నిధి మయూరిక- త్రిష శెట్టి
‘నా ఊరే నా ప్రపంచం’ అనే పరిమిత భావనకు భిన్నంగా– ‘ఈ ప్రపంచమే నా ఊరు’ అంటూ వివిధ రకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది యువతరం...
నిధి మయూరిక
బెంగళూరుకు చెందిన నిధి మయూరికకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి. పదకొండు సంవత్సరాల వయసులోనే ‘ఆస్ట్రోబయోలజీ’ చదవడం మొదలుపెట్టింది. 2016లో నాసా ఏమ్స్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో పాల్గొంది. ‘సైకతం’ పేరుతో డిజైన్ చేసిన త్రీ లెవెల్ స్పేస్ కాలనీ, ఆ తరువాత రూపొందించిన ‘స్వస్తికం’.. ‘సొహం’ డిజైన్‌లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి.
ఈ బహుమతులతో సైన్స్‌పై తన ఆసక్తి రెట్టింపు అయింది. గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టింది. స్పేస్‌సైన్స్‌ను ప్రమోట్ చేయడానికి రకరకాలుగా కృషి చేస్తున్న సొసైటీ ఫర్ స్పేస్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌లో టీమ్‌లీడర్‌గా పనిచేస్తుంది నిధి. యూఎన్ ఉమెన్
ఇండియా సొసైటీ ఫర్ స్పేస్‌లాంటి ఆర్గనైజేషన్‌లలోని యంగ్ లీడర్స్‌తో కలిసి పనిచేస్తోంది. జెండర్–సెన్సిటివిటీ ప్రకటనలు, సినిమాలు, సాహిత్యంలో ఉదాత్తమైన మహిళల పాత్రలు, స్త్రీల హక్కులు...ఇలా ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలదు నిధి.
‘నేను పయనిస్తున్న దారిపై నమ్మకం ఉంది. నేను ఆశావాదిని. మార్పు త్వరలోనే సాధ్యపడుతుందని నమ్ముతున్నాను’ అంటున్న నిధి మయూరిక ‘ఐయామ్ జనరేషన్ ఈక్వాలిటీ’ అని నినదిస్తోంది. పాత, కొత్తతరం అనే తేడా లేకుండా అందరం ఎడ్యుకేట్ కావాలి అంటుంది నిధి మయూరిక.
దేవిష్ ఝా
19 సంవత్సరాల దేవిష్ ఝా హైస్కూల్లో చదివేరోజుల నుంచే ఇంటర్నేషనల్ క్లైమెట్ ఆర్గనైజేషన్ ‘జీరో అవర్’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. పర్యావరణ విధ్వంసం గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఈతరం, భవిష్యత్‌తరాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలి అంటుంది దేవిష్.
‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలి. జీరో అవర్‌లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి ప్రచారం చేయాలి. వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో పంచుకోవాలి... ఇవి క్లైమెట్ యాక్టివిస్ట్ ప్రధానబాధ్యతలు’ అంటుంది దేవిష్.
‘యువతరంలో ప్రతి ఒక్కరికీ సంకల్పబలం ఉంది. బలమైన గొంతుక ఉంది. అది సామాజిక మార్పుకు ఉపయోగపడాలి’ అంటుంది దేవిష్.
ఈతరం ప్రతినిధులందరూ సుందర భవిష్యత్ నిర్మాణానికి తమవంతుగా కృషి చేయాలని అంటుంది 23 సంవత్సరాల అవని అవస్తి. అంటార్కిటికా యాత్రకు అవకాశం వచ్చినప్పుడు తన వయసు 18 సంవత్సరాలు. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు.
‘అక్కడి వాతావరణం తట్టుకోవడం కష్టం. నువ్వు ఏమైనా అబ్బాయివా! ఈ డబ్బును నీ పెళ్లి కోసం బ్యాంకులో పొదుపు చేస్తే మంచిది’ అన్నారు. ఇలాంటి సంఘటనలు తన ఉత్సాహాన్ని నీరుగార్చలేకపోయాయి.
అంటార్కిటికాలో దేశదేశాల నుంచి వచ్చిన యువతరంతో మాట్లాడే అవకాశం అవనికి లభించింది. ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. విస్తృతప్రపంచాన్ని దర్శించినట్లు అనిపించింది.
‘రీసైకిల్ ఆర్మీ’ ద్వారా రీసైకిలింగ్, జలసంరక్షణ....మొదలైన విషయాలపై విస్తృత ప్రచారం చేసిన అవని– ‘వయసుతో నిమిత్తం లేకుండా అన్ని తరాల వాళ్లు పర్యావరణ పరిరక్షణకు తమవంతు ఆలోచన చేయాలి. ఆచరించాలి’ అంటుంది.
త్రిష శెట్టి.. ‘షీ సే’
ముంబైకి చెందిన త్రిష శెట్టి ‘షీ సే’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా స్త్రీ చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్త్రీల భద్రతపై ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘ఆన్‌లైన్‌లో బార్‌ల గురించి సమాచారం వెదికితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. బాధితులకు సంబంధించిన సమాచారం మాత్రం కనిపించదు’ అంటున్న త్రిష బాధితులకు అండగా నిలుస్తోంది.
ఈ క్రమంలో బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఐక్యరాజ్య సమితి ‘యంగ్ లీడర్స్’ జాబితాలో చోటు సంపాదించిన త్రిష శెట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ సదస్సులలో పాల్గొనడం ద్వారా తన ఉద్యమ కార్యచరణకు పదును పెడుతుంది.
..... రకరకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తున్న యువతరంలో వీరు కొందరు మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారికి ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం.
చదవండి: సమ గౌరవమే సరైన రక్ష
Comments
Please login to add a commentAdd a comment