మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత అవసరమో, అలాగే తిన్న ఆహారం జీర్ణమై వ్యర్థాలు విసర్జితం కావడం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రక్రియకు ఇరవై నాలుగ్గంటలకంటే ఎక్కువ విరామం రావడం ఆరోగ్యకరం కాదు. రోజంతా ఒళ్లు వంచి పని చేసే వాళ్లకు ఇది అసలు సమస్యకానే కాదు. కానీ రోజంతా కూర్చుని ఉద్యోగం చేసే వాళ్లకు ఇదే పెద్ద సమస్య.
దేహానికి శ్రమలేకుండా కూర్చుని చేసే ఉద్యోగం తెచ్చే అనేక సమస్యల్లో ఇది ప్రధానమైనది. జీర్ణక్రియలు మందగించడం, పెద్దపేగు కదలికలు తగ్గిపోవడంతో క్రమంగా తీవ్రమైన మలబద్దకానికి దారి తీస్తుంది. నిజానికి ఇది అనారోగ్యం కారణంగా ఎదురయ్యే మలబద్దకం కాదు. కేవలం లైఫ్‌స్టైల్ సమస్య మాత్రమే. ఈ తరహా మలబద్దకానికి మందుల వాడకంకంటే జీవనశైలిని మార్చుకోవడమే సరైన మందు.
కదలికలు సరిగ్గా ఉండాలంటే...
- ఆహారంలో పీచు సమృద్ధిగా ఉన్న పదార్థాలను తీసుకోవడంతోపాటు నిద్రలేచిన తర్వాత అరగంట సేపు నడవడం, వేడి నీరు తాగడం మంచిది. అలాగే...
- టాయిలెట్ సీట్ ఎత్తు తక్కువగా ఉండాలి. హిప్స్ కంటే మోకాళ్లు ఎక్కువ ఎత్తులో ఉండాలి. మోచేతులు మోకాళ్ల మీద పెట్టుకోగలగాలి. కూర్చున్న భంగిమ బవెల్ మీద తగినంత ఒత్తిడి పడే విధంగా ఉండాలి. సులువుగా చెప్పాలంటే వెస్ట్రన్ కమోడ్ కంటే ఇండియన్ టైప్ అన్ని రకాలుగా మంచిది. అయితే... మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లకు ఇండియన్ టైప్ టాయిలెట్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్లు వెస్ట్రన్ టైప్ కమోడ్‌నే తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు పాదాల కింద చిన్న మెట్టును అమర్చుకోవాలి.
- మద్యపానం, ధూమపానం చేసే వారికి కూడా బవెల్ కదలికలు మందగిస్తాయి. అలాంటి వాళ్లు ఆ అలవాట్లను మానుకోవడం లేదా బాగా తగ్గించడమే పరిష్కారం.
Comments
Please login to add a commentAdd a comment