డబుల్ ఇన్‌కమ్... నో కిడ్స్ ఫ్యామిలీ ΄ప్లానింగ్‌లో ఓ కొత్త ఒరవడి మొదలయ్యింది. నవ దంపతులు రెట్టింపు ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారు. పిల్లలు మాత్రం వద్దు అనుకుంటున్నారు. రాహుల్ మంచి జీతంతో స్థిరపడ్డాడు. పెళ్లి చేసుకోవడానికి చాలా సంబంధాలు చూసి, ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి మాత్రం ‘నేను పిల్లలను కనాలనుకోవడం లేదు’ అని కచ్చితంగా చెప్పేసింది. ఎంత నచ్చజెప్పినా పెళ్లి క్యాన్సిల్ చేస్తానంది కానీ, మాట మార్చుకోనంది. స్నిగ్ధ, కిరణ్ లు పెళ్లి తర్వాత మూడేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారు. ఆ తర్వాత అసలు పిల్లలే వద్దు అనే ఆలోచనకు వచ్చేశారు.పెద్దవాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తమ ఉద్యోగాలు మరో స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్లిపోయారు.
‘ఇది ఒకరో ఇద్దరిదో సమస్య కాదు. మేం డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ దంపతులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నారో కనుక్కుంటున్నాం’ అని తేల్చింది ప్రముఖ లాన్సెట్ అధ్యయనం. రానున్న రోజుల్లో ఇది తీవ్రమైన ఆర్థిక, సామాజిక అంశాలపై పెనుభారంగా పరిణమించనుందని స్పష్టం చేసింది.
మోయడం కష్టమట..
మొదట పిల్లలు వద్దనుకునే దంపతులు చాలా తక్కువగా కనిపించేవారు. అది పెద్దగా పట్టించుకోదగిన విషయంగా కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిస్థాయి సాంస్కృతిక ప్రధాన స్రవంతిగా మారాయి. అమెరికాలో పిల్లలు లేని కుటుంబాలు 2022 నాటికి 43 శాతానికి చేరుకున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చి చూస్తే 36 శాతానికి పైగా పెరిగింది. సమీప భవిష్యత్తులో వీరు 50 శాతానికి చేరుకోబోతున్నారు. కడుపున బిడ్డను మోయడం అనేది ఓ పెద్ద పనిగా, సమయం తీసుకునే అంశంగా భావిస్తున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు ఆర్థికాభివృద్ధిలో కొంతస్థాయికి చేరుకుంటున్న దాదాపు 90 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిర్ణయాలు అమలు
‘మేం ఇద్దరం.. మాకు ఇద్దరు’ అనేది 1970 – 80లలో ఆకట్టుకునే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం. కొత్త తరాలు కోరుకునే ఈ నినాదాలేమీ విననివి కాదు. అధిక పేదరికం ఉన్న రోజుల్లో ప్రతి స్త్రీకి 4–5 మంది పిల్లలు ఉండేవారు. దీంతో సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి ప్రభుత్వం ఈ నినాదాలు రూపోందించింది. అవి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు.
నాటి నుంచి ప్రపంచం చాలా పురోభివృద్ధి సాధించింది. సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నందున, ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరగడం ఆగిపోతుందని యునైటెడ్ నేషన్స్ జనాభా డేటా వ్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ తెలియజేస్తుంది.
రాబోయే రోజుల్లో అంటే 2050 నుంచి 2100 మధ్య కాలంలో 90 దేశాల్లో జనాభా బాగా తగ్గి΄ోనుంది. వాటిలో ఎక్కువ భాగం ఐరోపా, లాటిన్ అమెరికాలో ఉన్నాయి. జనాభా పెరుగుదల నమోదవు తున్న ఏకైక ప్రాంతంలో ఆఫ్రికా మాత్రమే. 2020–2100 ఆఫ్రికా ఖండంలో మధ్య భాగం జనాభా 1.3 మిలియన్ల నుండి 4.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దక్షిణ కొరియాలో రాజకీయ నాయకులు సంతానోత్పత్తి రేటును పెంచాలని అక్కడి దంపతులను వేడుకుంటున్నారు.
మన దేశంలో...
లాన్సెట్ కొంతకాలంగా వేస్తున్న అంచనా ప్రకారం 2050 నాటికి పిల్లల రేటు భారీగా తగ్గి, ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు సీనియర్ సిటిజన్‌గా ఉంటారు. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపే శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. మనం ఎంత దూరం వచ్చామో అర్థం చేసుకోవాలంటే 1950 మన దేశ సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంది. 1980లో 4.60 ఉండగా, 2021లో 1.91కి తగ్గింది. కొన్ని స్థానిక అంశాలు మానవ మనస్తత్వ కోణాలను పూర్తిగా మార్చేశాయి. చాలా మంది పిల్లలు వృద్ధ తల్లిదండ్రులకు పెట్టుబడి. కానీ, ఈ ఆలోచన పూర్తిగా తిరగబడింది. నేడు పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్నది. పైగా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారనే నమ్మకం లేదు.
పరిస్థితి ఇలా మారుతోంది
⇒ పేరెంట్‌హుడ్‌ను నివారించడానికి యువ జంటలు పట్టణాలలో పెంపుడు జంతువులను ఎంచుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు తక్కువ బాధ్యత ఉన్నప్పటికీ, యజమానులను బాగా ప్రేమిస్తాయి.
⇒ మరికొందరు తమ జీవితాన్ని కొత్త స్వేచ్ఛను, ప్రయాణ, సాహస క్రీడల కోసం ఉపయోగిస్తున్నారు.
⇒ నగరాలు, చిన్న పట్టణాలలో జీవనం కష్టంగా మారి పిల్లలతో కలిసి శివారుప్రాంతాలకు వలస వెళుతున్నారు. పట్టణీకరణ కేంద్రాలలోనూ జనాభా వేగంగా తగ్గిపోతోంది.
⇒ పిల్లలు లేకుండా, తల్లిదండ్రులుగా మారడానికి ఇష్టపడే జంటలు సాధారణంగా ఐటీ, అడ్వరై్టజింగ్ ఇతర అధిక కార్పొరేట్ ఉద్యోగాలలో ఉంటున్నారు. సుదీర్ఘ పని గంటల తర్వాత సమయాన్ని, డబ్బును సెలవుల కోసమే కేటాయించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment