పాడ్‌కాస్ట్‌లో కడుపుబ్బా నవ్వించే జోక్స్ వినవచ్చు. కమ్మని సంగీతం వినొచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అయితే మహిళల ఆధ్వర్యంలోని కొన్ని పాడ్‌కాస్ట్‌లు మాత్రం ఎన్నో విషయాలను నీళ్లు నమలకుండా చర్చిస్తున్నాయి. మన గురించి, సమాజం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నాయి...
సీరియస్ విషయాలను సీరియస్‌గానే మాట్లాడుకోవాలనే నిబంధన ఏమీ లేదు. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కూడా మాట్లాడవచ్చు. ఈ పాయింట్ దగ్గరే విజయం సాధించింది నవ్య నవేలీ నందా. నవ్య పాడ్‌కాస్ట్ ‘వాట్ ది హెల్ నవ్య’ శ్రోతలకు దగ్గర కావడానికి కారణం ‘సీరియస్ విషయాలైనా సరే కాస్త సరదాగా మాట్లాడుకుందాం’ అనే కాన్సెప్ట్.
ఈ పాడ్‌కాస్ట్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన నవ్య నందా, శ్వేతా నందా, జయబచ్చన్‌లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడారు. అయితే వారేమీ ఉపదేశం ఇచ్చినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు ఉండదు. సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇరుగుపొరుగుతో సహజంగా సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది.
‘నేను నవ్య అమ్మను మాట్లాడుతున్నాను. ఒక సరదా విషయం మీకు చెప్పుకోవాలని ఉంది’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది శ్వేతా నందా.
‘నేను నవ్య నానీని. మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది’ అని ఊరిస్తుంది జయబచ్చన్.
‘త్రీ లేడీస్’ ‘త్రీ జెనరేషన్స్’ ‘త్రీ పర్‌స్పెక్టివ్స్’ అంటూ వచ్చిన ప్రోమో ఆకట్టుకొని ఆసక్తి పెంచింది.
వ్యాపారం అనేది అనుకున్నంత సులువు కాదు. ఎంత దిగ్గజ వ్యాపారికైనా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిలో ఏ మేరకు ఉత్తీర్ణత సాధించారనేదానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ‘నో సుగర్ కోట్’ పాడ్‌కాస్ట్ ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోరాటస్ఫూర్తి, అనుసరించాల్సిన వ్యూహాలు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంది పూజా దింగ్రా. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్‌లతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునేవారిని ఆకట్టుకుంటున్న పాడ్‌కాస్ట్ ఇది.
చెఫ్‌గా మంచి పేరు తెచ్చుకున్న పూజా సీజన్‌వన్‌లో ఎంతో మంది సక్సెస్‌ఫుల్ చెఫ్‌లు, ఫుడ్‌రైటర్స్‌ను ఇంటర్వ్యూ చేసింది. ‘నల్లేరుపై నడక అనేది వాస్తవం కాదు. భ్రమ. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే’ అంటోంది పూజా.
మానసిక ఆరోగ్యంలాంటి సీరియస్ విషయాలతో పాటు బ్యాచ్‌లర్ పార్టీలాంటి తేలికపాటి విషయాల గురించి మాట్లాడటానికి ‘రియల్ టాక్ విత్ స్మృతి నొటాని’ పాడ్‌కాస్ట్ వేదిక అవుతుంది. స్మృతి మాట్లాడుతుంటే అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ గలగలమని మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియా ధోరణుల గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటుంది స్మృతి.
‘ఫ్యాట్.సో?’ ....పేరు ద్వారానే తన పాడ్‌కాస్ట్ లక్ష్యం ఏమిటో తెలియజేశారు పల్లవినాథ్, అమేయ నాగరాజ్. స్థూలకాయం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు, ఆత్మన్యూనతకు గురయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తుంది ఈ పాడ్‌కాస్ట్.
‘మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దగ్గరవుతుంది. అదొక ఆయుధం అవుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇంధనం అవుతుంది’....ఇలాంటి మాటలు ఎన్నో ‘ఫ్యాట్.సో’లో వినిపిస్తాయి.
సీరియస్ విషయాలే కాస్త సరదాగా!
Published Sun, Dec 18 2022 4:49 AM | Last Updated on Sun, Dec 18 2022 4:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment