సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ఉత్తర ప్రదేశ్‌లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్‌ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.
అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
అయితే ఉత్తరప్రదేశ్‌లో పెళ్లిళ్ల సీజన్‌లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్‌లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.
ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు.
“ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్.
Comments
Please login to add a commentAdd a comment