ల ఇంటిపట్టున ఉండాలి. వంట చేస్తూ, తోబుట్టువులను చూసుకుంటూ. ఇంకొన్ని ఉదాహరణలు.. పాఠశాలల్లో అమ్మాయిలకు బాత్రూమ్‌లు లేకపోవడం. కొన్ని బడుల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు కలిపి బాత్రూమ్స్ ఉండడం.
ఈ దుస్థితి గ్రామాల్లో, సర్కారు బడుల్లోనే కాదు పట్టణాల్లో, నగరాల్లో, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉంది. దీనివల్లా అమ్మాయిలను చదువు మాన్పిస్తున్నరనేది నిజం. వీటన్నిటికీ తోడు ఆడపిల్లల మీద పెరుగుతున్న లైంగిక దాడులు, కిడ్నాప్‌లు. ఈవ్ టీజింగ్, రకరకాల హింస, హత్యలు. ఇవన్నీ కూడా ‘గజిని’ సినిమాలోని డైలాగ్‌లా ఆడపిల్లను మళ్లీ గడపలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లను కనాలన్న ధైర్యాన్ని తెంచేస్తున్నాయి. ఆడపిల్లను కనొద్దు అనే నిశ్చయాన్ని నింపుతున్నాయి. కడుపులో పిండం ఆడా? మగా? అని నిర్ధారించుకునే తెగువకు ఒడిగట్టిస్తున్నాయి. భ్రూణహత్యకు పాల్పడే కాఠిన్యాన్ని అలవరుస్తున్నాయి. అన్నిటినీ దాటుకుని భూమ్మీద పడ్డ బిడ్డను కడతేర్చే క్రౌర్యాన్నీ అంటగడుతున్నాయి. బాలారిష్టాలనూ తప్పించుకుని పెరుగుతున్న పిల్లకు అడుగుడుగున ఆంక్షలతో బతుకునే సవాలుగా మార్చుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు. ఆ జీవితాన్ని మెరుగ్గా కోరుకునే హక్కూ అంతే ప్రధానమైంది. అందులో చదువూ భాగమే. అది అందించిన వివేచనతో నిర్ణయాత్మక శక్తి అలవడడం అత్యంత సహజమైన ప్రక్రియే. ఆ స్థాయికి ఎదిగిన బిడ్డలను చూసి గర్వపడాలి. ఆ గర్వానికి లింగవివక్షను పులమడం నేరం. పులమకపోవడం పరిణతి. ఇప్పుడు అమ్మాయిలకు కావాల్సింది ఆ పరిణతి ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, సమాజం.
భవిష్యత్ తరాలకూ ఆస్తిగా..
ఆడ,మగ పుట్టుక కేవలం సెక్స్ క్రోమోజోమ్‌ల యాక్సిడెంట్. అంతేకాని ఆడపిల్లకు అరిష్టానికి, మగపిల్లాడికి పున్నామ నరకాల నుంచి తప్పించే సాహసానికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఒకవేళ పాపపుణ్యాలు, అరిష్టాదృష్టాల వెరపు ఉంటే .. అవి వైయక్తికం. సానుకూల, ప్రతికూల దృక్పథాల తాలూకు చర్యల ప్రతిఫలాలు మాత్రమే. అవీ ఈ జీవితం అదే ఈ జన్మలో అనుభవంలోకి వచ్చేవే. అందుకే పుట్టుకకు.. అనుభవంలోకి రాని స్వర్గనరకాలకు లంకె వద్దు. మగపిల్లాడి కంటే ఆడపిల్ల తక్కువ, మైనస్ అనే పెట్టుడుభావనలు, ఆధిపత్య అధికరణలూ వద్దు. పుట్టక ముందే ఆడపిల్లను చంపడం, పుట్టాక బతికే హక్కు లేకుండా చేయడం వంటివీ కూడదు.
అమ్మాయికి చదువు చెప్పించడం .. అబ్బాయిని ఇంటి పనుల్లో భాగస్వామిని చేయడం.. పెంపకంలో తప్పక చేర్చాల్సిన అంశాలు. ఆరోగ్యకరమైన సమాజానికి అంత్యంతావశ్యకాలు. అజ్ఞానమైతే అవగాహనతో సరిదిద్దుకోవచ్చు. అహంకారమైతే ‘శిక్ష’ణతో పరివర్తన చెందొచ్చు. చాయిస్ మనదే. కాని దానికి ఆత్మపరిశీలన అవసరం. అదే చైతన్యం.. చదువు. విచక్షణతో మమేకమైనది. తల్లిదండ్రుల నుంచి మొదలవ్వాలి.. ఇల్లే దీనికి బడి కావాలి. పిల్లలు నేర్చుకోవాలి.. మళ్లీ తల్లిదండ్రులకు నేర్పాలి.. ఒక చక్రంలా నిరంతరం తిరుగుతూనే ఉండాలి. అయితేనే ‘ఆడపిల్ల’ అంటే రెండో తరగతి పౌరసత్వం అనే పాత జాడ్యం పోయి ‘మనిషి’ అనే సరైన అర్థం తెలుస్తుంది. తర్వాత తరాలకూ ఈ భావజాలం క్రోమోజోమ్ ఆస్తిగా సంక్రమిస్తుంది. ఇదే ఆడపిల్ల గళం.. ఈక్వల్ ఫ్యూచర్‌కి.
- కౌమార దశ చాలా కీలకమైనది. ఈ సమయంలో బాలికలు ఎలాంటి నిర్మాణ పనుల్లో ( దేశ ప్రగతికి ఎంతో ముఖ్యమైనవైనా) పాల్గొనకూడదు. అలాగే ఇంటి పనులనూ మోయకూడదు. కాని దేశంలోని పదిహేను, పద్దెనిమిదేళ్ల మధ్య వయసు బాలికల్లో 65 శాతం మంది ఇంటి పనులతో ఊపిరిసలపకుండా ఉంటున్నారు. – జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.
- పురుషులు బయటచేసే పనుల కన్నా పదింతలెక్కువగా, మెరుగ్గా మన మహిళలు ఇంటి పనులు చేస్తున్నారు. ఈ వెట్టిలో వీళ్లకు సహాయపడ్తోంది ఇంట్లోని ఆడపిల్లలే.. చదువు మానేసి మరీ. – జెండర్ ఈక్వాలిటీ రిపోర్ట్(2018).
ఆడపిల్లల పట్ల వివక్ష చూపని దేశాలు
- స్వీడన్, ఫిన్‌లాండ్, నార్వే. నెదర్లాండ్స్, బెల్జియంలు మెదటి అయిదు స్థానాల్లో నిలబడ్డాయి. ఈ వరుసలో మన దేశం 59వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాది 32వ స్థానం.
- ఆడపిల్లల పట్ల అమానుషంగా ఉన్న దేశాల్లో మాలి, చాద్, నైజర్, గినీ, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి.
- మన దేశంలో అమ్మాయిలు ఉన్నత విద్యకు దూరమవడంలో ప్రధాన కారణం పీరియడ్స్. ఆ సమయంలో సరైన సౌకర్యాలు (శానిటరీ నాప్‌కిన్స్ )లేక అనారోగ్యానికి గురై బడి మానేస్తున్నారట.
- ఆడపిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు బాల్యవివాహాలూ అడ్డంకిగానే ఉన్నాయి ఇప్పటికీ. 2011 జనాభాలెక్కల ప్రకారం పదిహేనేళ్లకే బిడ్డ తల్లియిన అమ్మాయిలు 45 లక్షల మంది. 70 శాతం అమ్మాయిలైతే ఆ వయసువరకే ఇద్దరు పిల్లల తల్లులు.
- ప్రపంచంలోని ప్రతి ముగ్గురు బాలికా వధువుల్లో ఒకరు మన అమ్మాయే.
తెలుగు రాష్ట్రాల గర్ల్‌చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్
- బాల్యవివాహాలను అరికట్టడంతోపాటు అమ్మాయిల స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ పథకం ఆడపిల్లలు కనీసం ఇంటర్మీడియెట్ వరకైనా చదువుకునేలా ప్రోత్సహిస్తోంది.
- ఆర్థిక సహాయమూ అందిస్తోంది.
- ఇద్దరు పిల్లల పరిమిత కుటుంబంలోని ఒక ఆడపిల్లకు ఈ పథకం వర్తిస్తుంది.
- కేంద్ర ప్రభుత్వం ‘రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం’ ఉండనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment