మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుకు కిరీటం అలంకరిస్తున్న ఆండ్రియా మెజా
Miss Universe Beauty Pageant Rules: ‘స్వీయ–వ్యక్తీకరణకు వేదిక’ అంటూ తన గురించి ఘనంగా పరిచయం చేసుకుంటుంది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (ఎంయూఓ). అయితే స్వీయ–వ్యక్తీకరణకు ఆర్గనైజేషన్ రూల్‌బుక్‌లో కొన్ని నిబంధనలు అడ్డుపడుతున్నాయని, పరిమితులు విధిస్తున్నాయనే విమర్శ ఉంది. మొన్నటి వరకు– ‘ఆ నిబంధనలు అంతే. అప్పుడూ ఉన్నాయి. ఎప్పుడూ ఉంటాయి’ అన్నట్లుగా వ్యవహరించిన ఆర్గనైజేషన్ ఒక చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది...
అప్పటి వరకు సింగిల్‌గానే ఉండాలి!
మిస్ యూనివర్స్ 2023 పోటీలో వివాహితులు, మాతృమూర్తులు కూడా నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. నిబంధనను సవరించడానికి శ్రీకారం చుట్టడం ద్వారా విప్లవాత్మకమైన, చారిత్రాత్మక మార్పు దిశగా అడుగు వేసింది ఎంయూవో. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం విశ్వసుందరి పోటీల్లో వివాహితులు, మాతృమూర్తులు పాల్గొనడానికి అనర్హులు. టైటిల్ దక్కించుకున్నవారు కొత్త విజేత ఆగమనం వరకు సింగిల్‌గానే ఉండాలి.
మార్పు మంచిదే!
‘ఎంయూవో’లో వచ్చిన మార్పుపై తన సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆండ్రియా మెజా. మెక్సికోకు చెందిన ఆండ్రియా ‘మిస్ యూనివర్స్ 2020’ కిరీటాన్ని దక్కించుకున్న విజేత. ‘సమాజంలో రోజురోజూకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. అవి ఆయా రంగాలలోప్రతిఫలిస్తున్నాయి. మహిళలు నాయకత్వ స్థానాల్లోకి వెళుతున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు.
మార్పు అన్ని రంగాలలోనూ రావాలి. దీని ప్రకారం చూసినప్పుడు మిస్ యూనివర్స్ పోటీలో వివాహితులు, తల్లులకు ప్రవేశం కల్పించడం అనేది ఆహ్వానించదగిన, హర్షించాల్సిన మార్పు. అయితే ఈ నిర్ణయం కొద్దిమందికి రుచించక పోవచ్చు. దీనికి కారణం వారి వ్యక్తిగత స్వార్థం తప్ప మరేదీ కాదు. ప్రస్తుత మార్గదర్శకాలలో అవాస్తవికత కనిపిస్తుంది. పెళ్లి, మాతృత్వంలాంటి వ్యక్తిగత నిర్ణయాలు వారి ప్రతిభకు అడ్డంకి కావడం అనేది సమర్థనీయం కాదు.
ఇరవై ఏళ్లకే పెళ్లై పిల్లలు ఉన్నవారు ఉన్నారు. వారిలో ఎంతోమందికి మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలనే కల ఉండవచ్చు. నిబంధనల వల్ల తమ కలను సాకారం చేసుకునే అవకాశం దక్కి ఉండకపోవచ్చు. తాజా మార్పు వల్ల ఇలాంటి మహిళల జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది’ అంటుంది ఆండ్రియా మెజా.
రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది!
‘ఇది మొదటి అడుగు. ఇంకా ఎన్నో అడుగులు పడాలి’ అంటుంది బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త అక్షర. విడాకులు తీసుకున్నవారు, అబార్షన్ చేయించుకున్నవారు పోటీలో పాల్గొనడానికి అనర్హులు అనేది ఒకప్పుడు ‘మిస్ అమెరికా’ నిబంధనలలో ఉండేది. మోడల్ వెరోనిక 2018లో ‘మిస్ ఉక్రెయిన్’ టైటిల్‌ను గెల్చుకుంది.
అయితే ఆమె అయిదు సంవత్సరాల పిల్లాడికి తల్లి అని ఆలస్యంగా తెలుసుకున్న ఆర్గనైజేషన్ ఆ టైటిల్‌ను వెనక్కి తీసుకుంది. టైటిల్‌ను వెనక్కి తీసుకోవడంపై మండిపడడమే కాదు న్యాయపోరాటానికి కూడా సిద్ధపడింది వెరోనిక. ‘రూల్ అంటే రూలే అనుకునే రోజులకు కాలం చెల్లింది. కాలంతోపాటు అవి మారితేనే కాలానికి నిలబడతాయి’ అంటుంది జైపూర్‌కు చెందిన శాన్వి.
అంతబాగానే ఉంది.. కానీ!
తాజాగా 70 వసంతాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించింది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. ఇది డిజిటల్ సంచిక. ‘175, 000 పేపర్ పేజీల అవసరం లేకుండా ఈ డిజిటల్ సంచిక తీసుకువచ్చాం’ అంటుంది ఆర్గనైజేషన్ పర్యావరణహిత స్వరంతో.
ఇది బాగానే ఉందిగానీ, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌లోని నిబంధనలు, భావజాలానికి సంబంధించి(వర్ణం, ఒడ్డూపొడుగు...ఇలాంటివి మాత్రమే అందానికి నిర్వచనాలా!) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శిబిరాల నుంచి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. చెవివొగ్గి, వాటిని సానుకూలంగా అర్థం చేసుకొని ముందుకు కదిలితే సంస్థకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించడానికి అట్టే కాలం పట్టదు.
చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..!
The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4
— Miss Universe (@MissUniverse) December 13, 2021
Comments
Please login to add a commentAdd a comment