Shailaja Teacher Award 2021|: Kerala Ex Minister Shailaja Teacher Won Open Society Prize - Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు ఆదర్శం ఈ ‘శైలజాటీచర్‌’

Published Wed, Jun 23 2021 8:13 AM | Last Updated on Wed, Jun 23 2021 1:41 PM

Kerala Ex Minister Shailaja Teacher Won Open Society Prize - Sakshi

‘శైలజాటీచర్‌కు’ తాజాగా 2021 సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’ లభించింది. గతంలో ఈ ప్రైజ్‌ను పొందిన వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫిలాసఫర్‌ లు, నోబెల్‌ గ్రహీతలు ఉన్నారు. కోఫీ అన్నన్‌ కూడా ఉన్నారు. ప్రజారోగ్య సేవ ల వైపు యువతులు ఆకర్షితులయ్యేలా రోల్‌ మోడల్‌గా పని చేసినందుకు కెకె శైలజకు ఇప్పుడీ గౌరవం దక్కింది. గత ఏడాది ఇదే నెలలో ‘పబ్లిక్‌ సర్వీస్‌ డే’ కి యూఎన్‌లో ప్రసంగ ఆహ్వానం అందుకున్న ఏకైక భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందారు. టీచర్‌గా ఉండి, రాజకీయాలలోకి వచ్చి, ప్రజారోగ్య సేవలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శైలజ అమ్మాయిలకు రోల్‌ మోడల్‌. 

మలయాళంలో ‘వైరస్‌’ (2019) అని ఒక సినిమా వచ్చింది. రావడానికి ముందు ఆ సినిమా నిర్మాత రీమా కల్లింగళ్, ఆమె భర్త ఆషిక్‌ అబు కలసి అనుమతి కోసం అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ దగ్గరకు వచ్చారు. ‘‘మీ పాత్రను సినిమాలో రేవతి వేస్తున్నారు’’ అని చెప్పారు. ఆషిక్‌ ఆ సినిమాకు దర్శకుడు. సినిమా కథాంశం.. 2018 లో కేరళలో ప్రబలిన ‘నిఫా’ వైరస్‌. ఇప్పుడు కరోనాను కట్టడి చేసినట్లే అప్పుడూ నిఫా వ్యాప్తి చెందకుండా పాలనా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేశారు శైలజ. ఆ పాత్రనే సినిమాలో రేవతి వేస్తున్నది. ‘‘అయితే ఒక రిక్వెస్ట్‌’’ అన్నారు శైలజ. ‘‘సినిమా సైంటిఫిక్‌గా ఉండాలి. భవిష్యత్తులో విద్యార్థులకు నాలెడ్జ్‌ ఇచ్చేలా ఉండాలి’’ అని చెప్పారు. సినిమా విడుదలైంది. బాగా ఆడింది. ‘‘మీ పాత్రను రేవతి చాలా బాగా చేశారు’’ అన్నారెవరో ఫోన్‌ చేసి. శైలజ పెద్దగా నవ్వారు. ‘‘సినిమాలో రేవతి మౌనంగా, విచారంగా ఉంటారు. నేను అలా ఉండను. నేను ఓకల్‌ అండ్‌ విగరస్‌’’ అన్నారు. మాట, చేత గట్టిగా ఉంటాయని. సినిమా మాత్రం ఆమె కోరుకున్నట్లుగానే వచ్చింది.. పిల్లలకు నాలెడ్జ్‌ ఇచ్చేలా.

ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు పార్టీలో ముఖ్య హోదాలో ఉన్నప్పుడూ.. శైలజ ‘టీచరమ్మే’! శైలజా టీచర్‌ అంటారు. లేదంటే టీచరమ్మ అంటారు. అధికారంతో వచ్చే ఆడంబరాలేమీ ఆమెలో చొరబడలేకపోయాయి. సామాన్యుల మనిషి. అంతే తప్ప మంత్రీ కాదు, పార్టీ లీడరూ కాదు. హైస్కూల్లో ఫిజిక్స్‌ టీచర్‌గా చేశారు శైలజ. రాజకీయాల్లోకి వచ్చి పదిహేడేళ్లయినా కూడా నేటికీ ఆమె శైలజా టీచరే. ఇప్పుడు కేరళ అమ్మాయిలంతా ఆరోగ్యసేవల రంగంలోకి వచ్చేందుకు శైలజ స్ఫూర్తి అయినట్లే.. శైలజ రాజకీయాల్లోకి రావడానికి వాళ్ల అమ్మమ్మ కల్యాణి స్ఫూర్తి. కల్యాణి తండ్రి బ్రిటిష్‌ వాళ్ల టీ ఎస్టేట్‌లో సూపర్‌ వైజర్‌గా పని చేసేవారు. ఆయన్నంతా రమణ మేస్త్రీ అనేవారట! అప్పట్లో వాళ్ల జిల్లాలో (ఇప్పుడు కన్నూర్‌ జిల్లా) ఆయనే సంపన్నుడు. రాజకీయ స్పృహ ఉన్నవారు. అది ఆయన్నుంచి ఆయన కూతురికి, ఆ కూతురి నుంచి శైలజకు అందింది. రమణ మేస్త్రి కుటుంబం ఆనాడు రెండంతస్తుల బంగళాలో ఉండేది. చుట్టు పక్కలంతా గుడిసెలు ఉండేవి. ‘‘ఇప్పుడు ఆ బంగళాను గుడిసెను చేస్తూ, చుట్టుపక్కలంతా బంగళాలు వెలిశాయి’’ అని నవ్వుతూ చెబుతారు శైలజ. నవ్వు ఆమె నిరాడంబరత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉంటుంది. 

ఇంట్లో ఒకటే అమ్మాయి శైలజ. తండ్రి రైతు. తల్లి గృహిణి. శైలజ మాత్రం వాళ్ల అమ్మమ్మ నోట్లోంచి ఊడినట్లుగా ఉంటుంది. ఆమె సోషల్‌ వర్క్‌ను చూసే ఈమె అటువైపు వెళ్లింది. 1981లో 25 ఏళ్ల వయసులో శైలజ జీవితంలో రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. ఆమె రెండో డిగ్రీ పూర్తయింది. టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అదే ఏడాది ఆమె భాస్కరన్‌ అనే సీపీఎం కార్యకర్తను పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా టీచరే. ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి శోభిత్‌ (34) ఎలక్ట్రికల్‌ ఇంజనీరు. ప్రస్తుతం అబు ధాబిలో ‘కోవిడ్‌ హెల్త్‌కేర్‌ ఫెసిలిటీ’ ఆపరేషన్స్‌ హెడ్‌గా చేస్తున్నాడు. చిన్నబ్బాయి లలిత్‌ (32) ఎం.టెక్‌ చేసి, కన్నూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో పని చేస్తున్నాడు. 

అబ్బాయిల చదువులు, ఉద్యోగాలు ఎలా ఉన్నా.. అమ్మాయిలు మాత్రం కష్టపడి చదివి, ఉద్యోగం సంపాదించాలని అంటారు శైలజ. మహిళలు తాము చేస్తున్న ఉద్యోగాన్ని కుటుంబం కోసం మానేయడమంటే సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమేనని కూడా అంటారు. బి.టెక్‌లు. ఎంబీఎలు చేసిన అమ్మాయిలు పెళ్లయ్యాక ఇంట్లోనే ఉండిపోవడం కరెక్ట్‌ కాదని శైలజ అభిప్రాయం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement