కొండవీటి కోట... ఈ కోటలో పర్యటిస్తే ‘కొండవీటి చాంతాడు’ అనే నానుడి గుర్తుకు వస్తుంది. పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ కోట. కోట ఆవరణలో ఉన్న వందల అడుగుల లోతైన బావుల్లోని నీటిని తోడడానికి చాంతాడు ఎంత పొడవు ఉండాలి? ఇక్కడ బావుల్లోని నీటి కోసం చాంతాడు పొడవే కాదు, కోట గురించి చెప్పుకుంటూ పోతే ఆ వివరాల జాబితా నిడివి కూడా అంత పొడవూ ఉంటుంది. కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, ఫ్రెంచ్ పాలకులు, ఆ తర్వాత ఈ ప్రదేశం బ్రిటిష్ పాలకుల అధీనంలోకి వెళ్లింది. ఒకప్పుడు రాజధానిగా వెలిగింది. ఇప్పుడు గ్రామంగా మిగిలింది. ప్రస్తుతం మంచి పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటోంది.
ఔషధాల కొండ
కొండవీడు గ్రామం గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలో ఉంది. అనపోతారెడ్డి 14వ శతాబ్దంలో రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చి కోటను అభివృద్ధి చేశాడు. కోట చుట్టూ ఉన్న గోడ 20 కిలోమీటర్లు ఉంటుంది. పదిహేడు వందల ఎత్తులో ఉన్న ఈ గిరిదుర్గంలో ఏడాది పొడవునా నీటి లభ్యత కోసం మూడు చెరువులు, ఒక కోనేటిని తవ్వించారు. ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా గొప్ప వాటర్‌మేనేజ్‌మెంట్ విధానాన్ని అనుసరించిన తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొండ దిగువ నుంచి కొండ మీదకు వెళ్లే ఆరు కిలోమీటర్ల దారితోపాటు కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌లో నడక ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. స్వయంగా పెడలింగ్ చేస్తూ పడవలో విహరించవచ్చు.
పిల్లలు ఆడుకోవడానికి మంచి చిల్డ్రన్స్ పార్క్ కూడా సిద్ధం కానుంది. ఇటీవల వారాంతపు విడిదికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఈ ఏడాది జనవరి తొమ్మిదో తేదీన అధికారికంగా టూరిజానికి ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఆదివారాల్లో రెండు వందలకు పైగా కార్లు, ఆరు వందలకు పైగా టూ వీలర్లు కోట మీదకు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ‘నగరవనం’ కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాశివనం, పంచవటి వంటి థీమ్ పార్కులు సిద్ధమవుతున్నాయి. ఈ కొండల్లో నాగముష్టి, తిప్పతీగ, పాషాణభేదితోపాటు లెక్కలేనన్ని ఔషధమొక్కలున్నాయి. ఈ కొండమీదున్న వందల ఏళ్ల నాటి వెదురు చెట్లకు వెదురు బియ్యం పండుతోంది. పిల్లలకు విజ్ఞానంతో కూడిన విహార ప్రదేశం ఇది.
కొండలను కలిపే ద్వారం
కోటలోపల నరసింహ ఆలయం, లక్ష్మీ నరసింహ ఆలయం, రెండు శివాలయాలు, గంగాధర రామేశ్వరాలయం, మసీదు, దర్గా, వేమన మండపం, నేతి కొట్టు, గుర్రపుశాలలు, భోజనశాల చూడాల్సిన ప్రదేశాలు. రాజ మందిరాన్ని బ్రిటీష్ పాలకులు బంగ్లాగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ బంగ్లాను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసుగా ఉపయోగిస్తోంది. ఇవన్నీ కాకుండా ఈ కోటకు రక్షణగా 23 బురుజులుండేవి, ఇప్పుడు అందులో కొన్ని శిథిలమై నామావశిష్టాలుగా మిగిలిపోయాయి. చుక్కల కొండ, జెట్టి, నెమళ్ల బురుజు, సజ్జా మహల్, మిరియాల చట్టు బురుజు వంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఒక ఎత్తయితే... రెండు కొండలను కలుపుతూ రెండు వందలకు పైగా వెడల్పు ఉన్న రెండతస్థుల తూర్పు ద్వారం ఆనాటి నిర్మాణ కౌశలానికి దర్పణం.
నమూనా కోట
ఈ కోటలో పర్యటించడానికి ముందు కొండవీడు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరాన ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేశ్ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ను చూస్తే బాగుంటుంది. ఈ మ్యూజియం అక్షరాలను శిల్పాలుగా, చిత్రాలుగా మలుచుకున్న ఒక గ్రంథాలయం. ఇందులో కొండవీటి కోట నమూనా ఉంది. ఆ నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కొండవీడు దారి పడితే కోటలో చూడాల్సిన వాటిలో దేనినీ మిస్ కాకుండా చూడగలుగుతాం. ఈ కోటకు వెళ్లే కొండ దిగువ నుంచి ధూమపానం, మద్యపానం నిషేధం అనే విషయాన్ని పర్యాటకులు మర్చిపోకూడదు. ఈ నిబంధన కచ్చితంగా అమలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment