ప్రభుత్వ స్కూళ్లలో సరిగ్గా చదువు చెప్పరని చాలామంది అభిప్రాయం. ప్రభుత్వ టీచర్లు అందరూ అలా లేకపోయినప్పటికీ కొంతమంది వల్ల ఏర్పడిన అభిప్రాయంతో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లల్లో చదివించడానికే ఇష్టపడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తోన్న మాష్టారు ‘ప్రజలవద్దకే పాలన’ లాగా విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి చదువు చెబుతున్నారు. కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ క్లాస్‌లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆన్‌లైన్ తరగతులను వింటున్నప్పటికీ, ఆర్థిక స్థితిగతులు సహకరించని కారణంగా కొంతమంది వీటికి హాజరు కాలేకపోతున్నారు.
ఆన్‌లైన్ క్లాసుల ఖర్చు భరించలేని నిరుపేద పిల్లలకు విద్యనందించాలనే ఉద్దేశ్యంతో చంద్ర శ్రీవాత్సవ అనే టీచర్ వినూత్న ఐడియాతో.. విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఆయన తన స్కూటర్ మీద మినీ స్కూల్, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. స్కూటర్‌కు గ్రీన్‌బోర్డు తగిలించి, మినీ లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పెట్టుకుని సాగర్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో స్కూటర్ స్కూల్ మీద ప్రయాణిస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారు. అయితే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఆయన విద్యార్థుల ఇళ్ల పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేసి మైక్‌లో పాఠాలు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు.
విద్యార్థులు ఆ పుస్తకాలు చదవడం అయిపోయిన తరువాత వాటిని తిరిగి మాష్టారికి ఇచ్చేస్తున్నారు. మైక్‌లో పాఠాలు చెప్పడం, వారు వాటిని తిరిగి పలకడం వంటివి పిల్లలకు చాలా సరదాగా ఉండడంతో ఎంతో ఆసక్తిగా మాష్టారు చెప్పే పాఠాలు వింటున్నారు. ‘‘తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని.. రోజూ తమ పిల్లలకు తరగతులు బోధిస్తున్న చంద్ర శ్రీవాత్సవ మాష్టారుకు రుణపడి ఉంటాము’’ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. చంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ..‘‘ఎక్కువ మంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు.
స్మార్ట్‌ఫోన్ కొనుక్కోలేని పరిస్థితి వారిది. అందువల్ల వారు ఆన్‌లైన్ తరగతులు వినలేకపోతున్నారు. అంతేగాకుండా విద్యార్థులు నివసించే కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సదుపాయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వారు చదువుకోవడం కష్టం. అందుకే ఇలా స్కూటర్ మీద తిరుగుతూ పాఠాలు చెబుతున్నాను’’ అని ఆయన చెప్పారు. ఈ మాష్టారు పిల్లలకేగాక ఎంతో మంది టీచర్లకు, తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఇటువంటి మాష్టార్లు ఊరికి ఒకరిద్దరున్నా.. నేటి బాలలు రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment