Kerala- Menstrual Holiday: కేరళలో యూనివర్సిటీ విద్యార్థినులకు అధికారికంగా బహిష్టు సెలవులు లభించాయి. ఆ వరుసలో దేశంలోనే మొదటిసారిగా కొట్టాయంలోని ఒక సిబిఎస్‌ఇ స్కూలు తన విద్యార్థినులకు బహిష్టు సెలవు ప్రకటించింది. అంతేకాదు తన స్కూలులో ఈడేరే వయసు అమ్మాయిల కోసం ‘ప్యూబర్టీ ల్యాబ్’ను ఏర్పాటు చేయనుంది.
పుష్పవతులైన అమ్మాయిలకు ఈ ల్యాబ్‌లో సూచనలు సలహాలు ఇవ్వడమే కాదు ప్యాడ్స్ వాడకం కూడా తెలుపుతారు. విద్యార్థినుల అటెండెన్స్‌లో తప్పనిసరి శాతాన్ని సవరిస్తూ యూనివర్సిటీల్లో, హైస్కూళ్లలో ఇలాంటి సెలవు ఇవ్వడాన్ని ప్రతి రాష్ట్రం ఆలోచించాల్సి ఉంది.
సమస్యలను గుర్తించి
మనిషి నాగరికుడు కావడం అంటే తను నివసించే సమాజాన్ని స్నేహపూరితంగా, వేదనా రహితంగా, ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో నిర్మించుకోవడమే. ప్రతి సమూహపు ప్రజాస్వామికమైన డిమాండ్లను పరిష్కరించుకుంటూ వెళ్లడమే. సమస్యలను గుర్తించి వాటిని పరిగణిస్తూ పోవడమే. ఈ సమాజం మహిళా స్నేహితంగా ఉండాలని మహిళలు ఏనాటి నుంచో కోరుకుంటున్నారు.
గొప్ప స్త్రీ పక్ష నిర్ణయం
ముఖ్యంగా వారి దైహిక సమస్యలను, పరిమితులను గుర్తించి ఆ మేరకు అన్ని రంగాలు, విధానాలలో ఎరుక ప్రదర్శించమని అంటున్నారు. ఉద్యోగాల్లో స్త్రీలు మెటర్నిటీ లీవు పొందడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితంగా ఇటీవల అనేక సంస్థలు బహిష్టు సెలవులు స్త్రీలకు మంజూరు చేస్తున్నాయి. దానికి కొనసాగింపుగా తాజాగా కేరళ ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థినులకు అధికారికంగా బహిష్టు సెలవులు మంజూరు చేసింది. ఇది చాలా గొప్ప స్త్రీ పక్ష నిర్ణయం.
ఆమె లీడర్ అయ్యాక
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ మొన్నటి జనవరి 11న తన యూనివర్సిటీ విద్యార్థినులకు బహిష్టు సెలవలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. దానికి కారణం ఆ యూనివర్సిటీలో డిసెంబర్‌లో స్టూడెంట్ ఎలక్షన్లు జరిగి ఎస్.ఎఫ్.ఐ తరఫున నమితా జార్జ్ అనే విద్యార్థిని స్టూడెంట్ యూనియన్‌కు చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం.
పాలక్కడ్‌కు చెందిన 23 ఏళ్ల నమిత ఆ యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనలాంటి విద్యార్థినుల ఇబ్బంది గమనిస్తూ రావడం వల్ల తాను లీడర్ అయిన వెంటనే విద్యార్థినులకు బహిష్టు సెలవులు ఎంత అవసరమో వివరిస్తూ ఆమోదం కోసం యూనివర్సిటీకి లేఖ రాసింది.
యూనివర్సిటీ వెంటనే ఈ లేఖను పరిగణించి జనవరి 11న బహిష్టు సెలవులు ప్రకటించింది. అంతేకాదు తన యూనివర్సిటీలో 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు 2 నెలల ప్రసూతి సెలవు వాడుకునే వెసులుబాటును ప్రకటించింది. విద్యార్థినుల తరఫున చేయదగ్గ కనీస నిర్ణయంగా యూనివర్సిటీ ఈ చర్యను వ్యాఖ్యానించింది.
కదిలిన ప్రభుత్వం
కొచ్చిన్ యూనివర్సిటీ విద్యార్థినులకు బహిష్టు సెలవులు ప్రకటించాక దానికి వచ్చిన స్పందన చూసి కేరళ ప్రభుత్వం స్పందించింది. కేరళలోని మొత్తం 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు బహిష్టు సెలవు, ప్రసూతి సెలవు మంజూరు చేసింది.
యూనివర్సిటీల్లో సెమిస్టర్లు రాయడానికి 75 శాతం హాజరు అవసరం. కాని విద్యార్థినులకు ఇక మీదట 73 శాతం హాజరు ఉంటే సరిపోతుంది. 2 శాతం బహిష్టు సెలవుల కింద పోతుంది. ఈ నిర్ణయం వెలువడటం వెనుక అక్కడి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఒక మహిళ డాక్టర్ ఆర్.బిందు ఉండటం కూడా ఒక కారణం కావచ్చు.
స్కూళ్ల మాట ఏమిటి?
ఈ నిర్ణయం వెలువడ్డాక జూనియర్ కాలేజీల్లో, స్కూళ్లలో విద్యార్థినుల బహిష్టు సెలవుల గురించి చర్చ వచ్చింది. వారిని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం తగిన విధానం కోసం అధ్యయనం చేస్తోంది. ఈలోపు కొట్టాయంలోని ‘లేబర్ ఇండియా పబ్లిక్ స్కూల్’ అనే సిబిఎస్‌ఇ స్కూలు తన స్కూల్లోని విద్యార్థినులకు బహిష్టు సెలవులు తనకు తానుగా మంజూరు చేసింది.
అంతేకాదు ‘ప్యూబర్టీ ల్యాబ్’ పేరుతో ఒక ల్యాబ్‌ను తెరిచి ఈడేరే పిల్లల కోసం బహిష్టు క్లినిక్, శుభ్రత శిక్షణ, ప్యాడ్‌ల తయారీ, లైంగిక ఆరోగ్యం గురించి అవగాహన అందుబాటులోకి తేనుంది. ‘తెలిసీ తెలియని వయసులో బహిష్టు సమయంలో ఆడపిల్లలకు ఎన్నో భయాలు, ఆందోళనలు, మానసిక, శారీరక సమస్యలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసే వ్యవస్థ అవసరం’ అని ఆ స్కూలు యాజమాన్యం చెప్పింది.
అతి ముఖ్యమైన సమస్య
కేరళలోనే కాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు హైస్కూల్లో డ్రాపవుట్స్ కావడానికి బహిష్టు సమస్య, టాయిలెట్ల సమస్య ముఖ్య కారణాలని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా ఇచ్చే ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయి జరగడం లేదు కాని కదలిక వచ్చింది.
టాయిలెట్ల సమస్య కూడా కొన్ని రాష్ట్రాల్లో సమర్థంగా కొన్ని రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా తీరుతోంది. విద్యార్థినులు బహిష్టు మూడు రోజులు తీవ్ర ఇబ్బందితో స్కూల్‌కు రాలేకపోతే హాజరుకు భయపడి అసలుకే ఎగనామం పెట్టవచ్చు. అదే బహిష్టు సెలవు ఉంటే ధైర్యంగా పెట్టుకునే వీలు ఉంటుంది.
ఈ సెలవు అవసరమా అని కొట్టాయంలోని స్కూలు యాజమాన్యాన్ని అడిగితే ‘ఆరోగ్యం బాగలేకపోతే పిల్లలు ఎలా బడికి రారో బహిష్టు సమయంలో కూడా అలానే రారని అర్థం చేసుకుంటే సరిపోతుంది’ అన్నారు. నిజమే. జ్వరం వస్తే స్కూలుకు పోనట్టు పిరియడ్స్ సమయంలో ఇబ్బంది ఉంటే స్కూలుకు పోని వీలు విద్యార్థినులకు ఉండాలి.
స్త్రీల గురించి ఆలోచించే కొద్ది ఎన్ని మార్పులు వ్యవస్థలో రావాలో మెల్లమెల్లగా అర్థమవుతోంది. విద్యార్థినులకు ఈ సౌకర్యం ఎంత అవసరమో ప్రతి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆడపిల్లల చదువు మరింత సౌకర్యంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
చదవండి: పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి...
Comments
Please login to add a commentAdd a comment