సోషల్‌ మీడియాలో దుమ్మురేపే ‘నృత్య సందేశం’ | Kerala man makes communal remark on viral dancing medicos | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో దుమ్మురేపే ‘నృత్య సందేశం’

Published Thu, Apr 15 2021 12:34 AM | Last Updated on Thu, Apr 15 2021 3:47 AM

Kerala man makes communal remark on viral dancing medicos - Sakshi

ధీ (దీక్షిత) – అరివు, జానకి– నవీన్‌ రజాక్‌

దక్షిణ భారతదేశం నుంచి రెండు జంటలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. ఒకటి తమిళనాడు నుంచి ధీ–అరివు జంట. రెండు కేరళ నుంచి జానకి– నవీన్‌ రజాక్‌ జంట. ధీ–ఇరువి చేసిన సింగిల్‌ వీడియో ‘ఎంజాయ్‌ ఎంజామి’ ఈ దేశం మూలవాసులను, పూర్వికుల సామరస్య జీవనాన్ని గుర్తు చేసే సందేశం ఇస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇక కేరళ జంట చేసిన ‘రస్‌పుటిన్‌’ నృత్యం అనివార్యంగా ద్వేషానికి ప్రతిఘటనగా మలచబడింది. కొంతమంది కుర్రవాళ్లు ముందు యుగం దూతలు అన్నాడు శ్రీశ్రీ. ప్రేమను, సామరస్యాన్ని సందేశంగా ఇవ్వడానికి ఈ కాలపు అమ్మాయిలు, అబ్బాయిలు ముందుకు రావడం అవసరం అనే ఎక్కువ మంది భావిస్తున్నారు.

1978 నాటి డిస్కో గీతం ‘రస్‌పుటిన్‌’ ఎంత మందికి గుర్తుందో కాని సడన్‌గా ఆ పాట ఇప్పుడు మళ్లీ కేరళ అంతా మార్మోగుతోంది. డిస్కో గ్రూప్‌ ‘బోని ఎం’ తయారు చేసి పాడిన ఆ పాట ఆ రోజుల్లో చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటలోని ‘రస్‌పుటిన్‌’ అనే పేరు 20 శతాబ్దంలో రష్యా జార్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక మత పెద్దది. ‘పొలిటికల్‌ మేనిపులేటర్‌’గా ఖ్యాతి గడించిన రస్‌పుటిన్‌ను ఈ పాట తిట్టిందో పొగిడిందో తెలియనివారు ఉన్నారు. ఏమైనా దాని బీట్‌కు మంచి ఊపు ఉంది. అందుకే త్రిశూర్‌ మెడికల్‌ కాలేజీలోని ఇద్దరు మెడికోలు దానికి 30 సెకన్ల స్టెప్పు వేసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేశారు. తాము చదువుతున్న మెడికల్‌ కాలేజీ టాప్‌ ఫ్లోర్‌లో ఉండే హౌస్‌ సర్జన్స్‌ క్వార్టర్స్‌ కారిడార్‌లో దీని తోటి విద్యార్థి షూట్‌ చేయగా డాన్స్‌ చేసి పోస్ట్‌ చేశారు. ఆ ఇద్దరి పేర్లు జానకి ఓమ్‌కుమార్, నవీన్‌ రజాక్‌. వీళ్లిద్దరి డాన్స్‌ ముఖ్యంగా కాళ్ల కదలిక, ఉత్సాహం నెటిజన్స్‌కు ఎంత నచ్చాయంటే రాత్రికి రాత్రి వాళ్లు స్టార్లైపోయారు.

కాలు కదిపిన మెడికో జంట
కరోనా వ్యాప్తి వైద్యరంగంపై ఎంత వొత్తిడి పెంచిందో అందరికీ తెలుసు. వైద్య విద్యార్థులు కూడా ఇందుకు అతీతం కాదు. స్ట్రెస్‌ నుంచి బయట పడటానికి డాక్టర్లు కూడా ఐసియులలో డాన్స్‌ చేసి వీడియోలు పోస్ట్‌ చేయడం చూశాం. అలానే కేరళ త్రిశూర్‌ మెడికల్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న నవీన్‌ రజాక్, థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న జానకి ఓమ్‌ కుమార్‌ కూడా నాటి డిస్కో గీతం ‘రస్‌పుటిన్‌’కు స్టెప్పులేసి పోస్ట్‌ చేశారు. వారిద్దరి ఆనంద తాండవం క్షణాల్లో వైరల్‌గా మారింది. కేరళతో పాటు గల్ఫ్‌ దేశాలకు కూడా పాకిపోయింది. అందరూ వారి డాన్స్‌ను మెచ్చుకున్నారు. జానకి తల్లి డాక్టర్, తండ్రి సైంటిస్ట్‌. నవీన్‌ రజాక్‌ తండ్రి వ్యాపారి. అతని కుటుంబీకులు హైదరాబాద్‌లో సివిలింజనీరింగ్‌ లో ఉన్నారు. త్రిశూర్‌ మెడికల్‌ కాలేజీలో ‘వైకింగ్స్‌’ పేరుతో 13 మంది సభ్యుల డాన్స్‌ బృందం ఉంది. అందులో నవీన్, జానకి ఇద్దరూ సభ్యులు. ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లు. అందుకే డ్యూటీ మధ్యలో ఆటవిడుపుగా ఈ డాన్స్‌ షూట్‌ చేసి పోస్ట్‌ చేశారు.

చాలా పొగడ్త.. వివాదం..
పొగడ్తలు వచ్చి పడ్డ ఈ జంటను ఇప్పటి కేరళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒకరిద్దరు ‘మత వ్యాఖ్యానం’ చేయడానికి చూశారు. ఒక అడ్వకేట్‌ దీనిని ‘డాన్స్‌ జిహాద్‌’గా వ్యాఖ్యానిస్తూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ పెట్టడంతో అతనికి విపరీతమైన ఎదురు సమాధానాలు వచ్చాయి. ప్రతి దాన్ని మతంతో ముడిపెట్టడంపై మండిపడ్డ మెడికోలు, విద్యార్థి సంఘ నాయకులు ‘హేట్‌ రెసిస్ట్‌’ హ్యాష్‌స్టాగ్‌తో అదే పాటకు బోలెడన్ని వీడియోలు చేస్తూ తిరిగి పోస్ట్‌ చేయసాగారు. బాగా డాన్స్‌ చేసే జంటకు 5 వేల రూపాయల క్యాష్‌ అవార్డు కూడా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో 30 సెకన్ల వీడియోకు అనుమతి ఉండటం వల్ల నిడివి అంతలోనే ఉండాలని షరతు పెట్టారు. దాంతో మా నృత్యం ద్వేషానికి ప్రతిఘటనగా అభివర్ణిస్తూ అక్కడ చాలా మంది డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా ఈ జంటను మీరు మళ్లీ మళ్లీ ఇలా డాన్స్‌ చేయండి అని కోరుతున్నవారే ఎక్కువ.

ఈ మట్టి సామరస్యమైనది
మరోవైపు గత నెల రోజులుగా ఇండి పాప్‌లో ‘ఎంజాయ్‌ ఎంజామి’ పాట దుమారం రేపుతోంది. దీనిని పాడింది తమిళ గాయకుడు అరివు. గాయని ధీ (దీక్షిత). ఇద్దరికీ శ్రీలంకకు వలస వెళ్లిన తమిళ కుటుంబాల మూలాలు ఉన్నాయి. గాయకుడు అరివును అతని నానమ్మ ‘నా తండ్రీ’ (ఎంజామి) అని పిలిచేదట. ‘ఎంజాయ్‌ నా తండ్రీ’ అర్థంలో ‘ఎంజాయ్‌ ఎంజామి‘ పేరుతో అతడు పాట రాసి సంతోష్‌ నారాయణన్‌ సంగీత దర్శకత్వంలో పాడి వీడియో విడుదల చేశాడు. ధీ దీనికి గొంతు ఇచ్చింది.

‘ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరికతను కలలు కన్నారు. వారు ఎంతో సామరస్యాన్ని పాటించారు. అందరూ దగ్గరగా రండి. అందరూ దగ్గరగా కూడండి. అందరూ ఎంజాయ్‌ చేయండి. కలిసి ఎంజాయ్‌ చేయండి’ అనే అర్థాన్ని ఇస్తూ ప్రకృతిని తలపోస్తూ ‘ఎంజాయ్‌ ఎంజామి’ పాట సాగుతుంది. పాట చివరలో తన నానమ్మను చూపిస్తాడు కూడా. అరివు కనీసం రేడియోకు కూడా స్థోమత లేని కుటుంబంలో పెరిగాడు. దర్శకుడు పా రంజిత్‌కు రాక్‌ బ్యాండ్‌ ‘ది క్యాస్ట్‌లెస్‌ కలెక్టివ్‌’లో సభ్యుడయ్యాడు. దళిత స్పృహతో పాటలు రాసే ఇతడికి రంజిత్‌ అవకాశం ఇచ్చాడు. తమిళంలో ఎన్నో పాటలు రాసి పాడుతున్నాడు. ధీ కూడా సామాజిక సందేశాన్నిచ్చే పాప్‌ గీతాలను విడుదల చేస్తోంది. ఆమె గానానికి ఒక విశిష్ట తత్త్వం ఉంటుందని అంటారు. ఆమె గొంతు వినాలంటే వెంకటేశ్‌ ‘గురు’లో ‘ఓ సక్కనోడా’... పాట వినాలి. సంగీతం, నృత్యంలో కొత్తతరం సందేశాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేస్తుంది. పూర్వం మంచి బుద్ధులు పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు పిల్లలు చెప్పే కాలం వచ్చింది. పిల్లల చేత చెప్పించుకునే స్థితిలో సమాజం ఎందుకుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

– సాక్షి ఫ్యామిలీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement