నిశబ్దపుచెరలో చిక్కిన ఒంటరితనానికీ, నిశీధి నీడలో నక్కిన రాతిరికీ.. అసలైన రారాజు ‘భయం’. ఆ భయం తెరలు మనసుని అలముకున్నప్పుడు.. ఎక్కడో దూరంగా కుక్క మొరిగినా.. కాస్త దగ్గర్లో పిల్లి నడిచినా.. చివరికి చిరుగాలి వీచి చిన్న కాగితం ముక్క రెపరెపలాడినా సరే.. గుండె అదరడం ఖాయం.
అలాంటిది ఇంట్లోనే ఆత్మలు తిరిగితే? దెయ్యాలు వికృత చేష్టలు చేస్తుంటే? ఆ ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ? అమెరికాలోని ది బెల్లెయిర్ హౌస్ అలాంటిదే. పరిశోధకులే పలు నిర్ధారణలతో నిరూపించిన నిజమిది. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయి? ఎలా గుర్తించారు? చదవండి ఈ వారం మిస్టరీలో..
అది 1847. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని బెల్లెయిర్ విలేజ్‌లో ఎకరం స్థలంలో ఈ ఇంటిని నిర్మించారు. అది ఒహైయో నదీతీర ప్రాంతం. ఆ ఇంటి భూగర్భంలో మైనింగ్ జరుగుతూ ఉండేది. జాకోబ్ హెతెరింగ్టన్ అనే గనుల తవ్వకాల వ్యాపారి.. ఎలిజా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే అందాలరాశిని పెళ్లాడి అదే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే పెళ్లికి ముందు మొదటిసారి జాకోబ్‌ని కలవడానికి ఆ ఇంటికి వచ్చిన ఎలిజా.. ఒహైయో నదీతీరంలో ఆకాశం నుంచి రాలి పడిన ఓ తారను చూసింది.
అలా చూస్తే అమెరికన్లు దాన్ని అపశకునంగా భావిస్తారు. ఊహించినట్లే పెళ్లి తర్వాత ఎలిజా ఆ ఇంట్లో ఎన్నో విచిత్రపరిణామాలు చూసిందనేది వినికిడి. దానికి కారణం ఆ ఇంటి సమీపంలో ఒహైయో నది ఒడ్డునే 1754 నుంచి 1763 వరకూ ఫ్రెంచ్–ఇండియన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చనిపోయిన వారంతా అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది స్థానికంగా.
మరోవైపు ఇంటి వెనుకున్న ఓ గుహలో షానీ జాతి అమెరికన్లు.. చనిపోయిన తమ వంశస్థుల శవాలను అక్కడే పూడ్చిపెట్టేవారు. అలా పూడ్చిన సమాధుల్లో క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్ల మృతదేహాలూ ఉండటంతో ఆ నెగెటివ్ ఎనర్జీ.. బెల్లెయిర్ హౌస్ చుట్టే తిరుగుతోందని ఆనాటి హారర్ వార్త. ఆ నేపథ్యంలో ఆ ఇంట్లో ఓ దుర్ఘటన జరిగింది. మైనింగ్ వ్యాపారిగా ఉన్న జాకోబ్.. అంచలంచెలుగా ఎదుగుతున్న సమయమది.
ఆ ఇంటి భూగర్భంలో ఉన్న ఓ గనిలో అగ్ని ప్రమాదం జరిగి 42 మంది సజీవదహనం అయ్యారు. ఆ నష్టనివారణలో జాకోబ్ చాలా ఆస్తుల్ని కోల్పోయాడు. కొంతకాలానికి జాకోబ్ చనిపోతూ.. తన గనుల వ్యాపారాన్ని కొడుకు అలెక్స్‌కి అప్పగించాడు. జాకోబ్ మనవరాలు లైడ్ కూడా అలెక్స్‌కి మైనింగ్ వ్యాపారంలో తోడుగా నిలిచింది. ఆ ఇంట్లో జరిగిన పరిణామాలతో అలెక్స్ చాలా ఇబ్బందిపడ్డాడు. ‘దెయ్యాలు నన్ను చంపేస్తాయి’ అంటూ చాలా భయపడేవాడు.
పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే మైనింగ్ వ్యాపారం చేజెక్కించుకున్న లైడ్ ఆ ఇంట్లోని డైనింగ్ రూమ్‌లో శవమై కనిపించింది. మేరీ అనే ఆ ఇంటి పనిమనిషి కూతురు ఇంటి కిటికీ నుంచి కిందపడి చనిపోయింది. దాంతో ఎన్నో ఏళ్లు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. అయితే ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో కదలాడుతున్నట్లు.. లోపల ఎవరో ఉన్నట్లు.. కిటికీల్లోంచి ఎవరో తొంగి చూస్తున్నట్లుగా అనిపించేదట స్థానికులకు.
పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, రైటర్, ప్రస్తుత ఇంటి యజమాని క్రిస్టిన్ లీ అనే మహిళ కూడా ఆ ఇంట్లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. దాంతో ఆ ఇంటి చరిత్రపై.. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది అనే దానిపై పరిశోధనలు చెయ్యడం మొదలుపెట్టింది. దానికి సంబంధించి ‘పారానార్మల్ కన్ఫెషన్’ అనే పుస్తకమూ రాసింది. అందులో అక్కడున్న దెయ్యాల గురించి, వాటి ప్రవర్తన గురించి వివరించింది.
అంతేకాదు కొందరి పరిశోధకుల సాయంతో అక్కడ నిజంగానే ఆత్మలు ఉన్నాయని నిరూపించింది. 20వ శతాబ్దం నుంచే ఆ ఇల్లు దెయ్యాల వశమైందనీ, రకరాకాల నెగెటివ్ ఎనర్జీలన్నీ అక్కడ పోగయ్యాయనీ, అందులో మంత్రగాళ్లు, సైనికులు ఇలా చాలా ఆత్మలు ఉన్నాయనీ పరిశోధకులు తేల్చారు. అక్కడ ఆత్మలతో మాట్లాడిన వీడియోలు యూట్యూబ్‌లో కూడా బాగా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం క్రిస్టిన్ లీ ఆధ్వర్యంలో.. 175 ఏళ్ల నాటి ఈ ఇల్లు ఆత్మల నిలయంగా మారి ఉత్సాహవంతులు, సాహసికులకు రాత్రిళ్లు విడిది ఇచ్చే టూరిస్ట్ ప్రాంతంగా మారిపోయింది. అక్కడకి వెళ్లి కొన్ని గంటలు ఆ ఇంట్లో గడిపి, అక్కడ జరిగే వింతలను స్వయంగా ఆస్వాదిస్తున్నారు భూతప్రేతాత్మ ప్రియులు. తమ అనుభవాలను ఎంతో గొప్పగా ప్రపంచంతో పంచుకుంటున్నారు.
మొత్తం ఐదు కారణాలు
ఆ ఇంటి నుంచి ఆకాశంలోకి చూస్తే.. అంగారక, శని, బుధ, శుక్ర, గురు గ్రహాలు కనిపిస్తాయట. ఆ గ్రహాల నెగెటివ్ ప్రభావం కూడా ఆ ఇంటిపై ఉండవచ్చునని పరిశోధకులు తేల్చారు. మొత్తంగా.. యుద్ధంలో సైనికుల ఆత్మలు, ఆకాశం నుంచి రాలిన తార, గుహలో సమాధులు, గనిలో ప్రమాదం, గ్రహాల ప్రభావం.. ఇలా ఐదు ప్రధాన కారణాలతో ప్రేతాత్మలు, నెగెటివ్ ఎనర్జీలు బెల్లెయిర్ హౌస్‌పై పడ్డాయనేది పరిశోధకుల మాట.
‘చనిపోయిన తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలంటే.. ఆ ఇంటికి వెళ్లాల్సిందే’ అంటున్నారు సాహసికులు. ఏది ఏమైనా అమెరికాలో దెయ్యాల భయంతో ఖాళీ అయిన నాలుగు అతిపెద్ద ఇళ్లల్లో ఇదీ ఒకటి. నిజంగానే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? స్థానికంగా ఉన్న భయాన్ని అవకాశంగా తీసుకుని.. టూరిజం డెవలప్‌మెంట్ కోసం సాగుతున్న డ్రామానా అనేది నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment